కల్యాణం.. కమనీయం
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:08 AM
చిన్న తిరుమ లేశుని కల్యాణవైభోగాన్ని వీక్షించే... ఆ కనులదే ఎంతో భాగ్యం.. ఈ వేడుక కమనీయం.. రమణీయం.
వైభవంగా చిన వెంకన్న కల్యాణం
ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే
శేషాచలంపై బ్రహ్మోత్సవ శోభ
ద్వారకాతిరుమల, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): చిన్న తిరుమ లేశుని కల్యాణవైభోగాన్ని వీక్షించే... ఆ కనులదే ఎంతో భాగ్యం.. ఈ వేడుక కమనీయం.. రమణీయం. సిగ్గులొలుకుతున్న అలివేలు మంగ, ఆండాళ్ అమ్మవార్లను సర్వాభరణ భూషితుడై తేజోవిరాజి తుడైన శ్రీవారు.. శుభముహూర్త సమయాన పరిణయమాడారు. కల్యాణ ఘడియలో స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని వీక్షిం చిన భక్తులు తరించారు. దేవదేవుని కల్యాణ ఘట్టం ఆవిష్కృ తమైన వేళ భక్తజనుల మది ఆనంద పారవశ్యంతో నిండింది. భక్తులు గోవిందా.. గోవిందా.. అంటూ తన్మయత్వంలో మునిగారు. ఈ అద్భుత దృశ్యం ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల వాసుని ఆలయంలో సోమవారం రాత్రి ఆవిష్కృతమైంది.
వేర్వేరు తొళక్క వాహనాలపై శ్రీవారు, అమ్మవార్లను ఉంచి అలంకరించారు. ఆలయ తూర్పుగోపుర సమీపంలో వేదిక దగ్గరకు తెచ్చారు. వేదికను పచ్చిపూలతో, కళాసౌందర్యాలతో అలంకరిం చారు. వేదికపై బంగారు సింహాసనంపై కల్యాణమూర్తులను ఉంచి అలంకరించి అర్చకులు కల్యాణతంతును ప్రారంభించారు.
పాంచాహ్నిక దీక్షతో వైఖానస ఆగమాన్ని అనుసరించి జరిగిన ఈ కల్యాణతంతులో భాగంగా ఆలయ అర్చకులు ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచన, రక్షాబంధన ఆరాధన చేశారు. స్వామి, అమ్మవార్లకు సమర్పించారు. రాష్ట్రప్రభుత్వం తరపున ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు అందించారు. ఆలయ చైర్మన్ రాజా ఎస్‌వి సుధాకరరావు, ఈవో ఎన్వీ సత్యనారాయణమూర్తి దేవస్ధానం తరపున కల్యాణమూర్తు లకు పట్టువస్త్రాలను అందజేశారు. అర్చకులు కల్యాణమూర్తులకు మధుపర్కాలను సమర్పించారు. సుముహూర్త సమయంలో జీలకర్ర, బెల్లం ధరింపచేసి భక్తుల గోవిందనామ స్మరణల నడుమ మాంగల్యధారణ, తలంబ్రాలు వైభవోపేతంగా జరిపించారు.
జగన్మోహినిగా.. శ్రీవారు
మోహినీ అలంకారంలో శ్రీవారు సోమవారం ఉదయం భక్తజనులకు దర్శనమిచ్చారు. చిన వెంకన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముగ్ధ మనోహర రూపలావణ్యాలతో జగన్మోహినిగా భక్తులను కటాక్షించారు. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతాన్ని దేవ, దానవులకు పంచేందుకు గాను శ్రీమహావిష్ణువు స్త్రీ రూపంలోకి మారారు. ఈ అలంకరణను అధిక సంఖ్యలో భక్తులు దర్శించి తరించారు.
సింహ వాహనంపై రాజసం
సింహవాహనంపై అలివేలు మంగ, ఆండాళ్ అమ్మవార్ల సమేతంగా కొలువైన దేవదేవుడు సోమవారం క్షేత్ర తిరు వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అభయహస్తాన్ని ఇస్తున్న శ్రీవారికి నీరాజనాలు సమర్పించారు. స్వామి, అమ్మవార్లను భక్తులు కొలిచారు. దుష్టజన సంహారానికి, భక్తజన సంరక్షణకు సంకేతంగా స్వామి సింహవాహనంపై ఊరేగారు.