ఆక్వాకు ఆసరా
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:29 AM
ఆక్వా రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఒకవైపు వైరస్‌లు, మరోవైపు ట్రంప్ సుంకాలు వెంటాడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఆక్వా రైతులకు మరింత అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఆక్వా రైతులకు నెల గడువు
సీఎం దృష్టికి ఎల్‌పీఎం సమస్య
వెసులుబాటు ఇవ్వాలని కోరిన కలెక్టర్
జిల్లాలో 16 వేల విద్యుత్ కనెక్షన్‌లు
13 వేల కనెక్షన్‌లకు రాయితీ
రిజిస్ర్టేషన్ చేసుకుంటే నాన్ ఆక్వా జోన్‌లోనూ వర్తింపు
సచివాలయంలో కలెక్టర్‌లతో సీఎం కాన్ఫరెన్స్
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ఆక్వా రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఒకవైపు వైరస్‌లు, మరోవైపు ట్రంప్ సుంకాలు వెంటాడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఆక్వా రైతులకు మరింత అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు అందించాలన్నా, ఆక్వా ఉత్పత్తు లకు మార్కెట్ ఉండాలన్నా అప్సడాలో రిజిస్ర్టేషన్ చేసు కోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికోసం ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు నెలరోజులు గడువు ఇచ్చారు. రిజిస్ర్టేషన్ చేసుకోవాలంటే ల్యాండ్ పార్సిల్ మ్యాపింగ్ (ఎల్‌పీఎం) సమస్య వస్తోంది. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సచివాలయంలో కలెక్టర్‌లతో నిర్వహించిన సమావేశంలో ఈ విషయమై చర్చించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆక్వా చెరువుల రిజిస్ర్టేషన్‌పై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. జిల్లాలో 15 వేల ఎకరాల్లోనే రైతులు అప్సడాలో రిజిస్ర్టేషన్ చేసుకున్నారు. మరో 80 వేల ఎకరాలు రిజిస్ర్టేషన్ చేసుకోవాల్సి ఉంది. రీసర్వేలో భాగంగా ల్యాండ్ పార్సిల్ మ్యాపింగ్ పూర్తి కాకపోవడంతో రిజిస్ర్టేషన్ సమస్య ఎదురవుతోంది. దీనిపై వెసులుబాటు కల్పించాలంటూ ముఖ్యమంత్రిని కలెక్టర్ కోరారు. దీనిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. నెలరోజులు గడువు ఇచ్చారు. ఇప్పటిదాకా రిజిస్ర్టేషన్ లేకపోయినా సరే విద్యుత్ కనెక్షన్‌లకు రాయితీ ఇస్తున్నారు. ఆక్వా జోన్‌లో 10 ఎకరాల లోపు చెరువు విస్తీర్ణం ఉన్నవారికి మాత్రమే యూనిట్ విద్యుత్‌ను రూ.1.50 పైసలకు అందజేస్తున్నారు.
నాన్ ఆక్వాజోన్ రైతులకు ఊరట
రాష్ట్ర ప్రభుత్వం నాన్ ఆక్వా జోన్‌లో ఉన్న రైతులకు కూడా విద్యుత్ రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. అయితే అప్సడాలో రిజిస్ర్టేషన్ చేసుకోవడం తప్పనిసరి అని ముఖ్యమంత్రి ప్రకటించారు. జిల్లాలో ఆక్వా రంగానికి 16 వేలు విద్యుత్ కనెక్షన్‌లు ఉన్నాయి. అందులో 13 వేల కనెక్షన్‌లకు రాయితీ వర్తిస్తోంది. మిగిలిన మూడు వేల కనెక్షన్‌లకు 10 ఎకరాలకు పైగా ఉందనో నాన్ ఆక్వా జోన్ అనో రాయితీ ఇవ్వడం లేదు. తాజాగా నాన్ ఆక్వా జోన్‌లో ఉన్న చెరువులకు కూడా రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెల రోజుల వ్యవ ధిలోనే అప్సడాలో రిజిస్ర్టేషన్ చేసుకోవాలని తర్వాత రాయితీ ఉండదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు.ఎల్‌పీఎం విషయంలోనూ వెసులుబాటు ఇచ్చారు. తాజాగా మరో 3,000 మంది రైతులు కొత్త విద్యుత్ కనెక్షన్‌లకు దరఖాస్తు చేసుకు న్నారు. వారికి కూడా కనెక్షన్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.అయితే నెల రోజుల్లోనే రిజిస్ర్టేషన్ చేసుకోవాలంటూ ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. చెరువులు రిజిస్ర్టేషన్ చేసుకుంటే నాసిరకం సీడ్‌ను అరికట్టే అవకాశం ఉంటుంది. రొయ్య సాగులో యాంటీ బయోటిక్ మందుల వాడకాన్ని నివారించవచ్చు. తద్వారా ఆక్వా ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్ ఉంటుంది. ఎగుమతి దారులు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. రిజిస్ర్టేషన్ చేసుకున్న వారివే ముందుగా కొనుగోలు చేయ నున్నారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు కూడా ఇకపై రిజిస్ర్టేషన్ చేసుకున్న చెరువులకే వర్తించనుంది.