వైభవంగా అమ్మవార్లకు ఆషాఢ సారె
ABN , Publish Date - Jul 14 , 2025 | 12:09 AM
కైకలూరు శ్రీశ్యామలాంబ అమ్మవారి ఆలయంలోని పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామికి ఆషాఢమాసం సందర్భంగా కైకలూరుకు చెందిన వందలాదిమంది మహిళలు సారె అందజేశారు.
కైకలూరు/మండవల్లి/ముదినేపల్లి, జూలై 13(ఆంధ్రజ్యోతి): కైకలూరు శ్రీశ్యామలాంబ అమ్మవారి ఆలయంలోని పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామికి ఆషాఢమాసం సందర్భంగా కైకలూరుకు చెందిన వందలాదిమంది మహిళలు సారె అందజేశారు. ఆదివారం కైకలూరు బ్రహ్మంగారి గుడి వీధిలోని, వెలమపేటకాలనీకి చెందిన మహిళలు సారెను ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈవో వీఎన్‌కే శేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. మండవల్లి మండలం మండవల్లిలో శ్రీగంగానమ్మ, శ్రీభ్రమరాంబ, శ్రీవిజయదుర్గా దేవి అమ్మవార్లకు ఆదివారం భక్తులు ఆషాఢ సారె సమర్పించారు. పండితులు చాగంటిపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులు మేళతాళాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవార్లకు పసుపు, కుంకుమ, చీర, గాజులు, పండ్లు, స్వీట్లు సమర్పించారు. శ్రీగంగానమ్మ అమ్మవారిని అర్చకులు గూడూరు శ్రీనివాసరావు పలురకాల కూరగాయాలతో అలంకరించగా, శాకంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ముదినేపల్లి మండలం ముదినేపల్లిలో చినపూరిగా ప్రసిద్ధిగాంచిన వడాలి గ్రామంలోని సుభద్ర, బలరామ సహిత జగన్నాథస్వామి దేవస్థానంలో సుభద్రమ్మవారికి ఆదివారం మహిళలు ఆషాఢ సారె సమర్పించారు. మహిళలు వందల సంఖ్యలో ఎర్రటి సంప్రదాయ దుస్తులు ధరించి ప్రదర్శనగా వచ్చి సారె సమర్పించి పూజలు నిర్వహించారు. పలు రకాల మిఠాయిలు, పండ్లు, చలిమిడితో కలిగిన సారెను సమర్పిం చారు. దేవస్థానం ఈవో సింగనపల్లి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. నక్కా అప్పారావు ఆధ్వర్యంలో మహిళలు సారె సమర్పించారు. పెదపాలపర్రు గ్రామ ఇలవేల్పు గంగానమ్మకు అర్చకుడు భుజంగ వెంకట నరసింహారావు ఆధ్వర్యంలో మహిళలు పూజలు నిర్వహించి, సారె సమర్పించారు.
ఫ చాట్రాయి, జూలై 13(ఆంధ్రజ్యోతి): చాట్రాయి మండలం చాట్రాయిలోని కనకదుర్గమ్మకు ఆదివారం వందలాది మంది భక్తులు ఆషాఢ సారె సమర్పించారు. పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, స్వీట్లు మొదలైనవి మహిళలు తలపై పెట్టుకొని దుర్గాదేవి భక్తి గీతాలు ఆలపిస్తూ మంగళ వాయిద్యాలు కోలాట ప్రదర్శనలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి సమర్పించారు.
ఫ ఆగిరిపల్లి : ఆగిరిపల్లిలో గ్రామ
దేవతలైన గంగానమ్మ, అంకమ్మ, పోలేరమ్మ, కనకదుర్గమ్మలకు ఆదివారం గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు విజయవాడ రోడ్డులోని మాలక్ష్మమ్మ మాను పోతురాజు దిమ్మ నుంచి గ్రామోత్సవం ప్రారంభమై గ్రామ వీధులలో డప్పు వాయిద్యాలతో వైభవంగా నిర్వహించారు. భక్తులు పాలపొంగళ్లు తయారు చేసి మొక్కు చెల్లించుకున్నారు.