Share News

మార్టేరు శాస్త్రవేత్త సునీతకు ఉత్తమ అవార్డు

ABN , Publish Date - Jul 26 , 2025 | 12:25 AM

మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ వరి పరిశోధనా స్థానంలో బ్రీడర్‌ సైన్స్‌ విభాగం శాస్త్రవేత్త వై.సునీత ఉత్తమ అవార్డు అందుకున్నారు.

మార్టేరు శాస్త్రవేత్త సునీతకు ఉత్తమ అవార్డు
గవర్నర్‌ నజీర్‌ నుంచి అవార్డు అందుకుంటున్న శాస్త్రవేత్త సునీత

ఎన్జీ రంగా వర్సిటీ స్నాతకోత్సవంలో ప్రదానం చేసిన గవర్నర్‌

పెనుమంట్ర, జూలై 25 (ఆంధ్రజ్యోతి): మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ వరి పరిశోధనా స్థానంలో బ్రీడర్‌ సైన్స్‌ విభాగం శాస్త్రవేత్త వై.సునీత ఉత్తమ అవార్డు అందుకున్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూర్‌ స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ఆడిటోరియంలో ఈ నెల 24న జరిగిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 57వ స్నాతకోత్సవంలో గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ నుంచి డాక్టర్‌ వై.సునీత అవార్డు అందుకున్నారు. 2011 నుంచి నూతన వరి వంగడాల రూపొందించడంలో విశిష్ట సేవలకు గాను మెరిటోరియస్‌ రీసెర్చ్‌ సైంటిస్ట్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఆమె మార్టేరు (18 రకాలు), బాపట్ల (5 రకాలు) వరి పరిశోధనా స్థానాల నుంచి మొత్తం 23 వరి రకాల అభివృద్ధి, విడుదలలో భాగస్వామి. అదనంగా 1 జన్యు స్టాక్‌ అభివృద్ధి చేశారు. జాతీయ, అంతర్జాతీయ ప్రఖ్యాత జర్నల్స్‌లో 99 పరిశోధనా వ్యాసాలు ప్రచురించారు. 15 మంది పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు మార్గనిర్దేశనం చేశారు. 7 పరిశోధనా సంస్థలలో జీవిత కాల సభ్యురాలిగా కొనసాగుతున్నారు. సునీత ప్రస్తుతం మధ్య కాల వ్యవధి కలిగిన వరి రకాల అభివృద్ధిలో పరిశోధనలు చేస్తున్నారు. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఐఆర్‌ఆర్‌ఐ), డీబీటీ (బయోటెక్నాలజీ విభాగం) సహకారంతో అనేక ప్రాజెక్టులు చేస్తున్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్‌ టి.శ్రీనివాస్‌, ఇతర శాస్త్రవేత్తలు, సిబ్బంది సునీతకు అభినందనలు తెలిపారు. ఏడీఆర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ శాస్త్రవేత్తలు, సిబ్బంది మరింత కృషి చేసి మార్టేరు వరి పరిశోధనా సంస్థను ఉన్నత స్థాయిలో నిలపాలన్నారు.

Updated Date - Jul 26 , 2025 | 12:25 AM