రెండు నెలలు ఆగాల్సిందే !
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:02 AM
చించినాడ వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరమ్మతుల నిమిత్తం వంతెన మూసి మూడు నెలలు దాటింది.
ముందుకు సాగని చించినాడ వంతెన పనులు
ఇంకా పూర్తికాని బేరింగ్‌ల ఏర్పాటు సంక్రాంతి పండుగ, అంతర్వేది తిరునాళ్లకు తప్పని ఇక్కట్లు
చించినాడ వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరమ్మతుల నిమిత్తం వంతెన మూసి మూడు నెలలు దాటింది. షెడ్యూల్ ప్రకారం డిసెంబరు నాటికి పనులు పూర్తిచేయాల్సి ఉంది. సంక్రాంతి నాటికి పనులు పూర్తిచేసి రాకపోకలకు అనుమతించాలని అనుకున్నారు. అయితే పనులు పూర్తికావడానికి మరో రెండు నెలలు పట్ట వచ్చని ఎన్‌హెచ్ అధికారులు చెప్పుతున్నారు.
నరసాపురం, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): పశ్చిమ – కోనసీమలకు చించినాడ బ్రిడ్జే ప్రధాన మార్గం. ఇటు విజయవాడ, అటు భీమవరం, పాలకొల్లు నుంచి వెళ్లే వాహనా లన్నీ ఈ వంతెన మీదుగానే కోనసీమకు వెళతాయి. 216 జాతీయ రహదారి గుండా వచ్చే వాహనాలకు కూడా ఇదే మార్గం. ఈ కారణంగా నిత్యం 1000పైగా భారీ వాహ నాలు ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగి స్తున్నాయి. కాలేజీ, ఆర్టీసీ బస్సులతో పాటు లారీలే ఆత్యధికం. ఇటు కోనసీమ జిల్లా నుంచి విజయవాడ మీదుగా హైద్రాబాద్ వెళ్లే బస్సులు కూడా ఈ మార్గాన్నే ఎంచుకుంటు న్నాయి. దీనివల్ల ట్రాఫిక్ వీపరీతంగా పెరిగింది. వంతెన నిర్మాణ పనులు చేపట్టి దాదాపు 25 ఏళ్లు దాటింది. పెరుగుతున్న ట్రాఫిక్‌ను గమనించిన ఎన్‌హెచ్ అధికారులు వంతెన పటిష్ఠపర్చాలని నిర్ణయించారు. సుమారు రూ.5 కోట్లతో మరమ్మతులు చేపట్టారు. వీటిలో వంతెన కింది భాగంలో 14 స్పాన్స్‌లు, పైభాగంలో 54 బేరింగ్‌లను మార్చాల్సి ఉంది. ఇప్పటికే బేరింగ్ తయారీకి హైద్రాబాద్‌లో ఆర్డర్ ఇచ్చారు. ఇక వంతెన కింది భాగంలో ఉండే 14 స్పాన్‌లలో పది స్పాన్‌లు బిగించారు.
సంక్రాంతి, అంతర్వేదికి తప్పని ఇక్కట్లు
మూడు నెలల నుంచి వంతెనపై దిచక్ర, కార్లను మాత్రమే అనుమతిస్తున్నారు. భారీ వాహనాలను అనుమతించడం లేదు. దీంతో కోనసీమకు ఆర్టీసీ సర్వీసులు లేకుండా పోయాయి. కాలేజీకి వెళ్లే విద్యార్థులు దిండిలో దిగి చించినాడ వైపు రావాల్సి వస్తున్నది. జనవరిలో సంక్రాంతి పండుగ వస్తోంది. 8 నుంచి 20 తేదీవరకు రెండు జిల్లాల మధ్య ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. అత్యధికంగా ప్రైవేట్ బస్సుల్లోనే స్వస్థలాలకు వస్తుంటారు. ప్రస్తుతం వంతెన పనులు పెండింగ్ పడటంతో భారీ వాహనాలను అమనుతించే అవకాశం కనిపించడం లేదు. జనవరి 31న అంతర్వేది తిరునాళ్లు. లక్ష్మినర్సింహాస్వామి కల్యాణానికి వచ్చే భక్తులు కూడా ఎక్కువుగానే ఉంటారు. వంతెన పనులు పూర్తికాకపోవ డంతో యాత్రికులు నరసాపురం మీదుగా గోదావరి దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.
ఎందుకింత జాప్యం
వంతెన పనులు ముందుకు సాగక పోవడంపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. వర్షాకాలంలో మొదలు పెట్టడం వల్ల తరుచూ అంతరాయం ఏర్పడింది. దీనిపై ఎన్‌హెచ్ అధికారుల్ని వివరణ అడగ్గా ‘‘వర్షాలు, వంతెనకు సంబంధించిన సరైన డిజైన్ లేక పోవడం వంటి కారణాల వల్ల సమయానికి పూర్తి చేయలేక పోయాం. సంక్రాంతికి వంతెనకు అనుమతి ఇవ్వాలని అనుకున్నాం. కానీ భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తే ఇప్పటివరకు చేపట్టిన పనులు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ కారణంగా దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మొత్తం పనులు పూర్తికావడానికి మరో రెండు నెలలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి..’’ అని ఎన్‌హెచ్ డీఈ శ్రీనివాసరావు చెప్పారు.