గోతులకు చెక్
ABN , Publish Date - Dec 10 , 2025 | 01:32 AM
జిల్లాలో రహదారులకు మహర్దశ పట్టింది. వైసీపీ హయాంలో అధ్వానంగా తయారైన రోడ్లపై జనం నరకం చూశారు.
జిల్లాలో అధ్వాన రోడ్ల పునర్నిర్మాణానికి నిధులు మంజూరు.. ప్రజలు హర్షం
ఆంధ్రజ్యోతిలో కథనాలపై ప్రభుత్వం స్పందన
జిల్లాలో రహదారులకు మహర్దశ పట్టింది. వైసీపీ హయాంలో అధ్వానంగా తయారైన రోడ్లపై జనం నరకం చూశారు. కూటమి ప్రభుత్వం రావడంతో ఒక్కొక్క రోడ్డును అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రహదారులకు పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయడంతో పనులు వేగం పుంజుకున్నాయి. ప్రజల కష్టాలు తీరనున్నాయి.
ఏలూరు సిటీ, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి):ఏలూరు జిల్లాలో గ్రామీణ రహదారులకు పూర్వ వైభవం రానుంది. అధ్వాన్నంగా తయారైన రోడ్ల పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.92.72 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో 51 రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. గత ప్రభుత్వ హ యాంలో గ్రామీణ రహదారులను పట్టించుకోలేదు. కూట మి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలుత గ్రామీణ ప్రాంతా ల్లో అంతర్గత రహదారులపై దృష్టి సారించి సీసీ రోడ్లను వేసింది. అయితే పంచాయతీరాజ్ రహదారులు గోతులమయంలా మారి, నడిచేందుకు వీలు లేకుండా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రచురించింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోడ్ల పునఃనిర్మాణంపై దృష్టి సారించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి వపన్‌కల్యాణ్ ఏపీ రూరల్ రోడ్స్ స్ట్రెంథనింగ్ ప్రాజెక్టు (ఏపీఆర్‌ఆర్‌ఎస్‌పీ) కింద ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డివిజ న్లలో 167.735 కిలోమీటర్లు మేర 51 పనులకు రూ.92.72 కోట్లు కేటా యించారు. త్వరలో టెండర్ ప్రక్రియ నిర్వహించి పనులు చేపట్టనున్నారు. ఈ రహదారుల పునఃనిర్మాణంతో ఆయా ప్రాంతాల ప్రజల కష్టాలు తీరనున్నాయి.
చింతలపూడికి రూ.52.46 కోట్లు
జంగారెడ్డిగూడెం రూరల్/కామవరపుకోట, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి):చింతలపూడి నియోజకవర్గంలో పాడైన రహదారులకు మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణాలకు పం చాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, జెడ్పీ నిధులు రూ.52.46 కోట్లు మంజూరయ్యాయి. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటిలో పంచాయతీరాజ్‌కు రూ.22.55 కోట్లు, ఆర్‌అండ్‌బీకి రూ.24.91 కోట్లు, జెడ్పీ నిధులు రూ.5 కోట్లు వున్నాయి. కామవరపుకోట–యడవల్లి రహదారికి రూ.4 కోట్లు, జీలకర్రగూడెం–కామవరపుకోట వయా అంకాలంపాడుకు రూ.7.70 కోట్లు, లింగపాలెం–టిసిహెచ్‌ఆర్‌పాలెంకు రూ. 3.80 కోట్లు, అయ్యప్పరాజుగూడెంకు రూ.55 లక్షలు, చిం తలపూడి–కామవరపుకోటకు రూ.1.80 కోట్లు, చింతలపూ డి–రావికంపాడు వయా టి.నరసాపురం రోడ్డు రూ.1.57 కోట్లు, చింతలపూడి–గురుపట్లగూడెం రూ.3.80 కోట్లు, దేవు లపల్లి–లక్కవరం రూ.70 లక్షలు, ఏలూరు నుంచి జంగా రెడ్డిగూడెం వరకు అక్కడక్కడ ఆరు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.10.27 కోట్లు మంజూరయ్యాయి. శ్రీనివాసపురం రోడ్డుకు జెడ్పీ నిధులు రూ.80 లక్షలు, అక్కంపేటకు రూ.50 లక్షలతోపాటు మరో రూ.3.50 కోట్లతో రోడ్ల నిర్మాణాలు జరగనున్నాయి.
శరవేగంగా మరమ్మతులు
ఏలూరు–జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారిలోని కామ వరపుకోట – తడికలపూడి ప్రధాన రహదారిలో అధ్వానం గా వున్న పలురోడ్ల పనులు మొదలయ్యాయి. పుట్లగట్ల గూడెం–రావికంపాడు మధ్య రెండు కిలోమీటర్లు, కామవర పుకోట సబ్ స్టేషన్ నుంచి కిలారు ఫామ్స్ మధ్య మరో రెండు కిలోమీటర్లు, తడికలపూడి పరిధిలో మరో రెండు కిలోమీటర్లు మొత్తం ఆరు కిలోమీటర్ల మేర రహదారి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 2022 ఎండీబీ వర్క్స్‌లో భాగంగా గతంలో జరగాల్సిన పనులు ఆగిపో యాయి. ఇప్పుడు వాటిని ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్, ఎంపీ పుట్టా మహేష్ చొరవ తీసుకుని అధికారులతో సమీ క్షలు నిర్వహించి పనులను వేగవంతం చేశారు. జనవరి ఒకటో తేదీకి ఈ ఆరు కిలోమీటర్ల రోడ్డు ముస్తాబు చేసి ప్రారంభించాలని చర్యలు తీసుకున్నారు.
