Share News

భీమవరం స్పెషల్‌ సబ్‌ జైలుకు కొత్త కళ

ABN , Publish Date - Aug 31 , 2025 | 12:42 AM

పురాతనమైన భీమవరం స్పెషల్‌ సబ్‌ జైలుకు ప్రస్తుతం కొత్త కళ వచ్చింది. ఎప్పటి నుంచో పాత సబ్‌ జైల్‌లోనే రిమాండ్‌ ఖైదీలను ఉంచేవారు. ఇటీవల దానిని మార్పు చేసి సెంట్రల్‌ బ్యాంక్‌లోని సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ ద్వారా అధునాతనంగా తీర్చిదిద్దేందుకు జైలు సూపరింటెండెంట్‌ దుంపల వెంకటగిరి ముందుకు కదిలారు.

భీమవరం స్పెషల్‌ సబ్‌ జైలుకు కొత్త కళ
భీమవరం సబ్‌ జైల్‌ ముఖద్వారం.. పక్కనే ప్రారంభించిన పెట్రోల్‌ బంకు

పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటుతో ఖైదీలకు ఉపాధి

త్వరలో పచ్చదనంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు అధికారుల కృషి

భీమవరం క్రైం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): పురాతనమైన భీమవరం స్పెషల్‌ సబ్‌ జైలుకు ప్రస్తుతం కొత్త కళ వచ్చింది. ఎప్పటి నుంచో పాత సబ్‌ జైల్‌లోనే రిమాండ్‌ ఖైదీలను ఉంచేవారు. ఇటీవల దానిని మార్పు చేసి సెంట్రల్‌ బ్యాంక్‌లోని సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ ద్వారా అధునాతనంగా తీర్చిదిద్దేందుకు జైలు సూపరింటెండెంట్‌ దుంపల వెంకటగిరి ముందుకు కదిలారు. ఈమేరకు జైలు వాతావరణం మొత్తం మారిపోయింది. ఖైదీలు ఉండేందుకు అధునాతనంగా సదుపాయాలను ఏర్పాటు చేశారు. గతంలో 62 మంది ముద్దాయిలు, 8 మంది మహిళా ముద్దాయిలకు వసతులు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం 70 మంది ముద్దాయిలకు 20 మంది మహిళా ముద్దాయిలకు వసతులు కల్పించేలా చర్యలు చేపట్టారు. మహిళా ముద్దాయిలు ఉండేందుకు నాలుగు స్పెషల్‌ బ్లాక్‌లను ఏర్పాటు చేశారు. వీడియో లింకేజీ రూమ్‌, స్టోర్‌ రూమ్‌, అధునాతనమైన బాత్‌రూమ్‌లు వంటి వాటిని ఏర్పాటు చేశారు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సహకారంతో పెట్రోల్‌ బంకును ఏర్పాటు చేసి ఖైదీల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తున్నారు. స్థలాన్ని జైలు అధికారులు ఇవ్వడంతో ఐఓసీ సంస్థ కొంత పెట్టుబడితో పెట్రోల్‌ బంక్‌ను ఏర్పాటు చేసింది. వచ్చిన ఆదాయాన్ని ఖైదీల సంక్షేమ నిధిలో జమ చేస్తున్నారు. పెట్రోల్‌ బంకు ఏర్పాటుకు సుమారు కోటి రూపాయల వరకు వెచ్చించారు. జైలును అధునాతనంగా తీర్చిదిద్దేందుకు కోటిన్నర రూపాయల వరకు వెచ్చించారు. త్వరలోనే జైలులో మొత్తం పచ్చదనాన్ని ఆహ్లాదకరంగా చేసేందుకు అన్నీ సిద్ధం చేశామని తెలిపారు. పెట్రోల్‌ బంకులో పని చేసేందుకు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి ఆరుగురు ఖైదీలను డీఐజీ, ఎస్పీ ఆధ్వర్యంలో ఎంపిక చేసి బంక్‌లో పని చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈవిధంగా పనిచేసే ఖైదీలకు 8 గంటలు విధులకు గాను రూ.200 నగదును చెల్లించే విధంగా చర్యలు చేపట్టారు. వీరికి శిక్ష కూడా తగ్గుతుందని తెలిపారు.

Updated Date - Aug 31 , 2025 | 12:42 AM