ఆస్పత్రికి సుస్తీ
ABN , Publish Date - Dec 06 , 2025 | 11:59 PM
జిల్లాకేంద్రం భీమవరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలందిస్తున్నా వసతులు అధ్వానం.
భీమవరం ప్రభుత్వాసుపత్రి దుస్థితి
మెరుగైన వైద్య సేవలు
వసతులు మాత్రం అధ్వానం
50 పడకలకే పరిమితం
పూర్తికాని భవన నిర్మాణం
రోగులకు తప్పని తిప్పలు
జిల్లాకేంద్రం భీమవరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలందిస్తున్నా వసతులు అధ్వానం. జిల్లా ఆసుపత్రి, వంద పడకల స్థాయికి చేరాల్సిన ఆసుపత్రి అధికారులు, నాయకులు, అధికారుల నిర్లక్ష్యంతో 50 పడకలకే పరిమితమైంది. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే ఆసుపత్రి నిర్మాణానికి కొంత భూమిని ఇచ్చినప్పటికీ నాలుగేళ్లుగా భవన నిర్మాణం నత్తనడకన సాగుతోంది.
భీమవరం క్రైం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): భీమవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి రోజుకు సుమారు 500 మంది అవుట్ పేషెంట్లు వస్తారు. ఆసుపత్రిలో రోజుకు 4 నుంచి 5 వరకు ప్రసవాలు జరుగుతాయి. భీమవరం చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు కాళ్ల, ఆకివీడు, ఉండి, పాలకోడేరు, వీరవాసరం, మొగల్తూరు మండలాలు, కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను మండలం నుంచి రోగులు వైద్యం కోసం వస్తుంటారు. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, హత్యలు, ఆత్మహత్యలు జరిగితే మృతదేహాలను భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలిస్తారు. జిల్లా ఆసుపత్రిగా తీర్చిదిద్దవలసిన ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో రోగులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.6.5 కోట్లతో కొత్త భవనం
గతంలో టీడీపీ ప్రభుత్వంలో అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాత ప్రభుత్వ ఆసుపత్రి పక్కన కొత్త భవనానికి నిధులను మంజూరు చేశారు. సుమారు రూ.6.50 కోట్లతో కొత్త భవనం నిర్మించడంతో కొన్ని వైద్య విభాగాలు అందులోకి మార్చారు. దీనితో చాలా వరకు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. 50 పడకల ఆసుపత్రి కావడంతో వసతులు మాత్రం అరకొరగా ఉన్నాయని అంటున్నారు.
మరిన్ని వసతులు
నూతన భవన నిర్మాణం పూర్తయితే మరిన్ని వసతులు అందుబాటులోకి రానున్నాయి. ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. కొత్త భవనంలో పూర్తిస్థాయిలో డయాలసిస్ కేంద్రం అందుబాటులోకి రానుంది. చాలామంది కిడ్నీ బాధితులకు ఊరటనిచ్చినట్లు అవుతుంది. వేల రూపాయలు వెచ్చించి ప్రైవేట్ ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయించుకునే బాధితులకు ఇబ్బందులు తొలగుతాయి. ఆకివీడులో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చొరవతో కిడ్నీ డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో చాలామంది అక్కడికి వెళుతున్నారు. ఇక్కడ కూడా ఏర్పాటుచేస్తే అవస్థలు తప్పుతాయి.
కొత్త భవనానికి రూ.25 కోట్లు
భీమవరం – గొల్లవానితిప్ప రోడ్డులో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సహకారంతో కొంత భూమిని ప్రభుత్వానికి అందజేశారు. ఆ స్థలంలో ఆసుపత్రి భవన నిర్మాణానికి నాబార్డ్ నిధుల్లో ముందుగా సుమారు రూ.25 కోట్లు వరకు మం జూరైంది. నాలుగేళ్ల క్రితం చేపట్టిన పనులు నత్త నడకన కొనసాగుతున్నాయి. భవన నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందోనని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పట్టణానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నా వంద పడకల ఆసు పత్రి పూర్తయితే మరింత మెరుగైన వైద్యం అం దుతుందని రోగులు, బంధువులు భావిస్తున్నారు.
త్వరలోనే నూతన భవనం పూర్తి
గొల్లవానితిప్ప రోడ్డులో కొత్త ఆసుపత్రి భవన నిర్మాణం త్వరలోనే పూర్తయ్యే అవకాశాలున్నాయని భీమవరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మణ్ జితానంద్ తెలిపారు. ఇటీవల సంబంధిత ఇంజనీర్‌తో ఎమ్మెల్యే మాట్లాడా రని, త్వరలోనే పూర్తవుతుందని కాంట్రాక్టర్ చెప్పారన్నారు. కొత్త భవనంలో వంద పడకలు అందుబాటులోకి వస్తాయని, చాలామంది రోగులకు వైద్యం సకాలంలో అందుతుందని తెలిపారు.
– లక్ష్మణ్ జితానంద్, ఆసుపత్రి సూపరింటెండెంట్