Share News

నిఘా నేత్రం !

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:36 AM

గత కొద్ది నెలల క్రితం పట్టణం లోని ఓ కళాశాల సమీపంలో సచి వాలయ ఉద్యోగిని రాత్రి సమయంలో తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి ఆ మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కుని పారిపోయాడు.

నిఘా నేత్రం !
జంగారెడ్డిగూడెంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న దృశ్యం

జంగారెడ్డిగూడెంలో భారీగా సీసీ కెమెరాల ఏర్పాటు

ఇకపై నేరాలకు పడనున్న అడ్డుకట్ట

44 హై క్వాలిటీ కెమెరాలు అందించిన నవభారత్‌పామాయిల్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం

జంగారెడ్డిగూడెం, ఏప్రిల్‌ 25 (ఆంధ్ర జ్యోతి) : గత కొద్ది నెలల క్రితం పట్టణం లోని ఓ కళాశాల సమీపంలో సచి వాలయ ఉద్యోగిని రాత్రి సమయంలో తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి ఆ మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కుని పారిపోయాడు. ఈ ఘటన జరిగిన కొద్దిరోజుల్లోనే పేరంపేట రోడ్డులో మరో మహిళ రాత్రిపూట వెళ్తుండగా ఆమె మెడలో గొలుసును ఓ వ్యక్తి తెంచుకుని పోయాడు. రామచంద్రాపురంలో ఓ ఆలయం పునఃప్రతిష్ఠ రోజున దర్శనానికి వచ్చిన ఐదుగురు మహిళల మెడల్లోని బంగారు సూత్రాలను తెంచుకు పోయారు. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేక పోవడంతో నిందితులను పట్టుకోవడంలో పోలీసు లకు సవాల్‌గా మారింది. పట్టణంలో నామమాత్రం గానే సీసీ కెమెరాలు ఉండడం, అందులో చాలా వరకు మరమ్మతులకు గురికావడంతో పోలీసులు దీనిపై దృష్టి సారించారు. పట్టణంలోని అన్ని ప్రధాన రహదారుల్లో దాతల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. స్థానిక నవభారత్‌ పామాయిల్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం దాదాపు రూ.37 లక్షల వ్యయంతో 44 అత్యాధునిక నైట్‌ విజన్‌ హై క్వాలిటీ సీసీ కెమెరాలను పోలీసులకు అందజేశారు. వీటిని పట్టణంలో ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్‌ స్టేషన్‌లో అన్ని ప్రాంతాలను పరిశీలించేలా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ఇకపై పట్టణంలో చైన్‌స్నాచింగ్‌, నేరాలకు అడ్డుకట్ట పడుతుందని పోలీసులు భావిస్తున్నారు.

కొత్తగా 44 సీసీ కెమెరాల ఏర్పాటు

నవభారత్‌ పామాయిల్‌ ఫ్యాక్టరీ వారి సహకారంతో పట్టణంలో 44 అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. పాత కెమెరాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. చాలా కేసుల్లో నేరస్తులను పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. పట్టణంలో వ్యాపారస్తులు తమ దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించాం. సీసీ కెమెరాల బిగింపు పూర్తయిన తర్వాత ప్రారంభిస్తాం. ప్రస్తుతం కెమేరాల పనితీరును పరిశీలిస్తున్నాం.

– కె.కృష్ణబాబు, సీఐ, జంగారెడ్డిగూడెం

Updated Date - Apr 26 , 2025 | 12:36 AM