Share News

నాణ్యమైన పంటల దిగుబడిపై దృష్టి పెట్టాలి

ABN , Publish Date - Jun 22 , 2025 | 12:43 AM

రైతులు నాణ్యమైన పంటల దిగుబడిపై దృష్టి పెట్టాలని ఏలూరు జిల్లా కలెక్టర్‌ కె.వెట్రి సెల్వి అన్నారు. పెదవేగి మండలం కొండలరావుపాలెంలో రంగోల పాండురంగారావు తోటలో కోకో గింజల కొనుగోలు ప్రక్రియను శనివారం ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్‌ కోకో బస్తాల తూకాన్ని సరిచూశారు.

నాణ్యమైన పంటల దిగుబడిపై దృష్టి పెట్టాలి
కోకో గింజలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెట్రిసెల్వి

కోకో, ఆయిల్‌పామ్‌ సాగులో ఏలూరు జిల్లా దేశంలోనే అగ్రస్థానం

ఏలూరు జిల్లా కలెక్టర్‌ వెట్రి సెల్వి

పెదవేగి, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): రైతులు నాణ్యమైన పంటల దిగుబడిపై దృష్టి పెట్టాలని ఏలూరు జిల్లా కలెక్టర్‌ కె.వెట్రి సెల్వి అన్నారు. పెదవేగి మండలం కొండలరావుపాలెంలో రంగోల పాండురంగారావు తోటలో కోకో గింజల కొనుగోలు ప్రక్రియను శనివారం ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్‌ కోకో బస్తాల తూకాన్ని సరిచూశారు. రైతులతో మమేకమై సాగులో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణం స్పందించి, అవసరమైన సాయం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. కోకో, ఆయిల్‌ పామ్‌ సాగులో ఏలూరు జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. ఇప్పటివరకు కోకోను కొబ్బరిలో అంతరపంటగానే సాగుచేస్తున్నారని, ఇకపై ఆయిల్‌పామ్‌ పంటలోకూడా అంతరంగా సాగు చేసేలా ప్రమోట్‌ చేస్తున్నామని చెప్పారు. ఆయిల్‌ పామ్‌, కోకో పంటల సాగుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గతనెల 26న జిల్లా పర్యటనలో ఇచ్చిన హామీలో భాగంగా కోకో గింజలకు కిలోకు రూ.50 రాయితీ ప్రకటించా రని, ఈ రాయితీని కొనుగోలు సమయంలోనే రైతు లకు అందిస్తున్నామని వివరించారు. జిల్లాలో 1800 టన్నుల కోకో గింజలు నిల్వ ఉండగా, ఇప్పటివరకు 1250 టన్నులు కొనుగోలు చేశామని ఈనెలాఖరు లోగా మిగిలిన పంట కొనుగోలు ప్రక్రియను పూర్తిచేస్తామని రైతులకు భరోసానిచ్చారు. జిల్లా ఉద్యానశాఖాధికారి ఎస్‌.రామ్మోహన్‌, తహసీల్దారు ఎస్డీ.భ్రమరాంబ, మండల ఉద్యానశాఖాధికారి ఎం.రత్నమాల, పంచాయతీ కార్యదర్శి సీహెచ్‌.లక్ష్మి, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2025 | 12:43 AM