Share News

నేడు శ్రీనివాసుడి కల్యాణం

ABN , Publish Date - Oct 06 , 2025 | 12:12 AM

ద్వారకాతిరుమలేశుని దివ్య కల్యాణ మహోత్సవానికి దేవస్థానం సర్వం సిద్ధం చేసింది.

నేడు శ్రీనివాసుడి కల్యాణం
ఎదుర్కోలు ఉత్సవంలో స్వామి, అమ్మవార్లకు హారతులిస్తున్న అర్చకులు

కల్యాణ వేదిక.. వెండి గరుడ వాహనం సిద్ధం

నేత్రపర్వంగా శ్రీవారి ఎదుర్కోలు ఉత్సవం

ద్వారకాతిరుమల, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ద్వారకాతిరుమలేశుని దివ్య కల్యాణ మహోత్సవానికి దేవస్థానం సర్వం సిద్ధం చేసింది. సోమవారం రాత్రి చిన వెంకన్న కల్యాణం అంగరంగ వైభవంగా జరిపేందుకు అనివేటి మండపంలో కల్యాణమండపాన్ని ముస్తాబు చేశారు. మండప పరిసరాలను శోభాయమానంగా తీర్చిదిద్దారు. పూల అలంకరణ సోమవా రం సాయంత్రానికి పూర్తవుతాయని ఆలయ ఈవో ఎన్వీ సత్యనారాయణ మూర్తి తెలిపారు. శ్రీహరి కళాతోరణ వేదికపై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కల్యాణవేడుక అనంతరం స్వామివారి తిరువీధి సేవకు వెండి గరుడ వాహనాన్ని సిద్ధం చేశారు.

కన్నుల పండువగా ఎదుర్కోలు మహోత్సవం

బ్రహ్మాండ నాయకుడైన ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఎదుర్కోలు ఉత్సవంగా వైభంగా సాగింది. స్వామివారి నిత్య కల్యాణ మండపంలో ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగిన ఉత్సవం చూపరులకు నేత్రపర్వమైంది. వివాహం జరిగే ముందు రోజు వధూవరుల తరపు బంధువులు శుభలేఖను పఠించేందుకు జరిపే కార్యక్రమమే ఎదుర్కోలుగా పండితులు చెబుతున్నారు. ఆలయ ఆవరణ లో వెండి శేషవాహనంపై ఉభయ దేవేరులతో స్వామిని ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. నిత్యకల్యాణ వేదికపై ఉంచి అర్చకులు ఎదుర్కోలు ఉత్సవాన్ని ప్రారంభించారు. మండప ఆవరణలో అర్చకులు, అధికారులు, పండితులు, భక్తులు రెండు జట్లుగా విడిపోయి ఒక జట్టు స్వామివారి గుణగణాలను, ఆయన విశిష్టతను కొనియాడారు. రెండో జట్టు అమ్మవార్ల గుణగణాలను, వారి కీర్తిని తెలియజేశారు. రాత్రి వెండిశేష వాహనంపై జరిగిన తిరువీఽధి సేవ భక్తజనులను ఆకర్షించింది.

గోవిందా.. గోవిందా..

చిన వెంకన్న దివ్య బ్రహ్మోత్సవాలలో వేద మంత్రోచ్ఛరణతో శేషాచల పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించు కున్నాయి. శ్రీవారు బంగారు హనుమద్వాహనంపై ఆదివారం ఉదయం తిరువీధుల్లో ఊరేగారు. ధనుర్భా ణాలు ధరించి రామావతారంలో కొలువుతీరిన శ్రీవారు బంగారు హనుమంత వాహనంపై భక్త జనరంజకం గా తిరువీధుల్లో ఊరేగారు. శ్రీవారి హనుమద్వాహన సేవ నాటి రామరాజ్య వైభవాన్ని పురవీధుల్లో సాక్షాత్కరింప చేసింది.

భక్తులతో కిటకిటలాడిన ఆలయం

భక్తుల రద్దీతో చిన వెంకన్న క్షేత్రం ఆదివారం కిట కిటలాడింది. దసరా సెలవులు ముగుస్తుండడంతో వివిధ ప్రాంతాల వారు శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఉదయం నుంచి భక్తుల రాకతో అన్ని విభాగాలు రద్దీగా కనిపించాయి. వేలాది మంది యాత్రికులు, భవానీ దీక్షాధారులు క్షేత్రానికి చేరుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. దాదాపు 15 వేల మంది పైబడి భక్తులు ఆలయానికి వచ్చినట్లు అధికారుల అంచనా. శ్రీవారి దర్శనానికి గంటల తరబడి సమయం పట్టింది.

Updated Date - Oct 06 , 2025 | 12:12 AM