Share News

చింతలపల్లి పంచాయతీ నిధులు గల్లంతు

ABN , Publish Date - Aug 18 , 2025 | 01:04 AM

ఏలూరు జిల్లా ముసునూరు మండలం చింతలపల్లి పంచాయతీలో పెద్ద ఎత్తున నిధులు గల్లంతయ్యాయి.

చింతలపల్లి పంచాయతీ నిధులు గల్లంతు

అంగీకరించిన పంచాయతీ కార్యదర్శి

(నూజివీడు ఆంధ్రజ్యోతి)

ఏలూరు జిల్లా ముసునూరు మండలం చింతలపల్లి పంచాయతీలో పెద్ద ఎత్తున నిధులు గల్లంతయ్యాయి. 2021–22 నుంచి 2024–25 వరకు పంచాయితీకి రూ.1.12 కోట్ల ఆదాయం ఉంది. వీటిలో రూ.68,48,223 మొ త్తానికి మాత్రమే బిల్లులు ఉన్నట్లు ప్రస్తుత విచారణలో తేలింది. వాటిలో కూడా లక్షలాది రూపాయిలు బిల్లులు నకిలీగా నిర్ధారణ అయినట్లు సమాచారం. అప్పటి గ్రామ కార్యదర్శి ఆర్‌.వెంకటేశ్వరరావు తాను రూ.22 లక్షలు గ్రామ సర్పంచ్‌ పిల్లి సత్యనారాయణ, ఆయన భార్య పిల్లి స్వప్న బ్యాంక్‌ ఖాతాలో జమ చేసినట్లు ఈనెల 15న ముసునూరు మండల అభివృద్ధి అధికారికి రాతపూర్వకంగా తెలియజేశారు. పంచాయితీ నిధులను తన ఖాతాలో జమ చేయలేదని గ్రామ కార్యదర్శి విచారణలో తెలిపారు. తనకు మండలంలో ఐదు గ్రామాల బాధ్యతలను అప్పజెప్పడం వల్ల బిల్లుల పరిశీలన చేయలేకపోయానని ఆ లేఖలో ఆయన తెలిపారు.

దుర్వినియోగం తేల్చాలి..!

ఇప్పటికి వరకు జరిగిన విచారణలో రూ. 68,48,223 బిల్లులలో అనేకం నకిలీ కాగా లెక్క తెలియని అవినీతి నిర్ధారణ కావాల్సి ఉంది. గ్రామంలో ఏ అవసరం వచ్చినా నిధులు లేవని చెబుతుండడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధులు గల్లంతైనట్లు ప్రాథమిక విచారణలో తేలినా ఇంత వరకు పంచాయితీ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ గ్రామ కార్యదర్శి పరిధిలో చింతలపల్లితో పాటు మండలంలో లోపూడి, చెక్కపల్లి, సూరేపల్లి, వేలుచర్ల, ముసునూరు, గోపవరం గ్రామాలలో సైతం ఉన్నాయి. వీటిలో ఇప్పటికే వేల్పుచర్ల, సూరేపల్లి గ్రామాలలో సైతం నిధులు గల్లంతు అయ్యాయని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. వీటిపైన విచారణ నత్తనడక నడుస్తోంది. ఈకార్యదర్శి పరిధిలోని గ్రామాలలో పంచాయితీ నిధులపై ఆడిట్‌ జరిపితే పంచాయితీ నిధులు ఎంత వరకు సక్రమంగా వినియోగించబడ్డాయి. ఎంత వరకు పక్కదారి పట్టాయి అనేది బట్టబయలవుతుంది. నిధుల గల్లంతుపై ముసునూరు ఎంపీడీవో వివరణ కోసం ఆంధ్రజ్యోతి ఆదివారం ప్రయత్నించగా మంత్రి పార్థ సారథి పర్యటనలో ఉండడంతో అందుబాటులోకి రాలేదు. కాగా ఎంపీడీవోకు లిఖితపూ ర్వకంగా తెలియజేసినట్లు గ్రామ కార్యదర్శి ఆర్‌ వెంకటేశ్వరరావు నిర్థారించారు.

నకిలీ ఇంటి పన్ను రసీదు

మా వద్ద రూ.7,069 ఇంటి పన్ను వసూలు చేసి నకిలీ రసీదు ఇచ్చారని గ్రామానికి చెంది న బండారు నాగేశ్వరరావు తెలిపారు. ఏసు రంగారావు కూడా తనకు ఇచ్చిన నకిలీ ఇంటి పన్ను రసీదులను చూపారు.

Updated Date - Aug 18 , 2025 | 01:04 AM