Share News

కొబ్బరి అ‘ధర’హో

ABN , Publish Date - Jul 08 , 2025 | 12:31 AM

కొబ్బరి అ‘ధర’హో స్థాయిలో ఉండడంతో అటు రైతులు, ఇటు వ్యాపారుల్లో జోష్‌ నెలకొంది.

కొబ్బరి అ‘ధర’హో

ధర ఆల్‌టైం రికార్డ్‌

వెయ్యి కాయలు పశ్చిమలో రూ.20 వేలు.. తూర్పులో రూ.22 వేలు

ఆగస్టు నాటికి రూ.25 వేలకు చేరే అవకాశం

పాలకొల్లు, యలమంచిలి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): కొబ్బరి అ‘ధర’హో స్థాయిలో ఉండడంతో అటు రైతులు, ఇటు వ్యాపారుల్లో జోష్‌ నెలకొంది. నారికేళం ధరలు మునుపెన్నడూ లేని స్థాయికి ఎగబాకి ఆల్‌ టైం రికార్డు నెల కొల్పాయి. పూర్వ పశ్చిమగోదావరి జిల్లాలో రైతు వారీ వెయ్యి కాయల ధర గరిష్ఠంగా రూ.20 వేలు ఉండగా, తూర్పుగోదావరి జిల్లాలో రూ.22 వేలు ఉంది. జూలై మాసాంతం, ఆగస్టులో వచ్చే వినాయకచవితి నాటికి ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్‌ విశ్లేష కులు చెబుతున్నారు. ఆగస్టులో రూ.25 వేలకు పైబడి ధర పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం కొబ్బరి దిగుబడులు తక్కువగా ఉన్నప్పటికీ ధర గణనీయంగా పెరగడంతో రైతులు సంతృప్తిగా ఉన్నారు. గడచిన మూడు, నాలుగేళ్లలో కొబ్బరి ధరలు తక్కువ. దీంతో రైతులు కొబ్బరిసాగులో సస్యరక్షణ చర్యలు చేప ట్టేందుకు రైతాంగం అంతగా ఆసక్తి కనబరచ లేదు. కొబ్బరి చెట్లకు సకాలంలో సేంద్రియ, రసాయన ఎరువులు వేయకపోవడం, దుక్కి, నీటి తడులు ఎక్కువసార్లు పెట్టకపోవడంతో పాటూ, కొబ్బరిచెట్లకు తెగులుసోకి ఆకులు నల్లగా మారిపోవడం వంటి వాటితో కొబ్బరి కాయ పరిమాణం తగ్గింది. ప్రతి వంద కాయ లలో 20 నుంచి 30 చిన్నకాయలు వస్తున్నాయి. దీంతో ఈ కాయలను వర్తకులు రెండింటిని ఒక టిగా లెక్కిస్తున్నారు. ఈవిధంగా రైతులు నష్టపోతున్నారు. మరోవైపు దిగుబడి గణనీయం గా తగ్గిపోయింది. అయినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే కొబ్బరి రైతులు సంతృప్తిగానే ఉన్నారు. ప్రస్తుతం కొబ్బరి ధరలు గరిష్ఠస్థాయికి చేరడం తోపాటూ, భవిష్యత్తులో మార్కెట్‌ నిలకడగా ఉంటుందని అంచనాలు ఉండడంతో కొబ్బరి రైతులు కొబ్బరి సాగుపై ఆసక్తి కనబరుస్తు న్నారు. పక్వానికి వచ్చిన కాయలే దింపాలని, వచ్చే ఒకటి, రెండు నెలల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున.. అప్పటికి పక్వా నికి వచ్చిన కాయలు ఉంటే రైతులకు లాభం చేకూరుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. పాత తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కొబ్బరి ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతు న్నాయి. పచ్చికొబ్బరి గండేరా (ఢిల్లీ క్వాలిటీ) రూ.20 వేల నుంచి రూ.22వేలు పలుకుతోంది. 70–80 బత్తీల కాయలు వెయ్యి రూ.12 వేలు ఉండగా, నెంబరు కాయల ధర రూ.13 వేలు ఉంది. కురిడీ కాయల ధర రూ.25 వేలు ఉంది.

