ప్లాస్టిక్ నిషేధించలేరా..?
ABN , Publish Date - Jul 18 , 2025 | 12:39 AM
భీమవరం పట్టణంలో ప్లాస్టిక్‌ను అధికారులు నిషేధించలేరా? పట్టణ ప్రజలకు రక్షిత నీరు అందించలేరా? పింక్ టాయిలెట్స్ ఎందుకు నిర్మించలేకపోతున్నారని కలెక్టర్ నాగరాణి ఆగ్ర హం వ్యక్తం చేశారు.
అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
పట్టణాల్లో రక్షిత నీరు అందించాలి
పింక్ టాయిలెట్స్ నిర్మాణంలో జాప్యం
‘భవ్య భీమవరం’ ప్రగతి ఏదీ..?
వచ్చే నెల 15 నాటికి పనులు పూర్తి కావాలి
కలెక్టర్ నాగరాణి దిశా నిర్దేశం
భీమవరం టౌన్, జూలై 17(ఆంధ్రజ్యోతి): భీమవరం పట్టణంలో ప్లాస్టిక్‌ను అధికారులు నిషేధించలేరా? పట్టణ ప్రజలకు రక్షిత నీరు అందించలేరా? పింక్ టాయిలెట్స్ ఎందుకు నిర్మించలేకపోతున్నారని కలెక్టర్ నాగరాణి ఆగ్ర హం వ్యక్తం చేశారు. ‘భవ్య భీమవరం’ అభివృద్ధిపై దాతల సహకారంతో చేపట్టిన పనులు నత్తనడకన సాగడంపై కలెక్టర్ మండిపడ్డారు. దాతలు, అధికారులతో గురువారం కలెక్టర్ నాగరాణి సమీక్షించారు. భీమవరం పట్టణంలో ఆరు నెలల క్రితమే ప్లాస్టిక్ నిషేధం ప్రకటించినా ఎందుకు నిరోధించలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లు కనిపిస్తే సంబంధిత శానిటరీ సెక్రటరీలపై చర్యలు తప్పవన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల ప్రభులే అవ కాశం ఉందని, పారిశుధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాల న్నారు. తాగునీటి సరఫరాపై ఫిర్యాదులు రాకూడదన్నారు.
పింక్ టాయిలెట్స్ నిర్మాణంలో అలసత్వం
మహిళలు, గర్భవతులు, పాలిచ్చే తల్లులు, యువతుల కోసం ప్రతి పట్టణంలో చేపట్టాల్సిన పింక్ టాయిలెట్ నిర్మా ణంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని కలెక్టర్ నాగరాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిసిపల్ కమిషనర్, ఎంహెచ్‌వో, ఆర్డీవోలు దీనిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. తణుకు బస్టాండ్‌లో శంకుస్థాపన చేసిన పింక్ టాయిలెట్ నిర్మాణంలో సాకులు చూపుతున్న ఆర్టీసీ ఆర్‌ఎంపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ఉచితంగా నిర్మించి ఇస్తామంటే సాకులు చెప్పడం తగదన్నారు. భీమవరం బస్టాండ్ సమీపంలో గుర్తించిన స్థలంలో పింక్ టాయిలెట్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పట్టణంలో ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేసిన బ్యానర్లను వెంటనే తొలగించాలని మునిసిపల్ అధికారులను ఆదేశించారు. మావుళ్లమ్మ దేవస్థానం వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరించేలా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
అభివృద్ధి పనులు పూర్తి చేయండి
భవ్య భీమవరం పేరిట చేపట్టిన అభివృద్ధి పనులను వచ్చేనెల 15న నాటికి పూర్తిచేయడానికి కృషి చేయాలని దాతలు, అధికారులకు కలెక్టర్ నాగరాణి సూచించారు. ఇప్పటికే పనులు ప్రారంభించి ఆరు నెలలు దాటిందన్నారు. భీమవరం పాత బస్టాండ్ పనులపై ఆరా తీశారు. హౌసింగ్ బోర్డుకాలనీలో ఆదిత్య పార్క్ పనులను వచ్చేనెల 15న ప్రారంభోత్సవం చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జేసీ టి.రాహుల్‌కుమార్ రెడ్డి, మునిసిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, మునిసిపల్ ఇంజనీరింగ్ అధికారి టి.త్రినాథరావు, డీఈలు, ఏఈలు, టీపీవో, టౌన్ సర్వేయర్, ఆర్ అండ్ బి అధికారి, వివిధి అభివృద్ధి పనులు చేపట్టిన దాతలు, తదితరులు పాల్గొన్నారు.