4 గంటలు తణుకులోనే..
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:20 AM
సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. తణుకులో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ మిషన్ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పర్యటిస్తు న్నారు.

రేపు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వరకు
సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు.. ప్రజలతో మమేకం..
కేడర్‌తో భేటీ.. అధికారులతో సమీక్ష
భీమవరం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. తణుకులో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ మిషన్ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పర్యటిస్తు న్నారు. స్వచ్ఛాంధ్రపై ఒక్కో నెలలో ఒక అంశాన్ని తీసుకుంటు న్నారు. దీనికి అనుగుణంగా జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ సారి ఒక పర్యాయమే వినియోగించే ప్లాస్టిక్ నిషేధం – పునర్వినియోగ వస్తువుల ప్రోత్సాహం అనే అంశాన్ని తీసుకున్నారు. అంటే ప్లాస్టిక్ కవర్‌లు, ప్లాస్టిక్ గ్లాసులు నిషేధాన్ని అమలు చేయాలి. దీనిపై ఈ సారి సీఎం చంద్ర బాబు తణుకు పర్యటనలో కార్యక్రమాన్ని చేపడతారు. శనివారం ఉదయం ఎనిమిది గంటలకు హెలీకాప్టర్‌లో తణుకు చేరుకుంటారు. పట్టణంలోని ఎస్ ఎంవీఎం పాలిటెక్నికల్ కళాశాల సమీపంలో హెలిప్యాడ్ ఏర్పాటుచేశారు. హెలిప్యాడ్ వద్ద సీఎంను ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు స్వాగతం పలకనున్నారు. జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా చంద్ర బాబును కలుసుకుంటారు. అనంతరం హెలిప్యాడ్ నుంచి 8.35 గంటలకు ఎన్టీఆర్ పార్క్‌కు చేరుకుంటారు. అక్కడ పారిశుధ్య కార్మికులతో ఉదయం తొమ్మిది గంటల వరకు సమావేశం కానున్నారు. అనంతరం జిల్లా పరిషత్ స్కూల్‌లో నిర్వహించే ప్రజావేదికలో పాల్గొంటారు. గంటపాటు ప్రజలతో ముఖ్యమంత్రి మమేకమవుతారు. దాదాపు రెండు వేల మంది హాజరయ్యేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. 10.10 గంటలకు జూబ్లీ రోడ్‌లోని నూలి వారి లేఅవుట్‌లో పార్టీ కేడర్, ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు. నియోజకవర్గ పార్టీ శ్రేణులకే చంద్రబాబుతో సమావేశం అయ్యే అవకాశం కల్పించారు. సమావేశం ఉదయం 11 గంటల వరకు ఉంటుంది. 12 గంటల వరకు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. జిల్లా అధికారులతో సమావేశం అనంతరం 12.05 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుని తిరిగి పయనమవుతారు.