రేపు తణుకులో సీఎం చంద్రబాబు పర్యటన
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:27 AM
తణుకులో ఈనెల 15న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదవలవాడ నాగరాణి అన్నారు.

ఏర్పాట్లను పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీ
తణుకు, మార్చి13 (ఆంధ్రజ్యోతి) : తణుకులో ఈనెల 15న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదవలవాడ నాగరాణి అన్నారు. గురువారం తణుకు మున్సిపల్ కార్యాలయంలో సీఎం పర్యటన ఏర్పాట్లతో పాటు పట్టణంలో పర్యటించే పలు కార్యక్రమాల వివరాలను జిల్లా ఎస్పీ ఆద్నాన్ నయూం అస్మి, జేసీ టి.రాహుల్‌కుమార్ రెడ్డితో పాటు పలు శాఖల అధికారులతో సమీక్షించారు. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున హెలీప్యాడ్, ప్రజావేదిక, ఎన్టీఆర్ పార్కు వద్ద తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తొలుత సీఎం సెక్యూరిటీ అధికారులతో కలిసి పాలిటెక్నిక్ కళాశాల హెలీపాడ్, ఎల్‌వన్, ఎల్‌టు గ్యాలరీ ఏర్పాటు, జడ్పీ హైస్కూల్లో ప్రజావేదిక, ఎన్లీఆర్ పార్కు తదితర ప్రాంతాలను పరిశీలించారు. జిల్లా అడిషినల్ ఎస్పీ భీమారావు, ఆర్డీవోలు కౌసర్ భానో, దాసిరాజు, ప్రవీణ్‌కుమార్, శివన్నారాయణ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
రేపు తణుకులో స్వర్ణాంధ్ర..స్వచ్ఛాంధ్ర
ఇరగవరం/తణుకు : రాబోయే రోజుల్లో తణుకు పట్టణంలో ప్లాస్టిక్ క్యారీ బాగ్‌ల నిషేధంతో పాటు బయోడిగ్రేడబుల్ సంచులు వినియోగించే విధంగా ప్రోత్సహించనున్నట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. గురువారం తణుకులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి నెల మూడో శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, పరిశ్రమలలో పరిశుభ్రత, పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అందులో భాగంగా 15వ తేదీ తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర.. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. శనివారం ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తణుకు పట్టణం చేరుకుంటారని, బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉదయం 9 గంటలకు ప్రజా వేదిక, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశం అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని చెప్పారు.