Share News

క్రమబద్దకం..!

ABN , Publish Date - Dec 09 , 2025 | 12:35 AM

జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలను ఉల్లఘించి 435 భవనాలను నిర్మించారు. వీరిలో ఒకరు కూడా బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీం(బీపీఎస్‌)కు దరఖాస్తు చేయకపోవడం గమనార్హం.

 క్రమబద్దకం..!

జంగారెడ్డిగూడెంలో నిబంధనలు మీరి 435 భవనాలు నిర్మాణం

ఒక్కరూ కదల్లేదు.. బీపీఎస్‌కు దరఖాస్తు చేయలేదు

వచ్చే ఏడాది మార్చి 11 వరకు గడువు

ఆపై నిబంధనల మేరకు భవనాలు కూల్చివేత

కొన్నేళ్ల క్రితం జంగారెడ్డిగూడెంలో నిబంధనల ఉల్లంఘించి పెద్ద షాపింగ్‌ మాల్‌ నిర్మించారు. ఆ సమ యంలో ఇక్కడ పనిచేసిన ఓ మున్సిపల్‌ అధికారికి భారీగా నగదు చేతులు మారి నట్లు సమాచారం. అంత నగదు చేతులు మారినప్పటికి కోర్టులో రూ.30 లక్షల ఫైన్‌ చెల్లించాలని కేసు నమోదు చేయడం విశేషం.

జంగారెడ్డిగూడెం, డిసెంబరు 8 (ఆంధ్ర జ్యోతి):జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలను ఉల్లఘించి 435 భవనాలను నిర్మించారు. వీరిలో ఒకరు కూడా బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీం(బీపీఎస్‌)కు దరఖాస్తు చేయకపోవడం గమనార్హం. 1985 జనవరి నుంచి 2020 ఆగస్టు 31వ తేదీ వరకు నిబంధ నలను మీరి నిర్మించిన ఇళ్లు, బహుళ అంత స్తుల భవనాలను బీపీఎస్‌లో ప్రభుత్వానికి తగిన రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకో వచ్చని ఈ ఏడాది నవంబరు 20న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దరఖాస్తులకు 120 రోజు లు (2026 మార్చి 11 వరకు) గడువు విధిం చింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని మునిసి పాలిటీల్లోను బీపీఎస్‌కు దరఖాస్తులు వస్తున్నాయి. కాని, జంగారెడ్డిగూడెంలో మాత్రం భవన యజమానులు ఆసక్తి చూపడం లేదు.

పట్టించుకోని టౌన్‌ ప్లానింగ్‌

పట్టణంలో భవన నిర్మాణాలకు మున్సి పాలిటీ అనుమతి ఇచ్చినప్పటి నుంచి భవన నిర్మాణం పూర్తయ్యే వరకు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు నిరంతరం తనిఖీలు చేయాలి. కాని, ఇక్కడ వారి పర్యవేక్షణ లేకపోవడంతో నిబంధనలను మీరి భవనాలను నిర్మించారు. దీని వెనుక చాలా కథలే నడిచాయి. ఇక్కడ పనిచేసిన మున్సిపల్‌ కమిషనర్లు, టౌన్‌ ప్లానిం గ్‌ అధికారులు బీపీఎస్‌పై దృష్టి పెట్టకుండా వారి సొంత లాభం కోసమే పనిచేశారు. తెలిసో తెలియక నిబంధనలు మీరి భవనాలు నిర్మించిన యజమానులను అనుభవం లేని బిల్డింగ్‌ ప్లాన్‌లు ఇచ్చే ఇంజనీర్లు కొంత మోసం చేశారు. రూ.లక్షల్లో ఫైన్‌లు వేస్తామని చెబుతూనే వారిని కాపాడినట్లు నటించి లక్షల రూపాయలు కాజేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. లక్షలు పోగొట్టుకున్నా భవన యజమానులపై నేటికీ కోర్టులో కేసులు మామూలే. భవన యజమానుల వద్ద ఎంతో కొంత నగదు తీసుకున్న తర్వాత ఆ అధికారులు ఉన్నంత కాలం ఎలాంటి ఇబ్బందులు రాలేదు. వారు బదిలీపై వేరే చోటికి వెళితే.. కొత్తగా వచ్చిన అధికారులతో భవన యజమానులకు మళ్లీ షరా ‘మామూలే’!.

