ప్రతి కాల్వను ఆధునీకరిస్తాం
ABN , Publish Date - May 24 , 2025 | 12:31 AM
గోదావరి జిల్లాలో ప్రతి కాల్వను ఆధునీకరిస్తామని మంత్రి నిమ్మల రామనాయుడు స్పష్టం చేశారు.
త్వరలో డీపీఆర్ : మంత్రి నిమ్మల రామానాయుడు
నరసాపురం రూరల్, మే 23(ఆంధ్రజ్యోతి): గోదావరి జిల్లాలో ప్రతి కాల్వను ఆధునీకరిస్తామని మంత్రి నిమ్మల రామనాయుడు స్పష్టం చేశారు. రాడార్ సాయంతో కాల్వల ఆఽధునీకరణ పనులపై సర్వే చేస్తున్నామని, త్వరలో డీపీఆర్ సిద్ధం చేస్తామన్నారు. సరిపల్లిలో రూ.56 లక్షలతో డ్రెయినేజీల తవ్వకం పనుల కు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడు తూ వ్యవసాయంపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు. గత ఐదేళ్లలో తట్ట మట్టి, లాకులకు గ్రీజ్ పెట్టకుండా ఇరిగేషన్ వ్యవస్థను భ్రష్టు పట్టించారన్నారు. కొన్ని ప్రాంతాల్లో సార్వా పంటను వదులుకోవాల్సి వచ్చిందన్నారు. ఎక్కువ గోదావరి జిల్లాల్లోనే ఈ పరిస్థితి కనిపించిందన్నారు. గత ఐదేళ్లు రైతు వ్యతిరేక పాలన సాగిందన్నారు. కూటమి రైతు పక్షపాత ప్రభుత్వం అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో సొమ్మును ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. పశ్చిమలో ఇప్పటి వరకు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశా మని, 73వేల మంది రైతుల ఖాతాల్లో రూ.1281కోట్లు జమ చేశామన్నారు. మరో 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించామన్నారు. విప్ నాయకర్ మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కరించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, రైతులతో కలిసి సరిపల్లి, నత్తలావ, 5 తూముల మురికి కాల్వలను ఆధునీకరించడంతో పాటు లాకుల మరమ్మతులు చేపట్టాలని, పంట కాల్వలను ప్రక్షాళన చేయాలని మంత్రికి వినతిపత్రం అందించారు. టీడీపీ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు, మత్స్యకార సహకార సంఘాల సమైఖ్య చైర్మన్ కొల్లు పెద్దిరాజు, డీఈ మోహన్‌కృష్ణ, గుబ్బల మార్రాజు, సర్పంచ్ ఈదా సురేష్‌బాబు పాల్గొన్నారు.
మంచిలి లింక్ రోడ్డు అభివృద్ధికి రైల్వే గ్రీన్ సిగ్నల్
భీమవరం టౌన్: మంచిలి – ఆరవల్లి మధ్య రైల్వే లెవల్ క్రాసింగ్ 138 నుంచి 136 వరకు లింక్ రోడ్డు అధ్వానం కావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించాలని మంచిలి గ్రామస్తులు తీర్మానం చేసి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కేంద్ర మంత్రి వర్మ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు లేఖ రాశారు. 840 మీటర్ల పొడవు, 5.5 మీటర్ల వెడల్పుతో సిమెంట్ రోడ్డు నిర్మించాలని కోరారు. రోడ్డు అభివృద్ధికి ప్రణాళిక తయారు చేశామని, ఆమోదం అనంతరం పనులు ప్రారంభిస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కేంద్రమంత్రికి లేఖ రాశారు. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, రైల్వే అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.