కాలువలు ఇలా.. పొలాలకు నీరెలా..?
ABN , Publish Date - Jul 21 , 2025 | 12:40 AM
పంట కాలువలు గుర్రపు డెక్క, తూటుతో నిండిపోయాయి.ప్రధాన పంట కాలువలు నుంచి విడుదల చేస్తున్న కొద్దిపాటి నీరు పొలాలకు చేరే అవకాశం లేకుండా పోయింది.
గుర్రపు డెక్కతో నిండిన బ్రాంచి కాలువలు
నీరందక రైతుల ఆందోళన
ముదినేపల్లి, జూలై 20 (ఆంధ్రజ్యోతి): పంట కాలువలు గుర్రపు డెక్క, తూటుతో నిండిపోయాయి.ప్రధాన పంట కాలువలు నుంచి విడుదల చేస్తున్న కొద్దిపాటి నీరు పొలాలకు చేరే అవకాశం లేకుండా పోయింది. ముదినేపల్లి ప్రాంతంలోని పోల్‌రాజ్, క్యాంప్ బెల్ ప్రధాన పంట కాలువలకు చెందిన బ్రాంచి కాలువలు అత్యధిక శాతం గుర్రపు డెక్కతో నిండిపోవడంతో సాగు నీరు కదిలే పరిస్థితి లేకుండాపోయింది. సార్వా సీజనుకు ముందే పంట కాలువల నిర్వహణపై జల వనరుల శాఖ అధికారులు దృష్టి పెట్టకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. క్యాంప్ బెల్ కెనాల్‌కు సంబంధించిన పలు పంట కాలువల్లో నీటి ప్రవాహం స్తంభించేలా గుర్రపు డెక్క పేరుకుపోగా, పోల్‌రాజ్ కెనాల్‌కు చెందిన అన్నవరం, గురజ తదితర బ్రాంచి కాలువలు డెక్కతో నిండి కాలువ కనిపించని పరిస్థితి నెలకొంది. చేవూరు పొలిమేరకోడు పంట కాలువ పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. గుర్రపు డెక్క తొలగింపునకు ప్రభుత్వం నుంచి కొంత నిధులు మంజూరయ్యాయి. అయితే వాటి వినియోగంలో విధించిన నిబంధనల కారణంగా పనులు చేపట్టేందుకు నీటి సంఘాల అధ్యక్షులు, సభ్యులు ముందుకు రావడం లేదు.
బిల్లులు సత్వరం చెల్లించాలి
పంట కాలువల్లో గుర్రపు డెక్క బాగా పేరుకు పోయింది. నీరు ప్రవహించే అవకాశం లేదు. డెక్క తొలగింపు పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు చేసి చెల్లింపులు జరపాలి. ఇప్పుడు చేసే పనులకు 2026 మార్చి తర్వాత బిల్లులు చేస్తామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఇలా అయితే పనులు జరగవు. పొలాలకు నీరు అందదు.
– శాయిన ప్రసాదరావు, నీటి సంఘం అధ్యక్షుడు, చేవూరు