లీజు మంటలు
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:39 AM
దెందులూరు నియోజకవర్గంలో మరో మారు తెలుగుదేశం, వైసీపీ పక్షాలు బాహా బాహీకి దిగాయి. నువ్వా నేనా అని తేల్చు కోవడానికి సిద్ధమవుతున్నాయి. కొన్ని మాసా లుగా కొల్లేరు లీజు వివాదం ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టింది
దెందులూరులో ఈ అంశంపైనే బాహాబాహీ
వైసీపీ ముసుగులో రౌడీలా.. అంటూ ఎస్పీకి ఎమ్మెల్యే ప్రభాకర్ ఫిర్యాదు
లీజు సొమ్ములు తేల్చాల్సిందేనంటూ పట్టు
కావాలనే అరాచకాలు : మాజీ మంత్రి పేర్ని నాని
అబ్బయ్యకు మద్దతుగా తరలి వచ్చిన వైసీపీ నేతలు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
‘సాఫ్ట్‌వేర్ ముసుగులో అబ్బయ్యచౌదరి చేసిన క్రిమినల్ నేచర్ బయటపడింది. కాబట్టే కనీసం వాళ్ల స్థానిక వైసీపీ కార్యకర్తలు, జనం కూడా రావడం లేదు. బయట ప్రాంతాల నుంచి రౌడీ షీటర్లను, అల్లరి మూకలను తెచ్చి పెట్టుకున్నారు. పైగా అతనికి ఏదో నష్టం వాటిల్లినట్టు వైసీపీ, ఇతర నాయకులు దొంగ పరామర్శలు చేస్తున్నారు.’
– దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని
‘అధికారంలోకి వచ్చిన తర్వాత అట్టుకు అట్టున్నర చెల్లిస్తాం. ప్రత్య ర్థుల ఆస్తులను ధ్వంసం చేయడం, మాజీ ఎమ్మెల్యే అయిన అబ్బయ్య చౌదరిపై భౌతిక దాడికి ఉసిగొలిపారు. రాజకీయం చేయకుండా రౌడీయిజం చేస్తున్నారు. దీనిని చూస్తూ ఊరుకోం.’
– మాజీ మంత్రి పేర్ని నాని
దెందులూరు నియోజకవర్గంలో మరో మారు తెలుగుదేశం, వైసీపీ పక్షాలు బాహా బాహీకి దిగాయి. నువ్వా నేనా అని తేల్చు కోవడానికి సిద్ధమవుతున్నాయి. కొన్ని మాసా లుగా కొల్లేరు లీజు వివాదం ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టింది. కొల్లేరులో లీజు సొమ్ములు మింగేసిన అబ్బయ్యచౌదరి పత్తా లేకుండా పోయారని, ఆఖరుకి తీసు కున్న సొమ్మును తిరిగి చెల్లించకుండా ఎదురుదాడి చేస్తున్నారు. పేదలకు న్యాయం జరగకపోతే చూస్తూ ఊరుకోబోమని దెందు లూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొల్లేరువాసుల పక్షాన నిలిచారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న అబ్బ య్య చౌదరి కొల్లేరువాసులకు చెందాల్సిన లీజు సొమ్మును కాజేశారన్నది అక్కడి వాసు ల ఆరోపణ. తనకేమీ సంబంధం లేదని టీడీపీ కావాలని రెచ్చగొడుతూ, రాజకీయం చేస్తోందని అబ్బయ్యచౌదరి ప్రతీ మూడు నెలలకోసారి బహిరంగ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడా ది నుంచి తమకు చెందాల్సిన ఫీజు సొమ్ము లను చెల్లించాల్సిందేనని ఆయన ఇంటి ఎదు ట కొల్లేరువాసులు నిరసనలకు దిగుతున్నా రు. దీనిపై ఇప్పటికే పోలీసులకూ ఫిర్యాదు చేశారు. వారికి లీజు సొమ్ములు చెల్లించేంత వరకు పోరాటం ఆగదని కొల్లేరువాసులతో కలసి చింతమనేని నిరసన గళం విప్పారు. ఈ నేపథ్యంలో చింతమనేని వర్సెస్ అబ్బ య్యచౌదరి మధ్య మాటల తూటాలు పేలు తున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లు చోటు చేసు కుంటున్నాయి. లీజు సొమ్మును ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొల్లేరువాసులు గురువా రం కొండలరావుపాలెంలోని అబ్బయ్య చౌద రి ఇంటి వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీనికి ప్రతిగా వైసీపీ కార్యకర్తలు వీరందరినీ ప్రతిఘటించే నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇరువర్గాలను అక్క డి నుంచి పంపించేశాయి. ఈ ఘటనతో మరోసారి అగ్గి రాజుకుంది. శాంతి భద్ర తలకు విఘాతం కలిగించేలా వారి ప్ర వర్త న ఉందంటూ కర్రలు ధరించిన వైసీపీ కార్య కర్తల ఫొటోలతోపాటు ఎస్పీ కిశోర్‌కు లిఖిత పూర్వకంగా ఎమ్మెల్యే చింతమనేని ఫిర్యాదు చేశారు. అబ్బయ్య వ్యవహార శైలిపై ఆది నుంచి చింతమనేని ఆగ్రహంతోనే ఉన్నారు. కొల్లేరువాసులకు నష్టం కలిగించేలా వ్యవ హరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన తీవ్రస్థాయి లో విరుచుకుపడ్డారు. ఏదొకరోజు లండన్ నుంచి ఇక్కడికి రావడం, ఉన్న నాలుగు రోజులు మీడియాలో ప్రచారం కోసం అనవసర గొడవలు సృష్టిస్తూ ఆకతాయితనంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. సంవత్సరానికి మూడుసార్లు చుట్టపుచూపుగా వచ్చే మీకు అసలు స్థానిక సమస్యల మీద మాట్లాడే అర్హత ఉందా.. అంటూ ప్రశ్నించారు. రేపు మళ్ళీ బ్యాగు సర్దుకుని పోతావు, ఈ నాలుగు రోజులు నీకు మీడియా కవరేజి కావాలని హడావుడి సృష్టించిపోతావంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏదో నష్టం జరిగిపోయినట్టు పరామర్శలా.. అంటూ కొండలరావుపాలెం వచ్చిన వైసీపీ నేతలను ఉద్దేశించి ప్రభాకర్ ప్రశ్నలు కురిపించారు. కొల్లేరువాసులకు వీలైతే న్యాయం చేయండి. ఇక్కడ జరుగుతుందేమిటో మీకు తెలుసా. మీ మాజీ ఎమ్మెల్యే ఏమీ తెలియనివాడిగా నటిస్తూనే అరాచకాలకు బీజాలు వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హులకు పింఛన్లు తొలగిస్తే, వాటిని స్థానిక వైద్యులు ధ్రువీకరిస్తే నా మీద నిందలు వేస్తారా. దానికి, నాకు ఏం సంబంధమంటూ ప్రశ్నించారు. వీధి రౌడీలు, బౌన్సర్లకు డబ్బు ఎరచూపి గ్రామాల్లో శాంతిభద్రతలకు అబ్బయ్యచౌదరి విఘాతం కలిగిస్తున్నా రంటూ ఆరోపణలు గుప్పించారు.
అబ్బయ్యచౌదరి ఇంటిపైకి దాడికి వచ్చా రంటూ సమాచారం అందడంతో వైసీపీ తన పార్టీ సీనియర్లను రంగంలోకి దిం పింది. మాజీ మంత్రులు పేర్ని నాని, శైలజ నాథ్, జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వర రావు, కన్వీనర్లు బాలరాజు, విజయరాజు, జయప్రకాశ్ తదితరులతో కూడిన ప్రతినిధి బృందం శుక్రవారం కొండలరావుపాలెంలోని అబ్బయ్యచౌదరి నివాసానికి వెళ్లారు. ఆయనను పరామ ర్శించిన అనంతరం మీడియాతో మాట్లా డుతూ చింతమనేని బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని దుయ్య బట్టారు. కేవలం దెందులూరులో అందరినీ భయభ్రాంతులను చేయడమే లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. పోలీసులు నిజాయితీగా వ్యవహరించాల్సింది పోయి టీడీపీ తొత్తులుగా వ్యవహరిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తేల్చుకుంటామంటూ పేర్ని నాని తీవ్ర స్వరంతో హెచ్చరికలు చేశారు.