చూర్ణోత్సవం.. వసంతోత్సవం
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:12 AM
చిన్న తిరుమలేశుని బ్రహ్మోత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆలయంలో గురువారం విశేషకార్యక్రమాలు జరిగాయి.
ముగిసిన చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): చిన్న తిరుమలేశుని బ్రహ్మోత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆలయంలో గురువారం విశేషకార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణములో రాజాధిరాజ వాహనంపై కొలువు తీరిన స్వామి అమ్మవార్ల ఎదుట చూర్ణోత్సవ, వసంతోత్సవాలను నిర్వహించారు. రాత్రి శ్రీవారికి ద్వాదశ కోవెల ప్రదక్షిణ, శ్రీపుష్పయాగోత్సవం వేడుకగా నిర్వహించారు.
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని ఆలయ కల్యాణ మండపంలో తిరుచ్చి వాహనంపై ఉంచి ప్రత్యేక అలంకారం చేశారు. స్వామి వారికి వసంతాలను సమర్పించారు. అర్చకులు, మహిళలు శ్రీవారిని కీర్తిస్తూ వడ్లను దంచారు. భక్తులపై వేడుకగా వసంతాలను చల్లారు.
ఆలయ ప్రాంగణంలో ఉభయ దేవేరులతో శ్రీనివాసమూర్తికి 12 ప్రదక్షిణలు, 12 సేవా కాలాలు, 12 రకాల పిండి వంటలతో నివేదన రాత్రి కన్నుల పండువగా జరిగింది. ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో సేవాకాలాన్ని ఒక్కో పిండి వంటను ఆరగింపు చేశారు. అనంతరం పవళింపుసేవా మందిరాన్ని పుష్పమాలికలతో అలంకరించారు. ఆ తర్వాత శ్రీపుష్పయాగోత్సవ వేడుకను అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు.