Share News

పండగ స్పెషల్‌ లేనట్టే!

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:26 AM

సంక్రాంతి పండుగ వస్తోందంటే హైదరాబాద్‌ నుంచి జిల్లాకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులపై ప్రత్యేక దృష్టి పెట్టేది. ప్రత్యేక బస్సులను పంపి అక్కడ జిల్లావాసులను పండగ చేసుకునేందుకు తరలించేవారు.

పండగ స్పెషల్‌ లేనట్టే!

ఈసారి సంక్రాంతికి హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులు నడపడం కష్టమే

లోకల్‌ ట్రాఫిక్‌ క్లియరెన్స్‌పై ప్రత్యేక దృష్టి

విశాఖకు ప్రత్యేక సర్వీసుల యోచన

భీమవరం టౌన్‌, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి):సంక్రాంతి పండుగ వస్తోందంటే హైదరాబాద్‌ నుంచి జిల్లాకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులపై ప్రత్యేక దృష్టి పెట్టేది. ప్రత్యేక బస్సులను పంపి అక్కడ జిల్లావాసులను పండగ చేసుకునేందుకు తరలించేవారు. రాష్ట్ర విడిపోక ముందు, విడిపోయిన తరువాత ప్రత్యేక సర్వీసులు నడిచాయి. ఈసారి ప్రత్యేక సర్వీసులు నడిపే ఆలోచన జిల్లా ఆర్టీసీ అధికారుల్లో కనిపించడంలేదు. ఇప్పటికే రెగ్యులర్‌గా తిరిగే నాలుగు డిపోల బస్సులకు రిజర్వేషన్‌ పూర్తయి నెల రోజులు అవుతోంది. పండుగ మరో 25 రోజులే ఉన్నప్పటికీ ఆర్టీసీ అధికారులు స్పెషల్‌ సర్వీసులపై ఊసెత్తడంలేదు. పైస్థాయిలోనే ప్రత్యే సర్వీసులు నడిపే ఆలోచన లేదనే సమాచారం. గతేడాది జనవరిలో జిల్లాలోని నాలుగు డిపోల నుంచి సంక్రాంతి ముందు 125కే పైగా సర్వీసులు నడపగా దాదాపు రూ.32 లక్షలు ఆదాయం వచ్చింది. సంక్రాంతి పండుగ తరువాత హైదరాబాద్‌కు జిల్లా నుంచి 170కు పైగా బస్సులు నడపటంతో దాదాపు రూ.45 లక్షలు ఆదాయం వచ్చింది.

స్త్రీశక్తి దెబ్బకు స్పెషల్స్‌ కు రాంరాం

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడంతో ఒక్కసారిగా ఆర్టీసీ ఆక్యూపెన్సీ దాదాపు 80 శాతానికి చేరింది. డిపోల్లో ఉన్న అన్ని బస్సులను రోడ్డుమీద తిప్పేలా మ్యాప్‌లు సిద్ధంచేసిన తరుణంలో బస్సులు అందుబాటులో లేక హైద రాబాద్‌ స్పెషల్‌ సర్వీసుల ఏర్పాటుపై దృష్టి పెట్టడం లేదు. దీనికి కారణం ఒక బస్సు హైదరాబాద్‌ పంపితే మూడు సమయం పడుతుందని, దీనివల్ల లోకల్‌ ట్రాఫిక్‌కు బస్సులు కొరత, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

విజయవాడపైనే ప్రత్యేక దృష్టి

ప్రత్యేక సర్వీసులు లేని కారణంగా విజయవాడ నుంచి జిల్లాకు ప్రయాణికులను తీసుకొచ్చేం దుకు ప్రత్యేక దృష్టిపెట్టి అదనపు సర్వీసులతో బస్సులు నడిపేలా ఆలోచన చేస్తున్నామని, జిల్లా ప్రజారవాణాధికారి వర ప్రసాద్‌ ‘ఆంధ్ర జ్యోతి’కి చెప్పారు. భీమవరం, తణుకు రూట్లలో ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. హైదరాబాద్‌కు నడుపుతున్న రెగ్యులర్‌ సర్వీసలు కొనసాగుతాయన్నారు. మహిళలకు ఉచిత బస్సు ద్వారా ట్రాఫిక్‌ బాగా పెరిగిందని, వీటిని క్లియర్‌ చేసేదానిపై దృష్టిపెడుతున్నామన్నారు. ట్రాఫిక్‌ రద్దీ ఉంటే విశాఖపట్నానికి ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రైవేట్‌ బస్సులే దిక్కు

సంక్రాంతి పండుగకు హైదరాబాద్‌ నుంచి వచ్చే ప్రయాణికులు ఇక ప్రవేట్‌ బస్సులనే ఆశ్ర యించాల్సి ఉంటుంది. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడిపే ఆలోచన లేని పరిస్థితుల్లో జిల్లాకు రావాలంటే ప్రైవేట్‌ బస్సులు కానీ తెలంగాణ ఆర్టీసీ బస్సులే దిక్కుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రత్యేక రైళ్లు, ప్రైవేట్‌ బస్సుల టికెట్లు హట్‌ కేకులా రిజర్వేషన్‌లు పూర్తవుతున్న తరుణంలో జిల్లా వాసులకు సంక్రాంతి రాక కష్టాలు తప్పేటట్టు లేదు.

Updated Date - Dec 21 , 2025 | 12:26 AM