Share News

అయ్యో.. నన్నయా..!

ABN , Publish Date - Aug 05 , 2025 | 12:45 AM

ఆదికవి నన్నయ యూనివర్సిటీ తాడేపల్లిగూడెం క్యాంపస్‌లో బీ ఫార్మసీ చేసిన విద్యార్థుల సర్టిఫికెట్లు చెల్లవని తేలడంతో తెల్లబోయారు.

అయ్యో.. నన్నయా..!

యూనివర్సిటీ క్యాంపస్‌లో చదివితే.. సర్టిఫికెట్‌ చెల్లదా..?

2019–22 మధ్య బీ ఫార్మసీ విద్యార్థులకు షాక్‌

కోర్సుకు ఫార్మసీ కౌన్సిల్‌ అనుమతి లేదు

చదువు పూర్తి చేసినా ఉపాధి లేదు

ఉన్నత విద్యావకాశాలు లేవు

విద్యార్థులు, తల్లిదండ్రుల గగ్గోలు

ఆదికవి నన్నయ యూనివర్సిటీ తాడేపల్లిగూడెం క్యాంపస్‌లో బీ ఫార్మసీ చేసిన విద్యార్థుల సర్టిఫికెట్లు చెల్లవని తేలడంతో తెల్లబోయారు. నాలుగేళ్లపాటు చదివిన చదువు నిరర్ధకమని వారంతా గగ్గోలు పెడుతున్నారు. అనుమతి లేకుండా ప్రభుత్వ యూనివర్సిటీ కోర్సులో ఎలా ప్రవేశం కల్పించారని విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీస్తున్నారు.

తాడేపల్లిగూడెం రూరల్‌, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ఆ విద్యార్థులంతా ఎన్నొ ఆశలతో ఆదికవి నన్నయ యూనివర్సిటీ తాడేపల్లిగూడెం క్యాంపస్‌లో ఫార్మసీ కోర్సు డిగ్రీ చేశారు. మంచి మార్కులతో ఉత్తీర్ణులైనా సర్టిఫికెట్స్‌ చెల్లవని తేలడంతో విద్యార్థులు హతాశుల య్యారు. క్యాంపస్‌లో ఫార్మసీ కోర్స్‌కు ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి అనుమతి పొందలేదు. దీనితో సర్టిఫికెట్‌ చిత్తు కాగితంగా మిగిలింది. చదివు పూర్తిచేసి రెండేళ్లయినా ఆ సర్టిఫికట్‌తో ఏ ప్రభుత్వ సంస్థలో చేరాలన్న, మందుల దుకాణం పెట్టుకోవాలన్న ఉప యోగం లేకుండా పోయింది. నాలుగేళ్ల పాటు ఉప యోగం లేని చదువు చదివామని ఆవేదన చెందుతున్నారు. 2019 నుంచి వరుసగా 4 సంవత్సరాలు పాస్‌అవుట్‌ అయి బయటకు వచ్చిన విద్యార్థులు ఈ దయనీయ స్థితిలో ఉన్నారు.

120 మంది భవిష్యత్‌ ప్రశ్నార్ధకం

నన్నయ్య విశ్వవిద్యాలయంలో 2019 నుంచి 2022 మధ్య బీ ఫార్మసీ పూర్తిచేసి బయటకు వచ్చిన 120 మంది విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి ఆ సర్టిఫికెట్‌లు అనుమతి కోసం పడిగాపులు తప్పడంలేదు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

పీసీఐ అనుమతి కోసం చూస్తున్నాం

ఫార్మసి కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి అనుమతి కోసం లేఖ రాశాం. 2023 నుంచి అనుమతి లభించినా గతంలో పాస్‌ అవుట్‌ అయిన విద్యార్థులకు ఇంకా అనుమతి లభించలేదు. పీసీఐ నుంచి ఈ సమస్య పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాం.

టి.అశోక్‌కుమార్‌, ప్రిన్సిపాల్‌, నన్నయ క్యాంపస్‌

Updated Date - Aug 05 , 2025 | 12:45 AM