హాస్టల్ ఎలా ఉంది?
ABN , Publish Date - Jun 25 , 2025 | 12:43 AM
హాస్టల్ ఎలా ఉంది.. వసతులు బాగున్నాయా..? భోజనం, బుక్స్ సక్రమంగా అందుతున్నాయా.. అంటూ కలెక్టర్ నాగరాణి విద్యార్థు లను ఆరా తీశారు.
ఉండి, జూన్ 24(ఆంధ్రజ్యోతి): హాస్టల్ ఎలా ఉంది.. వసతులు బాగున్నాయా..? భోజనం, బుక్స్ సక్రమంగా అందుతున్నాయా.. అంటూ కలెక్టర్ నాగరాణి విద్యార్థు లను ఆరా తీశారు. ఉండి ఎస్సీ పేటలోని బాలికల హాస్టల్, బీసీ బాలుర వసతి గృహాన్ని మంగళవారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్ పరిసరాల్లో పారిశుధ్యం పరిశీలించారు. విద్యార్థినులకు ప్రభుత్వం అందించే కాస్మొటిక్స్, తదితర సౌకర్యాలపై ప్రశ్నించారు. పాఠశాలకు మానకుండా వెళ్లాలని, ప్రతీ విద్యార్థి విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సూచించారు. వసతిగృహంలో ఐటీఐ విద్యార్థులను వారు చదువు తున్న ట్రేడ్ వివరాలు అడిగారు.
అనంతరం ఉండిలో వారపు సంతను పరిశీలించారు. కూరగాయలు, విత్తనాల వ్యాపారులను కలెక్టర్ పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట సంక్షే మ శాఖ అధికారులు, తహసీల్దారు, ఎంపీడీవో, ఇతర అధికారులు పాల్గొన్నారు.
గృహ నిర్మాణాల్లో అలసత్వం వద్దు
భీమవరం రూరల్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): గృహ నిర్మాణాల్లో అలసత్వం వద్దని, లక్ష్యంలో వెనకపడితే చర్యలు తప్పవని కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి గృహ నిర్మాణ ప్రగతిపై మండలాల వారీగా అధికారులతో మంగళవారం సమీక్షించారు. నిర్దేశిత లక్ష్యాలు సాధించలేకపోతే సం బంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. గృహ నిర్మాణాలలో అలసత్వం వహించే కాంట్రాక్టర్లను తొలగించి, కొత్త వారిని నియమించుకుని పనులు వేగవంతం చేయాలన్నారు. 15 రోజుల్లో లక్ష్యాన్ని పూర్తిచేసి నివేదికను సమర్పించాలన్నారు. గృహ నిర్మాణ శాఖ పీడీ జి.పిచ్చయ్య, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.