ఊపందుకున్న ఎగుమతులు

తమిళనాడు, కేరళలో కొబ్బరి దిగుబడి దాదాపు 50 శాతానికి తగ్గిపోవడంతో ఇక్కడి కొబ్బరికి విపరీతమైన డిమాండ్‌ వచ్చింది. అంతేకాక ఉత్తరాద్రి రాష్ట్రాల్లో కొబ్బరి పరిశ్రమ లు వినియోగించే ఎండు కొబ్బరి ఇండోనేషియా, ఽథాయ్‌లాండ్‌ తదితర దేశాల నుంచి దిగుమతి తగ్గిన కారణంగా ఉభయ గోదావరి జిల్లాల కొబ్బరికి డిమాండ్‌ పెరిగిందని పరిశీలకులు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి రాయలసీమ ప్రాంతానికి, తెలంగాణలో పలు ప్రాంతాలతో పాటు గుజరాత్‌, రాజస్థాన్‌, మహా రాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఇంకా పలు ఉత్తరాది రాష్ట్రాలకు కొబ్బరికాయలు ఎగమతు లు అవుతున్నాయి. ఏటా జూలై, ఆగస్టు నెల ప్రథమార్థంలో బిహారు రాష్ట్రానికి కొబ్బరి ఎగు మతులు అవుతాయి. 15 రోజులుగా బిహారు రాష్ర్టానికి ఎగుమతులు మొదలయ్యాయి. ఒలి చిన కొబ్బరికాయలను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగు మతి చేస్తారు. బిహారు రాష్ట్రానికి మాత్రం కొబ్బ రిచెట్ల నుంచి దించిన కాయలను నేరుగా ఎగు మతి చేస్తారు. మరికొన్ని రోజుల్లో బిహారుకు ఎగుమతులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కోనసీమ, పాలకొల్లు ప్రాంతాల నుంచి ప్రతీరోజూ సుమారు 50 నుం చి 70 లారీలు కొబ్బరికాయ ఎగుమతి అవుతుం డేవి. ప్రస్తుతం ఈ ప్రాంతాల నుంచి సుమారు 100 పైబడి లారీల కొబ్బరి ఎగుమతులు అవు తున్నాయని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి.

పండుగలకు మరింత డిమాండ్‌

సాధారణంగా వినాయకచవితి, దీపావళి, కార్తీక మాసం సీజన్లలో కొబ్బరికి డిమాండ్‌ ఉంటుందని, దీంతోపాటు 2026 జనవరిలో మేడారం జాతర తేదీలను ఖరారు చేయడంతో కొబ్బరి ధరలు ఆశాజనకంగా ఉండడంతో పాటూ, భవిష్యత్‌లో మార్కెట్‌ నిలకడగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అంచ నాలతో కొబ్బరి రైతులతో పాటు, వ్యాపారులు ఆచితూచి అమ్మకాలు చేస్తున్నారు.

ధర పెరగడంతో గిట్టుబాటు

రెండేళ్లుగా కొబ్బరి ధరలు తక్కువగానే ఉన్నాయి.. దీనికితోడు దిగుబడి 50 శాతానికి పడిపోవడంతో దింపు కార్మికులకు, కూలీలకు సొమ్ములు చెల్లించగా రైతులకు ఏమీ మిగలని పరిస్థితులు చవిచూశాం. దిగుబడి తగ్గినప్పటికీ ప్రస్తుతం కొబ్బరి ధర పెరగడంతో గిట్టుబాట వుతోంది. కొబ్బరికాయలకు కనీస మద్ధతు ధరను ప్రభుత్వం నిర్ణయించి అమలు చేస్తే కొబ్బరి రైతులకు మేలు జరుగుతుంది.

– చిలుకూరి ప్రసాద్‌, కొబ్బరిరైతు, యలమంచిలి

రెట్టింపైన ఎగుమతులు

పాలకొల్లు ప్రాంతం నుంచి ప్రతిరోజూ 30 లారీ ల కొబ్బరి ఎగుమ తయ్యేది. ప్రస్తుతం డిమాండ్‌ నేపథ్యంలో 60 లారీలపై ఎగుమతువుతున్నాయి. వర్షాల కారణంగా కొబ్బరి దింపు, వొలుపు వాయిదా పడుతోంది. వర్షాలు తగ్గితే ఎగుమతికి అవకాశం ఉంటుంది. ధరలు నిలకడగా ఉంటే రైతులు, వ్యాపారులతో పాటు, కొబ్బరికార్మికులకు మేలు జరుగుతుంది. 2 నెలలు కొబ్బరి మార్కెట్‌ నిలకడగా ఉండవచ్చు.

– సీహెచ్‌.నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు, కోకోనట్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌

Updated Date - Jul 08 , 2025 | 12:31 AM