Share News

బులియన్‌ మార్కెట్‌కు పండుగ కళ

ABN , Publish Date - Aug 06 , 2025 | 12:23 AM

రెండు రోజుల క్రితం ప్రభుత్వం అన్నదాత సుఖీభవలో ప్రతి రైతు ఖాతాకు రూ.7 వేలు చొప్పున జమ చేసింది. చాలా మంది రైతు కుటుంబానికి చెందిన మహిళలు ఈ సొమ్ముతో అర గ్రాము లక్ష్మీ దేవి రూపు చేయిం చుకుంటున్నారు.

బులియన్‌ మార్కెట్‌కు పండుగ కళ

వరలక్ష్మీ వ్రతానికి భారీగా లక్ష్మీ ప్రతిమల అమ్మకాలు

గత ఏడాది గ్రాము రూ.6,500, నేడు రూ.10 వేలు.. చాలామంది అర గ్రాముతో సరి

నరసాపురం పట్టణంలోని ఐదో వార్డుకు చెందిన ఓ మధ్య తరగతి మహిళ ప్రతి ఏడాది వరలక్ష్మి వ్రతానికి గ్రాము బంగారంతో ప్రతిమ చేయించుకోవడం అనవాయితీ. అయితే ఈ ఏడాది ధర రెట్టింపు కావడంతో రూ.6 వేలు పెట్టి అర గ్రాము ప్రతిమనే చేయించుకుంది.

పాలకొల్లు చెందిన ఓ మహిళా ఉపాఽధ్యాయురాలు ప్రతి ఏడాది జీతంలో దాచుకున్న సొమ్ముతో పండుగకు రెండు కాసులతో ఏదో ఒక వస్తువును కొనేది. ఇందుకు రూ.లక్ష వరకు దాచుకునేది. ఈ ఏడాది దాచుకున్న సొమ్ముకు పది గ్రాముల బంగారం మాత్రమే లభించింది. దీంతో రెండు కాసులకు బదులు చిన్న వస్తువుతో సరిపెట్టుకుంది.

ఇలా పసిడి పెరగడంతో చాలా మంది వరలక్ష్మి వత్రానికి ఆర గ్రాము ప్రతిమలే కొనుగోలు చేస్తున్నారు. స్తోమత ఉన్న వారు గ్రాము, రెండు గ్రాములతో లక్షీ దేవి బొమ్మతో కూడిన రూపులను చేయించుకుంటున్నారు.

(నరసాపురం–ఆంధ్రజ్యోతి):

రెండు రోజుల క్రితం ప్రభుత్వం అన్నదాత సుఖీభవలో ప్రతి రైతు ఖాతాకు రూ.7 వేలు చొప్పున జమ చేసింది. చాలా మంది రైతు కుటుంబానికి చెందిన మహిళలు ఈ సొమ్ముతో అర గ్రాము లక్ష్మీ దేవి రూపు చేయిం చుకుంటున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల నుంచి జిల్లాలోని అన్ని జ్యువెలరీ దుకాణాల్లో పండుగ కళ సంతరించుకుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే సందడి. ధరతో నిమిత్తం లేకుండా సెంటిమెంట్‌గా అర గ్రాము ప్రతిమనైనా కొనేం దుకు వస్తున్నారు. వీటితోపాటు నల్లపూసలు, మెడలో బొందు వంటి వస్తువులను చేయించు కుంటున్నారు. మంగళవారం అయినప్పటికీ బులియన్‌ మార్కెట్‌లో సందడి కనిపించింది.

గ్రాముకు రూ.3 వేలు పెరుగుదల

గత ఏడాది గ్రాము ఆర్నమెంట్‌ బంగారం ధర రూ.6,500 పలుకగా, ఈ ఏడాది రూ.9,310 కి చేరింది. తరుగు, మేకింగ్‌ ఛార్జీలతో కలిపి గ్రాము ప్రతిమ రూ.9,600 అవుతుంది. అదే అర గ్రాముతో రూ.5 వేలు వరకు పలుకుతోంది. ఎక్కువగా అర గ్రాము ప్రతిమలే అమ్ముడువుతున్నాయి. ముందుగా మార్కెట్‌ను అంచనా వేసినా.. వ్యాపారులు వీటినే ఎక్కువ మొత్తంలో స్టాక్‌ పెట్టారు. తర్వాత గ్రాము ప్రతిమలు అమ్ముడవుతున్నాయి. గత ఏడాదితో పొలిస్తే ఆర్నమెంట్‌ వస్తువులకు పెద్దగా డిమాండ్‌ లేదని వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రెండు రోజుల్లో డిమాండ్‌ మరింత పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు.

Updated Date - Aug 06 , 2025 | 12:23 AM