ఆక్రమణల చెరలో..
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:42 AM
చింతలపూడి నగర పంచాయతీగా మారినా హిందూ శ్మశాన వాటికల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఉన్న శ్మశాన వాటిక స్థలాలు ఆక్రమణల చెరలో ఉన్నాయి. వీటిని అధి కారులు పట్టించుకోవడంలేదు. స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి తాము సహకరిస్తామని చెప్పినా చేయూతనివ్వడంలేదు.
చింతలపూడిలో పేరుకే మిగిలిన హిందూ శ్మశాన వాటికలు.. పట్టించుకోని అధికారులు
స్వచ్ఛంద సంస్థలకు అందని సహకారం
చింతలపూడి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి):చింతలపూడి నగర పంచాయతీగా మారినా హిందూ శ్మశాన వాటికల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఉన్న శ్మశాన వాటిక స్థలాలు ఆక్రమణల చెరలో ఉన్నాయి. వీటిని అధి కారులు పట్టించుకోవడంలేదు. స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి తాము సహకరిస్తామని చెప్పినా చేయూతనివ్వడంలేదు. ఫలితంగా మృతదేహా లను మరుభూమికి తరలిస్తున్న వారి బాధలు వర్ణణాతీతం. నగర పంచాయతీలో హిందూవులకు మూడుచోట్ల శ్మశాన స్థలాలు ఉన్నాయి. ఇవి చాలా వరకు ఆక్రమణల చెరలో ఉన్నాయి. సాయిరాం గుడి సమీపంలో ఉన్న శ్మశాన స్థలం ఎకరం 60 సెంట్లు గతంలో ఉండగా పట్టణం పెరిగిన కొద్ది ఆక్రమణకు గురికావడంతో కేవలం కొద్ది స్థలం మాత్రమే మిగిలింది. అక్కడ కనీసం నీటి సౌకర్యం లేదు. ఫైర్‌స్టేషన్ వెనుకవైపు భాగంలో ఉన్న శ్మశాన భూమి స్థలం పూర్తిగా ఆక్రమించబడింది. కనీసం మృతదేహాలకు దహనక్రియలు కూడా చేయడం లేదు. కాంతంపాలెం రోడ్డులోని శ్మశాన వాటికలో మానవత స్వచ్ఛంద సంస్థ రూ.ఆరు లక్షల వ్యయంతో కొన్ని సౌకర్యాలు కల్పించింది. దీనికి చెరువు ఆధారంగా ఉండడంతో నీటి సమస్యకు చెరువులో నీరు ఉన్నంత వరకు ఇబ్బందిలేదు. అయితే వర్షాకాలం వస్తే ఈ శ్మశాన వాటికకు వెళ్లాలంటే దారిలేక ఇబ్బంది పడుతున్నారు. శ్మశానవాటికలు ఆక్రమణలకు గురైనా అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. శ్మశాన వాటికల అభివృద్ధికి ఉపాధి నిధులు వినియోగించుకునే అవకాశం ఉన్నా అధికారు లు దీనిపై దృష్టి పెట్టకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. హిందూ స్మశాన స్థలాల్లో ఆక్రమణలు తొలగించాలని, సౌకర్యాలు కల్పించాలని ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో స్వచ్ఛంద సంస్థలు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు.
ఆక్రమణలు తొలగిస్తే అభివృద్ధి చేస్తాం
పట్టణంలోని హిందూ శ్మశాన స్థలాల్లో ఆక్రమణలు అధికారులు తొలగించి అప్పగిస్తే దాతల సహకారంతో అభివృద్ధి చేస్తాం. అందుకు అధికారులు చేయూతనివ్వాలి. కాని పలుమార్లు మేము విజ్ఞప్తులు చేసినా ఎందుకనో అధి కారులు మౌనం వహిస్తున్నారు. ప్రజల సమస్య పరిష్కారం కోసం ముందుకు రావాలి.
– ఆర్నేపల్లి అప్పారావు, మానవత గౌరవ అధ్యక్షుడు, చింతలపూడి