పల్లె పండుగ
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:45 AM
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలకు కళ వచ్చింది. జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనులు చేపట్టారు. జిల్లాలో దాదాపు రూ. 58 కోట్లతో సిమెంట్ రహదారులను నిర్మించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధుల విడుదల
జిల్లాలో రూ. 57 కోట్ల విలువైన పనులు
బిల్లుల కోసం కాంట్రాక్టర్ల ఎదురుచూపు
తాజా నిధులతో ఊరట లభిస్తుందని భరోసా
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలకు కళ వచ్చింది. జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనులు చేపట్టారు. జిల్లాలో దాదాపు రూ. 58 కోట్లతో సిమెంట్ రహదారులను నిర్మించారు. ప్రతి నియోజకవర్గానికి నిధులు మంజూరు కావడంతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఎమ్మెల్యేల చొరవతో కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి పనులు చేశారు. పూర్తయిన పనులకు ఇప్పటి వరకు 25 శాతం మాత్రమే బిల్లులు మంజూరయ్యాయి. మరో రూ.40 కోట్ల బకాయిలు విడుదల చేయాలి. వీటి కోసం కాంట్రాక్టర్లు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించినా పాత బకాయిల మాటేమిటని పలువురు కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
వైసీపీ ప్రభుత్వ హయాలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆ ప్రభావంతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టడానికి ముందుకు రాలేదు. వారి నుంచి స్పందన అంతంతమాత్రం కావడంతో నియోజకవర్గ ఎమ్మెల్యేలు భరోసా ఇచ్చి పనులు చేయించారు. పనులు పూర్తయ్యాక బిల్లులు విడు దల కాకపోవడంతో కొత్త పనులు చేపట్టాలంటే వెనుకడుగు వేస్తున్నారు. ఈ తరుణంలో కేంద్రం నుంచి ఉపాధి నిధులు దాదాపు రూ.789 కోట్లు మంజూరయ్యాయి. త్వరలోనే అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించనున్నారు. అధికా రులు సైతం కాంట్రాకర్లకు ఆదిశగా భరోసా కల్పిస్తున్నారు.
పాత బకాయిల ఊసేది..
గత తెలుగుదేశం ప్రభుత్వంలో జాతీయ గ్రామీణ ఉపాధి పనులు పూర్తి చేసిన వారికి వైసీపీ హయాంలో చుక్కలు చూపించారు. బిల్లులు మంజూరు చేయలేదు. నాణ్యతా ప్రమా ణాల కమిటీ పేరుతో కాలయాపన చేశారు. కమిటీ నివేదిక ఇచ్చినా సరే బిల్లులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు మెట్లు ఎక్కిన వారికి మాత్రమే వైసీపీ హయాంలో నిధులు మంజూరయ్యాయి. అది కూడా కోర్టు ధిక్కరణ కేసులు వేస్తే తప్ప ప్రభుత్వం స్పందించ లేదు. అయినా సరే 10శాతం బిల్లులను నిలిపివేసింది. నాణ్యత ప్రమాణాల కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత ఆ పది శాతం బిల్లులను మంజూరు చేస్తామని వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేసినా బిల్లులు మంజూరు చేయలేదు. జిల్లాలో ఇలా దాదాపు రూ.30 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బకాయిల కోసం ఎదురుచూసిన కాంట్రాక్టర్లు ఊపిరి పీల్చు కున్నారు. అప్పట్లో పార్టీ సానుభూతిపరులు, నాయకులే పను లు నిర్వహించారు., వారంతా గత ఐదేళ్లు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. కోర్టుల చుట్టూ తిరిగారు. తీరా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఊరట లభించ లేదు. ఇటీవల నీరు–చెట్టు బకాయిలను చెల్లించగా జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. దానికోసం ఇప్పుడు అంతా ఎదురుచూస్తున్నారు. ఇటీవల పను లు చేపట్టిన కాంట్రాక్టర్లు సైతం బిల్లుల కోసం తిరుగుతున్నారు. తాజాగా నిధులు విడుదల కావడంతో బకాయిలు విడుదల కానున్నాయన్న భరోసా లభించింది.