Share News

సైబర్‌ నేరగాళ్లతో జాగ్రత్త

ABN , Publish Date - Jun 26 , 2025 | 12:51 AM

సైబర్‌ నేరగాళ్లు సెల్‌ఫోన్ల ద్వారా మాయ మాటలతో మోసగిస్తారని, విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ ఎన్‌.సూర్యచంద్రరావు హెచ్చరించారు.

సైబర్‌ నేరగాళ్లతో జాగ్రత్త
శక్తి యాప్‌ పోస్టర్‌ ప్రదర్శిస్తున్న ఏఎస్పీ, ప్రిన్సిపాల్‌, డీఎస్పీ, తదితరులు

ఏలూరు అర్బన్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరగాళ్లు సెల్‌ఫోన్ల ద్వారా మాయ మాటలతో మోసగిస్తారని, విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ ఎన్‌.సూర్యచంద్రరావు హెచ్చరించారు. సెయింట్‌ థెరిస్సా మహిళా కళాశాలలో శక్తి యాప్‌, సైబర్‌ నేరాలు, మహిళలపై నేరాలు, చట్టపరిధిలో భద్రత, తదితర అంశాలపై కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎస్పీ మాట్లాడుతూ వివిధ నేరాలు, గంజాయి, మహిళలపై జరిగే నేరాలకు టోల్‌ ఫ్రీ నంబర్లు 181, 1098 వినియోగించాలని, మహిళల రక్షణకు శక్తి యాప్‌ ను సెల్‌ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచించారు. సైబర్‌ క్రైమ్‌ ఎస్సై వల్లి పద్మ మాట్లాడుతూ ఏపీకే ఫైల్స్‌, ఎస్బీఐ యోనో, తదితర పేర్లతో వస్తున్న ఫేక్‌ లింక్స్‌ను క్లిక్‌ చేయవద్దని సూచించారు. వీటిని ఓపెన్‌చేస్తే వ్యక్తిగత సమాచారం సైబర్‌ నేరగాళ్లకు చేరుతుందన్నారు. అపరిచితులు కాల్‌చేసి ఓటీపీ అడిగితే 1930కు ఫిర్యాదు చేయాలని కోరారు. డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రైజ్‌మనీ తగిలిందని, ప్రభుత్వ పథకాలు అందాయా, పోలీసులు మీపై కేసులు నమోదు చేశారని చెప్పేమాటలను నమ్మవద్దని హెచ్చరించారు. యాప్‌పై స్నేహితులు, తల్లిదండ్రులకు అవగాహన కలిగించి వారు కూడా ఇన్‌స్టాల్‌ చేసుకునేలా ప్రోత్సహించాలని కోరారు. కళాశాల ప్రిన్సిపాల్‌ సిస్టర్‌ మెర్సీ, త్రీటౌన్‌ సీఐ కోటేశ్వరరావు, మహిళా పోలీసు స్టేషన్‌ సీఐ సుబ్బారావు, కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినే టర్‌ డాక్టర్‌ స్వర్ణలత, ప్రోగ్రాం ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 12:51 AM