మార్పు భేష్ !
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:37 AM
ఏలూరు జిల్లాలో సారా నిర్మూలనకు చేపట్టిన ‘మార్పు’ కార్యక్రమం భేష్ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు కితాబునిచ్చారు.
సారా తయారీ వీడిన కుటుంబాలకు ఉపాధి మంచి నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా అమలు
కలెక్టర్‌ను వెట్రిసెల్విని అభినందించిన సీఎం
జీఎస్టీలో మెరుగ్గా 11.. రెవెన్యూ వసూళ్లలో 19వ స్థానం .. పంచాయతీ పన్నుల వసూళ్లలో 24వ స్థానం
ఏలూరు,డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లాలో సారా నిర్మూలనకు చేపట్టిన ‘మార్పు’ కార్యక్రమం భేష్ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు కితాబునిచ్చారు. సారాపై ఉక్కుపాదం మోపామంటూ అనుకోకుండా వారికి ప్రత్నామ్నాయ ఉపాధి కల్పించి, సారా తయారీని భవిష్య త్తులో నిలువరించే దిశగా చర్యలు తీసుకోవడం మంచి నిర్ణయమన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమ లు చేయాలని కలెక్టర్లకు ఆయన సూచించారు. అమరావతి లో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు లో రెండోరోజు గురు వారం జిలాల్ల వారీగా బెస్ట్ ప్రాక్టీస్‌లు చేపట్టిన కలెక్టర్లు వివిధ అంశాలపై ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
కలెక్టర్ కె.వెట్రిసెల్వి తాము జిల్లాలో అమలు చేస్తున్న ‘మార్పు’ కార్యక్రమంపై ప్రజంటేషన్ ఇచ్చారు. జిల్లాలో సారా తయారీ వీడిన కుటుంబాలను ప్రత్యామ్నాయ ఉపాధికి మార్పు పథకం ద్వారా సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని వివరించారు. ఆమె మాట్లాడుతూ ‘నవోదయం 2.0 ద్వారా సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దే క్రమంలో ఏలూరు జిల్లాలో సారా తయారీని వీడిన కీలకమైన 16 గ్రామాల్లో 226 కుటుంబాలను ఎంపిక చే శాం. జిల్లాలలో 15 మండలాల్లో 141 గ్రామాల్లో సారా అక్రమ మద్యం సరఫరాను గుర్తించి కట్డడి చేస్తూనే స్వయం సహాయక సంఘాల ద్వారా మార్పు సారా తయారీ వీడిన వారిని గుర్తించాం. ఉన్నతి, స్ర్తీనిధి, బ్యాంకు లింకేజీ రుణాలందజేశాం. 40 కుటుంబాలకు తొలి విడతగా రూ.31.40 లక్షలు రుణాలను అందచేశాం. ఈ ఏడాది మేలో గుర్తించి రుణాలివ్వగా, ప్రతీ నెల ఉపాధి యూనిట్ల ద్వారా రూ.8 వేల నుంచి రూ.15 వేలు ఆదాయం సంపాదిస్తున్నారు. వీరిని నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. వచ్చే నెలలో మరో 55 కుటుంబాలకు రుణాలు అంద జేస్తాం సార్’.. అని కలెక్టర్ వివరించారు. దీనికి సీఎం చంద్రబాబు స్పందిస్తూ కలెక్టర్‌ను అభినందించారు.
22ఏ భూముల సమస్యపై చర్చ
కలెక్టర్ ప్రసంగం సందర్భంలోనే జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ 22ఏ భూముల సమస్య పరిష్కారానికి జిల్లాలో చేపట్టిన మెగా గ్రీవెన్స్‌పై సీఎం వద్ద ప్రస్తావిం చారు. జిల్లా యంత్రాంగాన్ని, మంత్రిని సీఎం అభినందిస్తూ ఏలూరును ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోనూ భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసు కోవాలని ఆదేశించారు.
పన్నుల వసూళ్లలో అట్టడుగున..
జిల్లాలో వివిధ పన్నుల వసూళ్లలో జిల్లా వెనుకబడింది. రెవెన్యూ వసూళ్లలో 19వ స్థానంలో నిలిచింది. గనుల శాఖ ఆదాయంలో భాగంగా జీవీఏలో 0.2 శాతంతో ఏలూరు 23వ స్థానంలో నిలిచింది. పంచాయతీ పన్నుల వసూళ్లలో 24వ స్థానంలో నిలిచింది. పాత బకాయిలు రూ.12 కోట్ల 14 లక్షలు, ప్రస్తుత సంవత్సరం రూ.42 కోట్ల 32 లక్షలతో కలుపుకుంటే రూ.54.47 కోట్ల వసూలు చేయాల్సి ఉండగా, కేవలం రూ.5.36 కోట్లు వసూలు చేశారు. స్వమిత్ర సర్వేలో 11వ స్థానంలో నిలిచింది. 300 గ్రామాలకు 182 గ్రామాల్లో సర్వే పూర్తి కాగా 118 గ్రామాల్లో చేయాల్సి ఉంది.
జీఎస్టీ వసూళ్లలో ఏలూరు 11వ స్థానంలో నిలిచింది. 98.14 కోట్లకు 122,87 కోట్ల లక్ష్యాలను చేరుకుంది. వృద్దిరేటు 6.04 శాతం ఉంది. 21వ స్థానంలో నిలిచింది.
జిల్లాలో నిర్వహించిన ఏడు జాబ్ మేళాలకు 342 పరిశ్రమల యాజమాన్యాలు – హాజరు కాగా 2,504 మందికి ఉద్యోగాలు కల్పించారు. నియోజకవర్గానికి 417 మంది ఉద్యోగాలు కల్పించగలిగారు. జిల్లాకు 20వ స్థానం లభించింది. పీఎంకేవై కింద 360 యూనిట్ల ద్వారా 9వ స్థానంలో నిలిచింది. నిరుద్యోగులకు వర్క్‌ఫ్రమ్ కౌశలం స్కిల్ అసెసెమ్‌మెంట్‌లో 90,739 మందికి 3,884 మంది పరీక్షలకు హాజరయ్యారు.
విశాఖ పెట్టుబడుల సదస్సులో పరిశ్రమల స్థాపనకు నాలుగు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఒక కంపెనీ ప్రతిపాదనను అంగీకరించి కోటి రూపాయలు పెట్టుబడి పెట్టారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా 2024 నుంచి 384 మందికి పరిశ్రమల శాఖ ద్వారా, గనులశాఖ ద్వారా 54 మంది, మొత్తం 442 మంది ఉద్యోగాలు కల్పించారు. ఉచిత – ఇసుక విధానంలో 69 శాతం సంతృప్తిస్థాయి ప్రజల నుంచి వ్యక్తమైంది.
విద్యుత్ ఆదాలో భాగంగా సోలార్ యూనిట్లు ఏర్పాటులో 27,053 మంది ఎస్సీ, ఎస్టీ, 92,928 మంది, బీసీలు, ఇతరులు 3వేల 177 మందిని ఎంపిక చేసి 11వ స్థానంలో నిలిచింది.