బుట్టాయగూడెం, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి):మన్యం వాసులను నాలుగు నెలలకు పైగా ముప్పుతిప్పలు పెడు తూ.. మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ.. ప్రయాణికులకు, వాహనదారులకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తూ.. వారిని ప్రమాదాల్లోకి నెట్టేసి.. ఆసుపత్రుల పాలు చేసిన బుట్టాయ గూడెం – జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ రెండు ప్రాంతాల మధ్య 5.68 కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ.4.50 కోట్లు విడుదలయ్యాయి. గతంలో వేసిన బీటీ రోడ్డు పూర్తిగా పాడవడంతో నాలుగు నెలల క్రితం రోడ్డు ను పూర్తిగా తవ్వి గ్రావెల్ రజను వేసి చదును చేసి వదిలే శారు. నెలలు గడుస్తున్నా పనులు ముందుకు సాగలేదు. వర్షాలు ప్రారంభం కావడంతో చదును చేసిన రోడ్డు పూర్తిగా గోతులతో నిండిపోయింది. వర్షాలు తగ్గడంతో రోడ్డంతా దుమ్ముమయంగా మారింది. ప్రజలు, వాహనదా రులు నానా అవస్థలు పడ్డారు. రోడ్డు దుస్థితిపై అధికారు లు, పాలకుల తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాలకు వెళ్లాలంటే ఇదొక్కటే మార్గం. అందుకే రోడ్డు పాడైనా, ప్రమాదాలు జరుగున్నా తప్పని పరిస్థితు ల్లో ప్రయాణాలు చేసేవారు. నిధులు విడుదలైనా పనులు నిలిచిపోవడానికి అనేక కారణాలున్నా కాంట్రాక్టరు వర్షాకా లం కావడంతో పనుల్లో జాప్యం జరిగినట్లు చెబుతున్నారు. చివరకు ప్రభుత్వం హెచ్చరికతో, కలెక్టర్ ఆగ్రహంతో నేత ల చొరవతో సోమవారం రాత్రి నుంచి పనులు ప్రారంభ మయ్యాయి. పైదావారిగూడెం కాలనీ నుంచి మర్లగూడెం అడవి వరకు ఒకపక్క రోడ్డు పనులు పూర్తయ్యాయి. మరో పక్క వారంలో పూర్తి చేయనున్నట్టు ఇన్‌చార్జ్ పీఆర్ ఏఈ ప్రకాశ్ తెలిపారు. పనులు ప్రారంభం కావడంతో మన్యం వాసులు హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆర్‌అండ్‌బీ రహదారుల మరమ్మతులకు రూ.కోటీ 80 లక్షలు విడుదల
(ఏలూరు–ఆంధ్రజ్యోతి):
జిల్లాలో వరుస తుఫాన్లు, వరదలతో ఆర్‌అండ్‌బీ రోడ్లన్నీ గోతులమయంగా మారాయి. ఇటీవల ప్రజల నుంచి వ్యతిరే కత పెరిగింది. ప్రజా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశా రు. ఇటీవల ఎంపీ మహేశ్ ఆధ్వర్యంలో జరిగిన దిశ సమా వేశంలోను, ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన డీఆర్‌సీలోను కీలక చర్చ సాగింది. ఆ తర్వాత రోడ్ల అభివృద్ధికి శాశ్వత ప్రతిపాదనలతో అంచనాలు సిద్ధం చేయా లని నిర్ణయించారు. ఇటీవల ఉంగుటూరు లో పర్యటించిన సీఎం చంద్రబాబు సైతం జనవరి నాటికి రోడ్లపై ఏర్పడిన గుంతల చింత తీరుస్తామని, తర్వాత మెరుగైన రోడ్లగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖ ఇంజ నీర్లు గుంతలు పూడ్చే దిశగా శరవేగంగా పనులు చేపడుతున్నారు. జిల్లాలోని 90 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రోడ్లకు గాను 60 కిలోమీటర్లు ధ్వంసమయ్యాయి. వీటి మర మ్మతులకు మెయింటినెన్స్ గ్రాంట్ కింద కిలో మీటరుకు రూ.20 వేలు చొప్పున వెచ్చిస్తారు. జిల్లావ్యాప్తంగా అన్ని రహదా రులు మరమ్మతులు చేసి ఫిబ్రవరి నాటికి కొలిక్కి తీసుకు వచ్చేందుకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి రూ.1.80 కోట్లు మంజూరయ్యాయి. జిల్లాలో ప్రతీ రోడ్డు అభివృద్ధికి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎంపీ మహేశ్ ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ శాఖ ఇటీవల సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసింది. శాశ్వత ప్రాతిపదికగా రోడ్లు వేయాలంటే రూ.227.34 కోట్లు అవస రం. రాష్ట్ర హైవే 373 కిలోమీటర్లలో 162 కిలోమీటర్లకు రూ. 58.15 కోట్లు, మెటల్ రోడ్లు 709 కిలోమీటర్లలో 361 కిలో మీటర్లకు రూ.169.19 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశా రు. నిధుల సాధనకు ఆయన భరోసా ఇచ్చారు.
రూ.5.5 కోట్లతో రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన
వేలేరుపాడు, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి):వేలేరుపాడు మండలంలో అధ్వానంగా వున్న ఆర్‌అండ్‌బీ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5.5 కోట్లు మంజూరుచేసింది. రెడ్డిగూడెం క్రాస్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో మేడేపల్లి–వేలేరుపాడు, రె డ్డిగూడెం క్రాస్‌రోడ్డు–రుద్రమ్మకోట, వేలేరుపాడు–కోయిదా టేకూరు, వేలేరుపాడు–రుద్రమ్మకోట రహదారులను పునఃనిర్మిస్తారు. త్వరలోనే టెండర్లు ఖరారు చేసి పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.