కాలు దువ్వుతున్న కోఢీ
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:30 AM
సంక్రాంతికి పందెం కోళ్లు కాలు దువ్వుతున్నాయి. పందెం రాయుళ్లను ఆకట్టుకోవడానికి నిర్వాహకులు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు.
సంక్రాంతి కోడి పందేలకు సన్నాహాలు..!
ప్రతి బరిలోనూ సిండికేట్
పుంజు ధరలకు రెక్కలు
తాడేపల్లిగూడెం, చిన అమిరంలో
కోటి రూపాయల వరకు..
పెద్ద బరుల్లో ముసుగు పందేలు?
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
సంక్రాంతికి పందెం కోళ్లు కాలు దువ్వుతున్నాయి. పందెం రాయుళ్లను ఆకట్టుకోవడానికి నిర్వాహకులు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ముసుగు, జోడీ పందేలకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఒక్కో పందెం లక్షల్లోనే ఉంటుందని అంచనా. జిల్లాలో కోడి పందేలకు తెలంగాణ. తమిళనాడు, కర్నాటక రాష్ట్రా లతోపాటు, రాయలసీమ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివస్తారు. ఇప్పటికే భీమవరం, తాడే పల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురంతోపా టు, ఆకివీడు ప్రాంతాల్లో హోటల్ గదులు బుక్ చేసుకున్నారు. పండుగ మూడు రోజులు గదులు ఖాళీ లేవు. గత ఏడాది కంటే ఈసారి కోడి పందేల జోష్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముందుగానే కోడి పుంజులను కొనుగోలు చేసుకుం టున్నారు. అందాన్ని బట్టి ధర పలుకుతోంది. పేరుమోసిన పందెం రాయుళ్లు పుంజు పోరాటానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కదలికలను పసిగట్టి ధర పెంచి కొనుగోలు చేస్తున్నారు. యువత కూడా జట్టుగా కలిసి పందెం కోళ్లు కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. పుంజు అందం, సామర్ధ్యానికి ప్రాధా న్యం ఇస్తున్నారు. ప్రత్యేకంగా పందేల కోసం పెంచే వాళ్ల వద్ద ఒక్కో కోడి రూ.50వేల నుంచి రూ.1.50 లక్షలకు అమ్ముడుపోతోంది. పది మంది యువకులు కలిసి ఒక్కో పుంజును కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. గత ఏడాది వ్యాధులతో పుంజులు మృత్యువాత పడడంతో ఈ సారి పందెం కోళ్లకు డిమాండ్ పెరిగింది. కొంత మంది పందెం రాయుళ్లు కూడా సొంతంగా కోళ్లను పెంచి పందేలకు సిద్ధం చేశారు.
కోటి రూపాయలకు రెడీ!
జిల్లాలో భీమవరం సమీపంలోని చిన అమిరం, వెంప, తాడేపల్లిగూడెం, సీసలి ప్రాంతాల్లో ఈసారి పందేల జోరు కనిపిస్తోంది. చిన అమిరం బరిలో రూ.1.50 కోట్లతో ఒకే పందెం వేసేందుకు నిర్వాహకు లు సన్నద్ధమయ్యారు. పది జోడీలకు ఒక్కో పందెం లో రూ.28 లక్షలు వంతున కాయాలని నిర్ణయించి నట్లు తెలుస్తోంది. వెంప పరిధిలో రాత్రి వేళ ఒక్కో జోడీకి రూ.54 లక్షలు వంతున పది పందేలు కాయా లని సన్నాహాలు చేస్తుంటే పగటిపూట పందేనికి రూ.11 లక్షలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. తాడేపల్లి గూడెంలో కూడా కోటి రూపాయల పందెం ఉండేలా నిర్వాహకులు కసరత్తు చేసుకుంటున్నారు. ముసుగు పందెం రూ.63 లక్షలకు వేయాలని పందెంరాయుళ్లు సిద్ధమాయ్యరు. ముసుగులోనే బరిలోకి పుంజును తీసుకువస్తారు. ఏ రకం కోడి తెచ్చారనేది బరిలోనే తెలుస్తుంది. ముసుగు పందెం కోసం రెండు వైపులా పందెంరాయుళ్లు సిద్ధమైపోయారు. ఒక్కో పందేనికి రూ.20 లక్షల వంతున 12 జోడీలు వేయాలని నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకున్నారు. సీసలిలో ఒక్కో పందేనికి రూ.10 లక్షలు ఉండాలని సన్నాహాలు చేసుకుంటున్నారు. పాలకొల్లు, నరసాపురం, యలమంచిలో పందేలు జోరు కొనసాగనుంది.
ప్రత్యేక ఆఫర్లు
పందెంరాయుళ్లను ఆకట్టుకోవడానికి, బరుల వద్దకు రప్పించేలా బుల్లెట్ వంటి బహుమతులు ఆఫర్ చేస్తున్నారు. 5 పందేలు, 9 పందేల్లో ఎవరు ఎక్కువగా గెలిస్తే వారికి బుల్లెట్ ఆఫర్ ఇస్తున్నారు. ఒక్కో పందెం రూ. 2.00 లక్షలు తక్కువ లేకుండా కాయాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలోని బంటుమిల్లి సమీపంలో ఇక్కడి పందెంరాయుళ్లను ఆకర్షించేందుకు కార్లు బహుమతిగా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో ఇప్పటినుంచే పందేలకు కోడి పుంజులను సమకూర్చుకుంటున్నారు.
ఒక్కటైన వైసీపీ నేతలు
జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు ఉంగుటూరు మండలం నారాయణపురం బరిలో పందేల కోసం ఉత్సుకత చూపుతున్నారు. ఒక్కో పందెం రూ.9 లక్షల వంతున ప్రతిరోజు 30 జోడీలు నిర్వహించేలా మంతనాలు సాగిస్తు న్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ముసుగు పందెం నిర్వహించే అవకాశాలున్నాయి.