తీరని చింత
ABN , Publish Date - Nov 03 , 2025 | 12:01 AM
చింతల పూడి పథకం ఫేజ్–1కి 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన జరిపారు. అనంతరం టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.4,909 కోట్లతో (1,2 ఫేజ్‌లు) పనులు చేపట్టారు.
కదలిక లేని చింతలపూడి ఎత్తిపోతల పఽథకం
అడ్డంకిగా ఉన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు
గత వైసీపీ సర్కార్ నిర్వాకంతో ఆగిన పనులు
ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో చేర్చిన కూటమి ప్రభుత్వం .. అయినా కదలిక లేని వైనం
ఆయకట్టు రైతుల్లో నిరాశ
ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలలో ఐదు లక్షల ఎకరాల మెట్ట భూములను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయడంతో పాటు కొన్ని వందల గ్రామాలకు తాగునీరు సమస్యను తీర్చే చింతలపూడి ఎత్తిపోతల పథకం పనుల కు మోక్షం ఉందా? లేదా? అని ఆయకట్టు రైతులు ఆశ–నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు తట్ట మట్టి వేయకుండా పఽథకాన్ని భ్రష్టు పట్టించింది. కూటమి ప్రభుత్వంపైనే ఆయకట్టు రైతులు ఆశలు పెట్టుకున్నారు.
చాట్రాయి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): చింతల పూడి పథకం ఫేజ్–1కి 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన జరిపారు. అనంతరం టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.4,909 కోట్లతో (1,2 ఫేజ్‌లు) పనులు చేపట్టారు. అప్పటి సీఎం చంద్రబాబు ఫేజ్–2కి 2017 సెప్టెంబరు 17న ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట సమీపంలోని మొద్దులపర్వ వద్ద శంకుస్థాపన చేశారు. టీడీపీ ప్రభుత్వం ఈ పఽథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని సుమారు 60 శాతం పనులు పూర్తి చేసింది. ఆపై వైసీపీ అధికారంలోకి రావడంతో పఽథకానికి దుర్దశ పట్టింది.
జగన్ ప్రభుత్వం తప్పిదాలు..ఆగిన పథకం
జగన్ ప్రభుత్వం తప్పిదాల వల్ల కూటమి ప్రభు త్వం పఽథకంపై ముందుకు వెళ్లలేకపోతుంది. చింతలపూడి ఎత్తిపోతల పఽథకం పనులు పర్యావరణ అను మతులు లేకుండా చేస్తున్నారని 2018లో ఉంగు టూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దివంగత వట్టి వసంతకుమార్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ట్రిబ్యునల్ విచారణ జరిపిన 2022లో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.73 కోట్లు జరిమానా విధించింది. దీనిపై అప్పటి జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు మూడు నెలలు గడువు ఇచ్చి జరిమానా చెల్లించడం లేదా పర్యావరణ అనుమతులు తీసుకోవాలని ఆదేశించింది. దీనిని వైసీపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టు వర్కు స్టాప్డ్ ఉత్వర్వులు ఇచ్చింది. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది.
ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో చేర్చినా..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐదు ప్రాధాన్యత ప్రాజెక్టులలో చింతలపూడిని చేర్చింది. కానీ పనులు పునః ప్రారంభం ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి. ఫేజ్–1 పరిధిలో నిర్వాసిత రైతులు ఎక్కువ నష్ట పరిహారం కోసం కోర్టులో వేసిన 20 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఫేజ్–1లో నిర్వాసిత రైతులకు సుమారు రూ.100 కోట్లు, ఫేజ్–2లో సుమారు రూ.25 కోట్లు నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంది. ఈ పఽథకం పూర్తయితే పోలవరం, చింతలపూడి, దెందులూరు, గోపాలపురం, మైలవరం, తిరువూరు, నూజివీడు, నందిగామ, గన్నవరం అసెంబ్లీ నియోజక వర్గాలలో ఐదు లక్షల ఎకరాలకు నీరందు తుంది. రాష్ట్ర విభజన అనంతరం నాగార్జున సాగర్ ప్రాజెక్టు (ఎన్‌ఎస్‌పీ) ఎడమ కాలువ ద్వారా తెలంగాణ దాటి ఆంధ్ర ప్రాంతానికి సాగర్ జలాలు రావడం కష్టంగా మారింది. ఎన్‌ఎస్‌పీ జోన్–3 కాలువకు తెలంగాణ నుంచే సాగునీరు రావాల్సి ఉంది. జోన్–3 కింద ఉన్న 2.10 లక్షల ఎకరాల ఆయకట్టును చింతపూడి ఎత్తిపోతల పఽథకం ద్వారా గోదావరి జలాలలతో స్థిరీకరించేలా డిజైన్ రూపొందించారు. ఎన్నికల సమయంలో తనను గెలిపిస్తే ఈ పఽథకాన్ని పూర్తి చేస్తానని ప్రస్తుత నూజివీడు ఎమ్మెల్యే, గృహ నిర్మాణ, సమాచార మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చారని ఆ మేరకు హామీని అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సుప్రీం కోర్టులో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతికి కృషి
– చిన్నబాబు, ఈఈ, చింతలపూడి ఎత్తిపోతల పథకం
చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కృషి జరుగుతోంది. వీలైనంత త్వరగా పనులు పునః ప్రారంభించాలని ప్రభుత్వం అలోచన చేస్తోంది.
కూటమి సర్కార్‌పై నమ్మకంతో ఉన్నాం
చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని నమ్మకంతో ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం తీరు వల్ల తీవ్ర నష్టం జరిగింది. గోదావరి జలాలు మెట్ట భూముల్లోకి వస్తే పంటలు పండి ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది.
–ఎం. వెంకటేశ్వరరావు, ఆయకట్టు రైతు, పోలవరం, చాట్రాయి మండలం