Share News

బస్సు ఆపండి..

ABN , Publish Date - Dec 05 , 2025 | 12:26 AM

కళాశాలకు వెళ్లే విద్యార్థులకు సరిపడా బస్సు సర్వీసులు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎగువున రంగాపురం నుంచి వచ్చే బస్సు దిగువున ఉన్న గ్రామాలకు వచ్చే సరికి నిండుగా ప్రయాణికులు ఉండడంతో బస్సు ఆగకుండా వెళ్లపోవడంతో కాలేజీలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నామంటూ విద్యార్థులు గురువారం ఉదయం కూచింపూడిలో బస్సును ఆపి, ఆందోళనకు దిగారు.

బస్సు ఆపండి..
కూచింపూడిలో బస్సును ఆపి నిరసన తెలుపుతున్న విద్యార్థులు

కళాశాలలకు సమయానికి వెళ్లలేకపోతున్నామని విద్యార్థుల ఆవేదన

పెదవేగి, డిసెంబరు4(ఆంధ్రజ్యోతి):కళాశాలకు వెళ్లే విద్యార్థులకు సరిపడా బస్సు సర్వీసులు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎగువున రంగాపురం నుంచి వచ్చే బస్సు దిగువున ఉన్న గ్రామాలకు వచ్చే సరికి నిండుగా ప్రయాణికులు ఉండడంతో బస్సు ఆగకుండా వెళ్లపోవడంతో కాలేజీలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నామంటూ విద్యార్థులు గురువారం ఉదయం కూచింపూడిలో బస్సును ఆపి, ఆందోళనకు దిగారు. ఏలూరు నుంచి పెదవేగి, కూచింపూడి, రామశింగవరం మీదుగా రంగాపురానికి ఆర్టీసీ ఎదురెదురుగా రెండు బస్సులను నడుపుతోంది. ఉదయం కాలేజీలకు వెళ్లే సమయంలో, సాయంత్రం తిరిగి వచ్చే సమయంలో బస్సులు ఖాళీలేక అవస్థలు పడుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ఉదయం సమయంలో నిండుగా వస్తున్న బస్సును కూచింపూడి, పెదవేగి, లక్ష్మీపురం గ్రామాల్లో నిలుపుదల చేయడంలేదని విద్యార్థులు పేర్కొంటున్నారు.

పలుమార్లు వినతి పత్రాలు అందజేత

ఆటోలో వెళ్లడానికి వ్యయం ఎక్కువ అవుతుందని, సమయానికి కాలేజీలకు చేరుకోలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విలువైన సమయమంతా బస్సులకోసం ఎదురుచూడడంలోనే గడిచిపో తుందని ఈ విషయమై ఆర్టీసీ విజయవాడ జోనల్‌ చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు, ఇతర ఆర్టీసీ అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందించి సమస్య పరిష్కరించాలని కోరామని, ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. రంగా పురంనుంచి గోపన్న పాలెం మధ్య వున్న 15గ్రామాలకు రెండు బస్సులు మాత్రమే ఉండ డంతో ముందుగా వచ్చే గ్రామాల్లోనే బస్సు నిండిపోవడంతో ఆపై దిగువ గ్రామాల ప్రజలు బస్సు ఎక్కడానికి కష్టమవుతోంది. ఇటీవల కాలంలో స్త్రీశక్తి పఽథకంతో మహిళలు ఎక్కువగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఇన్ని గ్రామాలకు రెండు బస్సులు ఏవిధంగా సరిపోతాయో ఆర్టీసీ అధికారులే ఆలోచించాలన్నారు.

గత అక్టోబరులోనూ నిరసన..

కళాశాలలకు వెళ్లే విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఉదయం, సాయంత్రం వేళల్లోనైనా అదనపు సర్వీసులను తిప్పాలని విద్యార్థులు వేడుకుంటున్నారు. గత అక్టోబరు 14వ తేదీన ఒకసారి బస్సును ఆపి, విద్యార్థులు నిరసన వ్యక్తంచేశారు. ఆ సమయంలో అదనపు సర్వీసు ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ అధికారులు ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. మరోసారి గురువారం ఉదయం బస్సును ఆపి, ఆందోళనకు దిగారు. స్థానిక టీడీపీ నాయకుడు గిత్తా సత్యనారాయణ, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు సమస్యను వివరించడంతో పరిష్కారానికి చర్యలు చేపడతామనడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.

కలెక్టర్‌కు చింతమనేని వినతి

ఏలూరు రూరల్‌ : పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో గురువారం కూచింపూడిలో బస్సును అడ్డుకుని విద్యార్థులు నిరసన తెలిపారు. స్థానిక కూటమి నాయకుల ద్వారా విద్యార్థుల సమస్యను తెలుసుకున్న దెందులూ రు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ విద్యార్థులతో కలిసి ఏలూరు జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వికి వినతిపత్రం అందజేశారు. సరైన బస్సు సర్వీసు లేక విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యను కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థుల ప్రయాణ సమస్యను సత్వరమే పరిష్క రించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Dec 05 , 2025 | 12:26 AM