దొంగ మస్తర్లకు చెక్!
ABN , Publish Date - Aug 11 , 2025 | 12:24 AM
ఉపాధి హామీ పథకంలో దొంగమస్తర్లకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.
ఏఐ సాయంతో ఉపాధి అక్రమాలకు అడ్డుకట్ట
జిల్లాలో ఉపాధి కూలీలు 5.57 లక్షల మంది
ఏలూరు రూరల్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో దొంగమస్తర్లకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఏఐ ముఖ ఆధారిత హాజరు అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో పది మంది పనిచేస్తుంటే 50 మందికి మస్తర్లు వేసి నిధులు పక్కదారి పట్టించేవారు. ఫీల్ట్ అసిస్టెంట్లూ పట్టించుకునేవారు కాదు. ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు నేషనల్ మస్తర్ మోనటరింగ్ సిస్టం (ఎన్‌ఎంఎంఎస్) ఆధ్వర్యంలో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞాన ప్రక్రియ అందుబాటులోకి రానుంది.
ముఖ ఆధారిత హాజరు ఇలా..
జిల్లాలో 27 మండలల పరిధిలో మొత్తం 3.77 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 5.57 లక్షల మంది ఉపాధి కూలీ పనులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ ముఖ ఆధారిత హాజరు విధానంలో కూలీల ఫొటో మొబైల్‌లో ముందుగా తీసి ఎన్‌ఎంఎంఎస్ అప్‌లోడ్ చేస్తారు. ఉదయం, సాయంత్రం పని ప్రదేశంలో కూలీ ఫొటోలు అప్‌లోడ్ చేస్తారు. ఒకరి తరపున మరొకరు హాజరైతే ఫొటోలను యాప్ అనుమతించదు. ఒకే పేరుతో మూడు, నాలుగు చోట్ల వేర్వేరు పేర్లతో హాజరైనా కుదరదు. క్షేత్రస్థాయిలో తప్పుడు మస్తర్లు వేయడానికి వీలుపడదు.
గతంలో భారీ అవకతవకలు
జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద గత ఐదేళ్లలో దాదాపు రూ.10 కోట్లు మేర అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన గ్రామస్థాయి నేతలు, క్షేత్రస్థాయి సిబ్బంది కుమ్మక్కై దొంగ మస్తర్లు ద్వారా దోచేశారు. ఇలాంటి అక్రమాలను కట్టడి చేసేందుకు ముఖ హాజరు ఉపయోగపడుతుందని, దీనిపై ఉపాధి హామీ సిబ్బందికి ఇటీవల శిక్షణ ఇచ్చారు.