ఉండిలో నిఘా నేత్రం
ABN , Publish Date - May 27 , 2025 | 12:16 AM
ఉండి నియోజకవర్గంలో నేరాలు, దొంగతనాలు అరికట్టడానికి డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు వినూత్న ఆలోచన చేశారు.
నియోజకవర్గంలో రూ. 3 కోట్లతో
సీసీ కెమెరాల ఏర్పాటుకు శ్రీకారం
దాతల నుంచి రూ. 1.20 కోట్లు సేకరణ
కాళ్ళ, మే 26 (ఆంధ్రజ్యోతి): ఉండి నియోజకవర్గంలో నేరాలు, దొంగతనాలు అరికట్టడానికి డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు వినూత్న ఆలోచన చేశారు. నేరస్తులు తప్పించుకోకుండా నియోజకవర్గమంతా సీసీ కెమెరాలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ. 3 కోట్లతో 71 గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రభుత్వ నిధులతో పని లేకుండా తన స్నేహితులు, దాతల సహకారంతో ఇప్పటికే సుమారు రూ.1.2 కోట్లు సేకరించి ఐజీ అశోక్ కుమార్ సమక్షంలో కలెక్టర్ నాగరాణికి అందజేశారు. రాష్ట్రంలో మొదటిసారి ఉండి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటుపై నాయకులు, అధికారులు రఘురామకృష్ణరాజుకు అభినందనలు తెలిపారు. నియోజకవర్గంలో ఏర్పాటు చేసే కెమెరాలతో జిల్లాలోని అన్ని చోట్ల కెమెరాలను అనుసంధానం చేస్తూ పెద అమిరంలో ఒక కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల నేరాలు తగ్గడమే కాకుండా మహిళలకు భద్రత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. పోలీసు వ్యవస్థ పట్టిష్టం చేయడంలో భాగంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాల పోలీస్ స్టేషన్లకు దాతల సహకారంతో జీపులు అందజేశారు.