Share News

అడవిలో అటెన్షన్‌

ABN , Publish Date - Jun 08 , 2025 | 01:08 AM

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతకు జల్లెడ పట్టింది. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో మావోయిస్టుల జాడ గుర్తించి జల్లెడ పడుతున్నారు.

అడవిలో అటెన్షన్‌
వేలేరుపాడు మండలంలోని ఓ గిరిజన గ్రామంలో తనిఖీలు నిర్వహిస్తున్న ప్రత్యేక సాయుధ దళాల పోలీసులు

పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడుల్లో ప్రత్యేక పోలీస్‌ బలగాలతో గాలింపు

ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు అటవీ ప్రాంతాల పర్యటనలకు వెళ్లవద్దని ఇంటెలిజెన్స్‌ ఆదేశాలు

ప్రజలు భయపడాల్సిన పనిలేదు : ఎస్పీ కిశోర్‌

ఏలూరు క్రైం, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి):కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతకు జల్లెడ పట్టింది. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో మావోయిస్టుల జాడ గుర్తించి జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సమీపంలోని ఛత్తీస్‌గడ్‌ అటవీ ప్రాంతంలోని మావోయిస్టులు ఎక్కువగా ఉన్నారు. వీరు మన రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని అటవీ ప్రాంతాలను, గిరిజన గ్రామాలను షెల్టర్‌జోన్లుగా వినియోగిం చుకుంటున్నారు. అందులో భాగంగా ఏలూరు జిల్లాను గతంలో షెల్టర్‌జోన్‌గా వినియోగించు కున్నారు. ఇటీవల వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర నిఘా విభాగాలు ప్రభుత్వా లకు పలు హెచ్చరికలు, సూచనలు చేశాయి. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు మారుమూల గిరిజన ప్రాం తాలు, అటవీ ప్రాంతాలవైపు వెళ్ళవద్దని అత్యవసర పరిస్థితుల్లో అయితే అదనపు బలగాలతోనే పర్యటనలు కొనసాగించుకోవాలని సూచించారు. దీంతో ఏలూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు, ఒక పార్లమెంటు నియోజకవర్గం ఉండడం ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఒక శాసనసభ స్థానం(పోలవరం) ఉండడం తో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అదనపు భద్రతను కల్పించి ఆయన ముందుగా తలపెట్టుకున్న ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటనలను రద్దు చేశారు. ఎక్కడా అభివృద్ధి పనులకు ఆలస్యం జరగకుండా స్థానిక కూటమి నాయకులే శంకుస్థాపనలు నిర్వహించుకోవాలని సూచ నలు చేయడంతో ఈ విధంగా అభివృద్ధి పనులను చేస్తున్నారు. జిల్లాలో నక్సల్స్‌/మావోయిస్టుల కదలికలపై గతాన్ని పరిశీలిస్తే పోలవరం, బుట్టాయిగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగు మిల్లి అటవీ ప్రాంతాలను, గిరిజన ప్రాంతాలను తమ షెల్టర్‌ జోన్లుగా వినియోగించుకునే వారు. 2000 సంవత్సరం మార్చి 17న జలతార్‌ వాగు వద్ద మొట్టమొదటి పోలీసులకు నక్సల్స్‌కు కాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్‌, ఇద్దరు స్పెషల్‌ పార్టీ పోలీసులు మరణించారు. తర్వాత 2008 వరకూ పలు ఎన్‌కౌంటర్లు జరిగాయి. జిల్లాలో మొత్తం ఎనిమిది ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇందులో ముఖ్య నాయకులతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు మరణించారు. అప్పటి నుంచి జిల్లాలో ఎక్కడా నక్సల్స్‌ జాడలేదు. కేంద్ర ప్రభుత్వం నక్సల్స్‌ రహిత జిల్లాగా గుర్తించింది. అయినప్పటికీ జిల్లాలో పోలీస్‌ యంత్రాంగం ఏజెన్సీ ప్రాంతాల్లో ముందస్తు చర్యలతో, స్పెషల్‌ పార్టీ పోలీసులు కూబింగ్‌ కొనసాగిస్తూనే ఉన్నారు.

అణువణువూ గాలింపు

మరోవైపు జాతీయ పోలవరం ప్రాజెక్టుకు 2000 డిసెంబరులో ఏలూరు సమీపంలో కలపర్రు వద్ద శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న నేపథ్యంలో స్పెషల్‌ పార్టీ పోలీసులతో మన జిల్లాతోపాటు గోదావరి అటు వైపు ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో కూంబింగ్‌ నిరంతరం కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టుకు వీవీఐపీల పర్యటనలు జరుగుతున్న నేపథ్యంలో ముందస్తుగా ప్రాజెక్టుకు 15 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల పరిధి వరకూ మూడంచెల భద్రతతో కూంబింగ్‌ కొనసాగిస్తున్నారు.

ఎప్పటికప్పుడు ఆర్మ్‌డ్‌ రిజర్వుడు స్పెషల్‌ పార్టీ పోలీసులతో, యాంటీ నక్సల్స్‌ బృందాలు, పోలీసు జాగిలాలతో అటవీ ప్రాంతంలో జల్లెడ పడుతూనే ఉన్నారు. జిల్లా పోలీస్‌ యంత్రాంగం తీసుకునే చర్యలతో నక్సల్స్‌ కదలికలు తగ్గిపోయాయి. ఇటీవల ఛత్తీస్‌గడ్‌, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎన్‌కౌంటర్లు జరగడం, పెదపాడు మండలం సత్య వోలుకు చెందిన సుధాకర్‌ ఎన్‌కౌంటర్‌లో మరణిం చడంతో పోలీస్‌ యంత్రాంగం మరింత అప్రమ త్తమైంది. కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థల సూచనలతో ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నేపధ్యంలో పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, వేలేరు పాడు, కుక్కునూరు ప్రాంతాల్లో పర్యటనలు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు రద్దు చేసుకో వాలని సూచనలు రావడంతో ఆ దిశగా చర్యలు చేపట్టారు.

భయపడాల్సిన పనిలేదు : ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌

జిల్లాలో మావోయిస్టు/నక్సల్స్‌ కదలికలు లేవు. ఇంటిలిజెన్స్‌ ఉన్నతాధికారుల ఆదేశాలతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం ప్రాంతాల్లో స్పెషల్‌ పార్టీ పోలీసులు, యాంటీ నక్సల్స్‌ స్వ్కాడ్‌, పోలీస్‌ జాగిలాలు, బాంబ్‌ డిస్పోజల్‌ స్వాడ్‌లు, ఎక్స్‌ప్లోజివ్‌ డిటెక్ట్‌ టీమ్‌లు, హైఫ్రీక్వెన్సీ డ్రోన్లతో నిఘా పెట్టాం. అవసరమైన అదనపు బలగాలను ఏజెన్సీ ప్రాంతంలో ఉంచి ముందస్తు చర్యల్లో భాగంగానే గాలింపు నిర్వహిస్తున్నాం. ఇటీవల ఛత్తీస్‌గడ్‌, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎన్‌కౌంటర్లు జరగడం, ఛత్తీస్‌గడ్‌ ప్రాంతంలో పూర్తి నిర్భందం వున్న నేపథ్యంలో ఒకవేళ అటు నుంచి మావోయిస్టులు షెల్టర్‌ జోన్‌గా జిల్లాను వినియోగించుకోవడానికి జిల్లాలోని అటవీ ప్రాంతాలకు వచ్చే అవకాశాల నేపథ్యంలో జల్లెడపడుతున్నాం.

Updated Date - Jun 08 , 2025 | 01:08 AM