Share News

అంతా సిద్ధం

ABN , Publish Date - Dec 01 , 2025 | 12:13 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నాలుగోసారి సోమవారం జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారు. ఉంగుటూరు నియోజక వర్గంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొనున్నారు.

 అంతా సిద్ధం
సీఎం చంద్రబాబు పాల్గొనే ‘పేదల సేవలో ప్రజా వేదిక’ రచ్చబండ వేదిక

నేడు ఉంగుటూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన

కూటమి ప్రభుత్వం వచ్చాక నాలుగోసారి రాక

గోపీనాథపట్నంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ

నల్లమాడులో మార్గదర్శకులు, బంగారు కుటుంబాలతో ముఖాముఖి

ఉంగుటూరు పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం

ఏర్పాట్లలో ప్రజాప్రతినిధులు, అధికారులు నిమగ్నం

పీ–4 పై ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నాలుగోసారి సోమవారం జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారు. ఉంగుటూరు నియోజక వర్గంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొనున్నారు. 18 నెలల కూటమి పాలనలో చంద్రబాబు రెండుసార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించగా, ఈ ఏడాది ఫిబ్రవరి 11న నూజివీడులో పీ–4 కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ఆగిరిపల్లిలో పర్యటించా రు. తాజాగా నేడు ఉంగుటూరు నియోజక వర్గంలో పర్యటనకు విచ్చేస్తున్నారు.

జిల్లా పర్యటనకు సోమవారం విచ్చేస్తున్న ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో పీ–4 కార్యక్రమం అమలుపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఏడు నియో జకవర్గాల్లో 71,876 మంది బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడానికి 4,627 మంది మార్గదర్శకులు ముందుకొచ్చారు. వీరంతా కేవలం 43,584 మందిని దత్తత తీసుకున్నారు. వారికి ఉద్యోగ,ఉపాధి, ఇతర సౌక ర్యాల కల్పన దిశగా ఇంకా అడుగులు పడలేదు. ఉంగు టూరు నియోజకవర్గంలో 4,661 మంది బంగారు కుటుం బాలకు 467 మంది మార్గదర్శకులు 3,242 మందిని దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారు. మరోవైపు ఉంగు టూరులో పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేయడానికి ముఖ్య నాయకులతో ఆయన భేటీ కానున్నారు.

కేడర్‌లో అసంతృప్తి సెగలు

జిల్లా పార్టీని అంటిపెట్టుకున్న పనిచేస్తున్న నాయకులు నామినాటేడ్‌ పదవుల్లో సరైన గుర్తింపు రాలేదన్న అసంతృప్తి రేగుతోంది. ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన వారికి సరైన సముచిత స్థానాన్ని కల్పించారు. కాగా అప్‌ లాండ్‌లో నాయకత్వానికి సరైన గుర్తింపును 18 నెలలు కాలంలో ఇవ్వలేదని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన నామినేటెడ్‌ పదవుల్లోనైనా మాకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

ఉంగుటూరుకు వరాలిస్తారా?

గత టీడీపీ హయాంలో గన్ని వీరాంజనేయులు ఆధ్వ ర్యంలో ఉంగుటూరు నియోజకవర్గం చాలావరకు అభి వృద్ధి చెందింది. ఆపై వైసీపీ హయాంలో వ్యవస్థలను నీరుగార్చారు. ఉంగుటూరు నియోజకవర్గంలో రోడ్లు, వంతెనల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన పొలసానిపల్లి గురుకుల పాఠశాల అధ్వానస్థితిలో ఉంది. నారాయణపురం జూనియర్‌ కళాశాల భవనాలు శిఽథిలావస్థకు చేరాయి. రోడ్లు అధ్వానంగా మారాయి. సింగిల్‌ లైన్‌ వంతెనలతో ఉంగుటూరు, నారాయణపురం వద్ద హైవే సమీపంలో ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని డబుల్‌ లైన్లుగా అభివృద్ధి చేయాల్సి ఉంది. మరోవైపు కొల్లేరు ప్రజలు నివాసం ఉండే నిడమర్రు మండలం పెదనిండ్రకొలను పీహెచ్‌సీ భవనాలు శిథిలమయ్యాయి. ఇక్కడ ఐదెకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంది. పీహె చ్‌సీని 30 పడకల సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్‌ చేయాలని ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. కాగా చింతలపూడి, నూజివీడు, దెందులూరు నియోజవర్గాల్లోని మెట్ట గ్రామాల్లోని రెండు లక్షలకు పైబడి ఎకరాలకు సాగు నీరందించే చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయిస్తారన్న ఆశాభావాన్ని అయా నియోజక వర్గాల ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

సీఎం పర్యటన ఇలా..

ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు ఉంగుటూరు మండలం నల్లమాడులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ముఖ్య నాయకులు, జిల్లా అధికారుల స్వాగతం అనంతరం గోపీనాథపట్నం చేరు కుని సామాజిక పింఛన్ల పంపిణీలో పాల్గొంటారు. లబ్ధి దారులతో మాట్లాడి ఆయనే స్వయంగా సొమ్ములు పంపిణీ చేస్తారు. గోపీనాథపట్నం సచివాలయ పరిధిలో హెల్త్‌ పింఛన్‌ను సీఎం పింఛన్‌ దారుడి ఇంటి వద్దనే పంపిణీ చేస్తారు. అనంతరం తిరిగి బయల్దేరి నల్లమాడు లో ఏర్పాటు చేసిన ‘పేదల సేవలో ప్రజా వేదిక’ సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటారు. బంగారు కుటుంబాల దత్తత దాతలకు పౌరసన్మానం, పీ–4 ప్రాజెక్టు ప్రాముఖ్యత వివరిస్తారు. అనంతరం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. సాయంత్రం 3.35 గంటలకు ఉండవల్లి బయలుదేరి వెళ్తారు.

సీఎం పర్యటనకు భారీ బందోబస్తు

ఏలూరు క్రైం : సీఎం చంద్రబాబు సోమవారం ఉంగుటూరు మండలంలో పర్యటన నేపథ్యంలో వెయ్యి మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌, ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ ఆదివారం ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. సీఎం పర్యటన విధులలో పాల్గొనున్న సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ బందోబస్తు సమయంలో విధుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వాహనాలను తమకు కేటాయించిన స్ధలాల్లో పార్కింగ్‌ చేయించాలన్నారు. అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపించాలని, ఖచ్చితంగా వారి ఐడీ కార్డును పరిశీలించాలన్నారు. మరోవైపు గ్రేహౌండ్స్‌ దళాలతో, పోలీసు జాగిలాలతో, బాంబు డిస్పోజల్‌ స్వాడ్‌లతో తనిఖీలు చేశారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్‌.సుస్మిత, ఏఎస్పీ ఎన్‌.సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌, జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పరదాలు, బారికేడ్లు లేని ప్రజావేదిక

నిడమర్రు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి):ఉంగుటూరు నియోజకవర్గం నల్లమాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనున్న ‘పేదల సేవలో ప్రజావేదిక’ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాబ్‌ చెర్మన్‌ గన్ని వీరాంజనేయులు ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం సాయంత్రం రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సభా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎస్పీలు సీఎం రూట్‌ మ్యాప్‌కు అనుగుణంగా ఏర్పాట్లలో ఎటువంటి ఆటంకం లేకుండా అధికారులకు సూచనలు చేశారు. కాగా ఆదివారం సాయంత్రం ప్రజావేదిక ప్రాంగణాన్ని తిలకించేందుకు వచ్చిన స్థానికులకు ప్రజా వేదిక ఏర్పాట్లు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించాయి. సాదా సీదా సోపా, బొంతలు కూడా లేని చెక్క బల్లలపై కూర్చొని ప్రజలతో మమేకమయ్యేలా ప్రజావేదికను ఏర్పా టు చేశారు. సభా ప్రాంగణంలో బారికేడ్లు ఏర్పాటు చేయలేదు. ప్రజల మనిషిగా ప్రజలతో మమేకవ్వడానికే ప్రాధాన్యం ఇచ్చినట్టు అవగతం అవుతుంది. కేవలం 12 ముఖ్యులు మాత్రమే ప్రజావేదికపై ఉండనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలతో పరదాలు లేని ప్రజా పాలన అందివ్వాలనే ఉద్దేశ్యంతో రచ్చబండ తరహలో ప్రజావేదికను సాదాసీదాగా ఏర్పాటు చేశా మని, దీని ద్వారా ప్రజలకు మరింత చేరువ అవడానికి వీలవుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు మీటింగ్‌లో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. వాతావరణ శాఖ వర్ష సూచన చెప్పడంతో వర్షం వల్ల సభ నిర్వహణకు ఆటంకం కలగకుండా వాటర్‌ ప్రూఫ్‌ టెంట్లు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో ఇప్పటికే కంకరతో ప్రధాన మార్గం ఏర్పాటు చేశారు.

Updated Date - Dec 01 , 2025 | 12:13 AM