మబ్బుల అలజడి
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:36 AM
సార్వా మాసూళ్ల సమయంలో తుఫాన్‌లురైతుల్లో అలజడి రేపుతున్నాయి. మొన్న మొంథా తుఫాన్ భయపెట్టింది. నేడు సెలార్ తుఫాన్ పరుగులు పెట్టిస్తున్నది.
వరికోత యంత్రాలకు డిమాండ్
ఇప్పటి వరకు 60 వేల ఎకరాల్లో కోతలు
లక్షా 80 వేల టన్నుల ధాన్యం మాసూళ్లు.. 70 వేల టన్నులు కొనుగోళ్లు
80 వేల టన్నులు పైగా రాశులుగా..
సార్వా మాసూళ్ల సమయంలో తుఫాన్‌లురైతుల్లో అలజడి రేపుతున్నాయి. మొన్న మొంథా తుఫాన్ భయపెట్టింది. నేడు సెలార్ తుఫాన్ పరుగులు పెట్టిస్తున్నది. అల్ప పీడనం ఏర్పడి వాయుగుండంగా బలపడి తుఫాన్‌గా మారుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం నుంచి మబ్బులతో వాతావరణం మారింది. దీంతో రైతులు పరుగులు పెడుతున్నారు. మాసూళ్లైన ధాన్యాన్ని బరకాలతో కప్పుకుంటున్నారు..
భయపెడుతున్న వాతావరణం
భీమవరం రూరల్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 2 లక్షల 16 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇప్పటి వరకు 60 వేల ఎకరాలు పంట మాసూలైంది. 1 లక్షా 80 వేల టన్నుల ధాన్యం దిగుబడి రాగా 70 వేల టన్నులు కొనుగోలు జరిగింది. ముందుగా 20 వేల టన్నులు మెట్టలో అమ్మకాలు జరిగాయి. దీంతో ఇంకా 80 వేల టన్నుల ధాన్యం రైతుల వద్దే రాశులుగా ఉంది. ఆ ధాన్యాన్ని తేమ శాతం తగ్గించేందుకు ఎండబెడుతున్నారు. రెండు,మూడు రోజులు ఎండబెడితేనే తేమ శాతం 17 వస్తుంది. మబ్బుల వల్ల ధాన్యం ఎండబెట్టడం వీలుకావడం లేదు. వర్షం పడుతుందనే సూచనలతో ఎండబెట్టిన ధాన్యాన్ని రాశులుగా చేసి బరకాలతో కప్పేశారు.
వరికోత యంత్రాలకు గిరాకీ
మొన్న మొంథా తుఫాన్ వల్ల మాసూళ్ళకు వచ్చిన వరిచేలు 15 రోజులు వెనక్కు వెళ్లాయి. దీంతో ఒకేసారి ఎక్కువ పంట మాసూళ్లకు వచ్చింది. వరికోత యంత్రాలు అన్ని ప్రాంతాలకు అందుబాటులో లేనందున యంత్రాలకు గిరాకీ ఏర్పడింది. గంటకు రూ. 2800 నుంచి 3 వేలు ఆపైన వసూలు చేస్తున్నారు. తుఫాన్ ప్రచారంతో రైతులలో ఆందోళన ఎక్కువైంది.వరికోత యంత్రాల కోసం పరుగులు పెడుతున్నారు.
ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం
ధాన్యం కొనుగోలుకు జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. గోనెసంచులు సరిపడగా అన్నిచోట్ల అందుబాటులో ఇచ్చారు. జిల్లాలో 308 ఆర్‌ఎస్‌కేలు ఉన్నాయి. వాటి అవసరమైన వాటిగా 252 ఆర్‌ఎస్‌కేలలో కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం 220 ఆర్‌ఎస్‌కేల పరిధిలో వరి పంట మాసూళ్లు జరుగుతున్నాయి. మాసూళ్లు పూర్తయి తేమశాతం సరిపడా ఉంటే వెంటనే కొనుగోలు చేస్తున్నారు.
అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు
రైతులకు ధాన్యం కొనుగోలులో వ్యవసాయ సిబ్బంది అందుబాటులో ఉంటు న్నారు. సంచులు సరిపడేవి ఏర్పాటు చేశాం. మాసూళ్లు స్పీడుగా జరుగుతున్నాయి. కొనుగోళ్లు ఆ విధంగానే చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో ఆర్‌ఎస్‌కేలలో కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.
వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయాధికారి
రైతులు ఉరుకులు..పరుగులు
పెనుగొండ/ ఆచంట : ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలతో తరచూ నష్ట పోతున్నామని రైతులు వాపోతున్నారు. వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో రైతుల గుండెల్లో అలజడి మొదలైంది. ధాన్యం ఒబ్బిడి చేసుకు నేందుకు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. ఆచంట మండలంలో ఇపుడిపుడే సార్వా మాసూళ్లు ప్రారంభమయ్యాయి. ఆదివారం వాతావరణం మబ్బులు కనిపించడంతో రైతుల్లో దిగులు ఏర్పడింది. తుఫాన్ వస్తే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు తమ ఆవేదన చెందుతున్నారు.
దిగుబడి పడిపోయింది
మొగల్తూరు (ఆంధ్రజ్యోతి): సార్వా సాగు అరంభం నుంచి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తుఫాన్ కారణంగా చేలల్లో నీరు నిలిచిపోయింది. దీంతో దిగుబడిపై ప్రభావం చూపింది. మొగల్తూరు మండ లంలో సుమారు 628 ఎకాల్లో వరి సాగు చేయగా 350 ఎకరాల్లో తుఫాన్, అధిక వర్షాలతో పంట నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు.ఎకరానికి 15 నుంచి 20 బస్తాలు కూడా దిగుబడి రాకపోవడంతో రైతులు ఆవేదన చెందు తున్నారు. ఇప్పటి వరకూ ఇన్‌పుట్ సబ్సిడీ ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో పెట్టుబడి పెట్టలేక చేలు కోయాలో లేదో అనే పరిస్ధితిలో ఉన్నామని రైతులు అంటున్నారు.