ఇప్పటికైనా ప్రజలు నిబంధనలు మీరి ఇళ్ళు, భవనాలు నిర్మించిన వారంతా గడువులోగా బీపీఎస్‌కు దరఖాస్తు చేసుకును క్రమబద్దీకరిం చుకోవడం మేలు. లేకుంటే అధికారులు మారి నప్పుడల్లా ఇబ్బందులు తప్పవు. ఒకవేళ దర ఖాస్తు చేయని భవనాలను ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కూల్చి వేసే ప్రమాదం వుంది.

బీపీఎస్‌ వల్ల ప్రయోజనాలు

అనధికార నిర్మాణాలు చట్టబద్ధమవుతాయి

విద్యుత్‌, మంచినీటి కనెక్షన్‌, వ్యాపార లైసెన్సులు పొందడంలో సౌలభ్యం

ఆస్తి విక్రయం, బ్యాంకు రుణాలకు పూర్తి చట్టబద్ధత కలుగుతుంది.

ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ లభ్యమవుతుంది.

స్థానిక సంస్థల అభివృద్ధి నిధులు పెరగడంతో పట్టణ అభివృద్ధి సాధ్యం

దరఖాస్తు చేయకపోతే కలిగే నష్టాలు

నిరంతర అపరాధముగా పరిగణిస్తారు.

భారీగా జరిమానాలు వేయడం, భవనాన్ని సీజ్‌ చేయడం లేదా కూల్చివేత వంటి చట్టపరమైన చర్యలుంటాయి.

బ్యాంకు రుణాలు, క్రయ విక్రయాలు సమస్యాత్మకంగా మారతాయి.

ఆ భవన యజమానికి భవిష్యత్‌లో ఎటువంటి అనుమతులు ఇవ్వరు.

బిల్డర్‌, డెవలపర్‌లను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్డడంతోపాటు కోర్టులో కేసులు వేస్తారు.

ప్రభుత్వ అనుమతులతో కూల్చివేస్తాం

నిబంధనలను పాటించకుండా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పఽథకం బీపీఎస్‌. ఈ ఏడాది నవంబరు 20 నుంచి 120 రోజుల్లోగా దరఖాస్తుకు గడువు ఇచ్చారు. ఈ సదవకాశం భవిష్యత్‌లో రాకపోవచ్చు. జంగారెడ్డిగూడెంలో నిబంధనలను మీరి నిర్మించిన 435 కట్టడాలను గుర్తించి నోటీసులు జారీ చేశాం. వీటిలో 80 మంది భవన యజమానులపై కోర్టుల్లో కేసులు నమోదు చేశాం. మరో 27 కేసులను నమోదు చేయనున్నాం. కోర్టు కేసులు ఉన్న వారు బీపీఎస్‌లో దరఖాస్తు చేసుకుని వారి భవనాలకు చట్టబద్ధత కల్పించుకోవచ్చు. లైసెన్సు కలిగిన టెక్నికల్‌ పర్సన్ల(ఇంజనీర్‌) ద్వారా మాత్రమే దరఖాస్తు ప్రొసెస్‌ చేయించాలి. 2026 మార్చి 11వ తేదీలోపు దరఖాస్తు చేయని భవనాలను ప్రభుత్వ అనుమతులతో కూల్చివేస్తాం. – కేవీ రమణ, మున్సిపల్‌ కమిషనర్‌, జంగారెడ్డిగూడెం

Updated Date - Dec 09 , 2025 | 12:35 AM