Share News

వీర జవాన్‌ రాజశేఖర్‌కు కన్నీటి వీడ్కోలు

ABN , Publish Date - Dec 25 , 2025 | 12:33 AM

దేశ రక్షణలో తన వంతు సేవలందించాలనే సంకల్పంతో ఆర్మీలో చేరిన రాజశేఖర్‌ ప్రమాదవశాత్తు నదిలో గల్లంతయ్యాడు. సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్‌ అనంతరం మృత దేహాన్ని ఆర్మీ అధికారులు స్వగ్రామానికి ప్రత్యేక వాహనంలో గన్నవరం ఎయిర్‌ పోర్టు నుంచి పెనుమంట్ర మండలం ఆలమూరుకు తీసుకువచ్చారు.

వీర జవాన్‌ రాజశేఖర్‌కు కన్నీటి వీడ్కోలు
మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లిదండ్రులు

నివాళులర్పించిన ఎమ్మెల్యే పితాని, తదితరులు

ఆలమూరులో సంతాప సూచికంగా పాఠశాలల మూత

పెనుమంట్ర, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): దేశ రక్షణలో తన వంతు సేవలందించాలనే సంకల్పంతో ఆర్మీలో చేరిన రాజశేఖర్‌ ప్రమాదవశాత్తు నదిలో గల్లంతయ్యాడు. సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్‌ అనంతరం మృత దేహాన్ని ఆర్మీ అధికారులు స్వగ్రామానికి ప్రత్యేక వాహనంలో గన్నవరం ఎయిర్‌ పోర్టు నుంచి పెనుమంట్ర మండలం ఆలమూరుకు తీసుకువచ్చారు. పెనుగొండ మండలం వడలి నుంచి ఆలమూరు వరకు పలువురు అంతిమయాత్ర జరిగింది. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అంతియ యాత్రలో పాల్గొని రాజశేఖర్‌ పార్ధివ దేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించా రు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆలమూరులో ప్రతి కుటుంబం నుంచి ఒకరు అంతిమయాత్రలో పాల్గొని దేశభక్తిని చాటారు.

కుటుంబ నేపధ్యం

సనాయిల గాంధికి ఇద్దరు కుమారులు. వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు కుమారులను డిగ్రీ వరకు చదివించారు. పెద్ద కుమారుడు బాల నాగరాజు వ్యవసాయ కూలి. రాజశేఖర్‌ 2020లో డిగ్రీ సెకండియర్‌ చదువుతుండగా ఆర్మీకి ఎంపికయ్యాడు. ఫిబ్రవరి 2021లో విధుల్లో చేరారు. ఈ నెల 12న కుటుంబ సభ్యులను కలిసేందుకు సెలవుపై ఆలమూరు వచ్చారు. మార్గమధ్యంలో ఉండగానే అధికారులు వెనక్కి రావాలని ఆదేశించడంతో ఒక్కరోజు తల్లిదండ్రలు వద్ద ఉండి శిక్షణ శిబిరం పశ్చిమ బెంగాల్‌కు తిరిగి వెళ్ళారు. శిక్షణ పొందుతూ పశ్చిమ బెంగాల్‌ డార్జిలింగ్‌ సమీపంలో శ్రిస్టానదిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు.

ఆలమూరులో సంతాప సూచికంగా..

ఆలమూరులో జవాన్‌ రాజశేఖర్‌ పార్ధివదేహాన్ని తీసుకువస్తున్న నేపధ్యంలో గ్రామస్థులు సంతాపం సూచికంగా ఒక రోజు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసి వేసి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

జవాన్‌ పార్ధివ దేహానికి పోలీసులు గౌరవ వందనం సమర్పించి నివాళులు అర్పించారు. నూర్‌ బాషా దూదేకుల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ షేక్‌ సయ్యద్‌ ఆలీ జిన్నా, ఎంపీపీ కర్రి వెంకట నారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్‌ కొవ్వూరి విజయశ్రీ వెంకటేశ్వరరెడ్డి, ఎంపీటీసీ పలివెల ఆశాజ్యోతి, కడలి ఏడుకొండలు, డిప్యూటీ తహసీల్దార్‌ ఏలియమ్మ, పెనుగొండ, పెనుమంట్ర మండల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2025 | 12:33 AM