రుణాలు ఇవ్వండి!
ABN , Publish Date - Aug 01 , 2025 | 12:43 AM
స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న రుణ ప్రణాళికపై బ్యాంకులు మొండిచేయి చూపుతున్నాయి.
మహిళా సంఘాలకు బ్యాంకుల మొండిచేయి
క్రెడిట్ ప్లాన్‌కు గండి
గ్రూపు మొత్తానికి ఇస్తామంటూ మెలిక
అందరికీ సమానంగా ఇవ్వడానికి మొగ్గు
ఈ ఏడాది ప్రణాళిక మార్చిన ప్రభుత్వం
కావాలనుకున్న వారికే రుణం
సర్వే చేసిన అధికారులు
బ్యాంకులకు అందిన వివరాలు
అయినా రుణాలు ఇవ్వకుండా తాత్సారం
స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న రుణ ప్రణాళికపై బ్యాంకులు మొండిచేయి చూపుతున్నాయి. రుణాల మంజూరులో అలసత్వం వహిస్తున్నాయి. ప్రభుత్వం కోరినవిధంగా రుణాలు ఇవ్వడానికి ససేమిరా అంటున్నాయి. గతంలో మాదిరిగానే సంఘం మొత్తానికి రుణం ఇవ్వడానికే ఆసక్తి చూపుతున్నాయి. ఫలితంగా రుణాలు మంజూరు నత్తనడకగా సాగుతోంది.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు ఇప్పటి వరకు కేవలం రూ.144.85 కోట్లు రుణం మాత్రమే బ్యాం కులు మంజూరు చేశాయి. వాస్తవానికి జిల్లాలో సర్వే పూర్తిచేసిన స్వయం సహాయక సంఘాలకు రూ.978 కోట్లు అవసరం కానుందని ప్రభుత్వం గుర్తించింది. సంఘాల వివరాలను జిల్లా అధికారులు బ్యాంకులకు సమర్పించారు. అయినా రుణాల మంజూరులో తాత్సా రం చేస్తున్నాయి. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలోని స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది కొత్త తరహా లో రుణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఒక గ్రూపులో పది మంది సభ్యులుంటున్నారు. గ్రూపులో రుణం అవసరం లేని వారికి ఇవ్వడం లేదు. మరోవైపు రూ.20వేలు కావలన్న మహిళలు ఒక గ్రూపులో ఉంటున్నారు. అదే విధంగా రూ.2 లక్షలు మంజూరు చేయాలని కోరిన సభ్యులు అదే గ్రూపులో ఉండడం గమనార్హం. క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించి అన్ని గ్రూపుల మహిళల రుణ అవసరాన్ని గుర్తించారు. ఈ ఏడాదికి రుణం వద్దనుకుంటే ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయలేదు. కానీ సభ్యులంతా అదే గ్రూపులో ఉంటారు. ఈ విధానం పై మహిళలు ఆసక్తి చూపించారు. కానీ రుణాలు ఇవ్వ డానికి బ్యాంకులే మొండికేస్తున్నాయి. గతంలో మాదిరి గ్రూపు మొత్తానికి రుణం ఇచ్చామంటూ చెప్పుకొస్తు న్నాయి. అందరికీ సమానంగా రుణం పంచుకునేలా మంజూరు చేస్తామంటూ మెలిక పెడుతున్నాయి. అదే ఇప్పుడు రుణాల మంజూరులో జాప్యం జరుగుతోంది.
లెక్కకు మిక్కిలి రుణం
ఎన్నికల ముందు జిల్లాలో బ్యాంకులు ఇష్టాను సారంగా రుణాలు మంజూరు చేశాయి. రూ.3 వేల కోట్లు వరకు మహిళలు రుణాలు పొందారు. వాటిని తీర్చడానికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దాంతో కొత్త రుణాల కోసం అంతగా ఆసక్తి చూపడం లేదు. చిరువ్యాపారాలు, చేతివృత్తులు, ఇతర వ్యాపకాలు పెట్టుకున్న మహిళలు ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవడానికి అధిక మొత్తంలో రుణాలు తీసుకోవడానికి ముందుకొస్తున్నారు. లేదంటే తక్కువ మొత్తం రుణంతో సరిపెడుతున్నారు. ఫలితంగా ఈ ఏడాది గుర్తించిన మేరకు రూ.978 కోట్లు మాత్రమే అవసరం కానుందని అంచనా వేశారు. జిల్లాలో 27,910 క్రియాశీల గ్రూపులున్నాయి. అందులో 26,471 గ్రూపులకు రుణాలు అవసరమని గుర్తించారు. బ్యాంకులకు వివరాలు సమర్పిస్తున్నారు. కానీ రుణాలు మంజూరులోనే బ్యాంకులు జాప్యం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. జిల్లా కలెక్టర్ ఈ విషయమై బ్యాంకు అధికారులతో సమావేశమయ్యారు. రుణాలు ఇవ్వాల్సిందేనని ఆదేశించారు.