Share News

వ్రసతి గృహాల్లో ఇష్టారాజ్యం చెల్లదు

ABN , Publish Date - Aug 06 , 2025 | 12:36 AM

బీసీ సంక్షేమ వసతి గృహాల నిర్వహణలో సమూల మార్పు లకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

వ్రసతి గృహాల్లో ఇష్టారాజ్యం చెల్లదు

నిరంతరం అధికారుల తనిఖీ

రెండు పూటలా విద్యార్థుల ముఖ హాజరు

నిత్యం యోగా.. మెనూపై పర్యవేక్షణ

నేటి నుంచి కొత్త విద్యార్థులకు ఫ్రెషర్స్‌ డే

బీసీ సంక్షేమ వసతి గృహాల నిర్వహణలో సమూల మార్పు లకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జూలై 1 నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థుల ముఖ ఆధారిత హాజరు (ఫేస్‌ రికగ్నిషన్‌) తప్పనిసరి చేశారు. విద్యార్థుల హాజరు ప్రకారం మెనూ తయారీతో ఇష్టారాజ్యంగా వండి వార్చడం, సరకులను దోచుకోవడానికి కుదరదు. ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్‌, భోజనం, రాత్రి అందించే పండ్ల వరకు ఫోటో తీసి బీసీ వెల్ఫేర్‌ జిల్లా అధికారికి పంపుతున్నారు.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

వసతి గృహాల్లో అధికారుల నిరంతర తనిఖీలతో ఉద్యోగులు, సిబ్బంది పనితీరు మెరుగైంది. జిల్లాలో 33 బీసీ వసతి గృహాలుండగా, 1వ తరగతి నుంచి పీజీ వరకు మొత్తం 2280 మంది విద్యార్థులు బస చేస్తున్నారు. కొన్ని చోట్ల నూతన వాష్‌రూమ్స్‌ నిర్మాణం, ఇతర మరమ్మతులు పూర్తి చేసి రంగులతో తీర్చిదిద్దారు.

మంత్రులు, అధికారుల ఆరా..

వసతి గృహాల పర్యవేక్షణ సక్రమంగా ఉందా? లేదా, మెనూ ప్రకారం వడ్డన జరుగుతుందా, ఇతర వసతులపై అధికారులు తరచు తనిఖీ చేస్తున్నారు. బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత, ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ మాదిరెడ్డి ప్రతాప్‌, బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌రాజు ఇటీవల పలు వసతి గృహాలు తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతీ నెల జిల్లా బీసీ సంక్షేమాధికారి ఆర్‌వీ నాగరాణి ప్రతీ వసతిగృహం తనిఖీ చేస్తున్నారు. ఇద్దరు అసిస్టెంట్‌ వెల్ఫేర్‌ అధికారులు కూడా తనిఖీ చేస్తున్నారు మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు కూడా తమ పరిధిలోని హాస్టల్స్‌ పరిస్థితులను పరిశీలించి కలెక్టర్‌కు నివేదికలు ఇస్తున్నారు. ప్రతీ ఏటా వసతి గృహాల నిర్వహణకు రూ.80 కోట్లు వెచ్చిస్తున్నట్లు అధికారులు, ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు.

కొత్త విద్యార్థులకు ఫ్రెషర్స్‌ డే..

వసతి గృహాల్లో కొత్తగా చేరిన విద్యార్థులు ఇతరులతో కలిసి ఉండడంపై అవగాహనకు ఈ నెల 6 నుంచి 9 వరకు ఫ్రెషర్స్‌ డే నిర్వహించనున్నారు. ఈ మేరకు వసతి గృహాల్లో అధికారు లు ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల ఆరోగ్యం మెరుగుదలకు ఉదయం యోగా చేయిస్తున్నారు. స్కూల్‌ నుంచి నేరుగా హాస్టల్‌కు చేరే విషయంలో సిబ్బంది దగ్గరుండి ఒక క్యూ పద్దతిలో సురక్షితంగా తమ ప్రాంగణాలకు చేరుకుంటున్నారు.

సేవలు పారదర్శకం

జిల్లాలో 33 వసతి గృహాలు పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. రెండు పూటలా వారికి అందించే టిఫిన్‌, భోజనం, ఇతర స్నాక్స్‌ వార్డెన్‌లు తనకు తప్పనిసరిగా ఫోటోలు రూపంలో వివరాలను సమర్పిస్తారు. హాస్టల్స్‌లో కొన్ని సౌకర్యాలు కల్పించడానికి దాతలు ముందుకు రావాలి. అందుబాటులో ఉన్న నిధులతో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు సమాకూరుస్తున్నాం.

ఆర్‌వీ.నాగరాణి, బీసీ వెల్ఫేర్‌ అధికారి

Updated Date - Aug 06 , 2025 | 12:36 AM