Share News

అద్దంలా పల్లె రోడ్లు

ABN , Publish Date - Nov 27 , 2025 | 12:00 AM

మట్టి రోడ్లతో విసిగిపోయిన పల్లె ప్రజలకు తీపి కబురే ఇది. గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించాలని కూటమి సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.

అద్దంలా పల్లె రోడ్లు

వంద శాతం సీసీ రోడ్ల లక్ష్యంగా ప్రతిపాదనలు

ఆర్థిక వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం

తాడేపల్లిగూడెం రూరల్‌, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): మట్టి రోడ్లతో విసిగిపోయిన పల్లె ప్రజలకు తీపి కబురే ఇది. గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించాలని కూటమి సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఏళ్ల తరబడి బురద రోడ్లలో ప్రయా ణించిన వారికి ఇకపై విముక్తి లభించనుంది. పల్లెలు అద్దంలా మెరవాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నారు. ఒకపక్క ఆర్థిక సంఘం నిధులు వాడుకోవడానికి ఆర్థిక వెసులు బాటు కల్పించడంతో పాటు ఉపాధిహామీ పఽథకం ద్వారా మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులను సీసీ రోడ్లు, డ్రైయిన్‌ల నిర్మాణానికి వెచ్చించనున్నారు. మరోపక్క జిల్లా పరిషత్‌ నిధులు, మండల పరిషత్‌ నిదుల నుంచి సీసీ రోడ్ల నిర్మాణానికి అవకాశం కల్పిస్తున్నారు. దీంతో గత టీడీపీ హయాంలో నిర్మించిన సీసీ రోడ్ల తరువాత మిగిలిపోయిన రోడ్లు నిర్మించేందుకు అన్ని ప్రాంతాల్లోనూ ప్రతిపాదనలు సిద్దం చేశారు.

నియోజకవర్గానికి రూ.4 కోట్లతో..

కూటమి ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన తరువాత రికార్డుస్థాయిలో గ్రామ సభలు నిర్వహించి గ్రామాల్లో అవసరమైన పనులు చేపట్టేందుకు తీర్మాణాలు తీసుకున్నారు. ఆ తీర్మాణాలకు అనుగుణణగా నియోజక వర్గానికి రూ.7 కోట్ల మేర సీసీ రోడ్లు నిర్మించగా ప్రస్తుతం నియోజకవర్గానికి రూ.4 కోట్ల మేర ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో ఏళ్ల తరబడి మట్టి రోడ్లే ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ నిర్ణయంతో సీసీ రోడ్లు వేయనున్నారు. తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట, పాలకొల్లు తదితర నియోజక వర్గాల్లో ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధం చేశారు.

Updated Date - Nov 27 , 2025 | 12:00 AM