కాల్వలో ఆక్వా వ్యర్థ జలం
ABN , Publish Date - Oct 09 , 2025 | 12:21 AM
మండలంలో సుమారు పది గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందించే బొండాడ పంట కాల్వ చేపల చెరువుల నీటితో కలుషితమవుతోంది.
కాళ్ల, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): మండలంలో సుమారు పది గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందించే బొండాడ పంట కాల్వ చేపల చెరువుల నీటితో కలుషితమవుతోంది. ఒకపక్క పంట కాలువలను పరిరక్షించాలని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు పటిష్ట చర్యలు చేపడుతుంటే మరోపక్క ఆక్వా రైతులు నిర్లక్ష్యంగా ఆక్వా వ్యర్థ జలా లు పంట కాలువలోకి వదిలేస్తున్నారని శివారు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాలవానితిప్పలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక ఆక్వా రైతు పంట కాలువలోకి కలుషిత నీరు వదిలినా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల డిప్యూటీ స్పీకర్ ఆదేశాలతో కాలువను పూర్తి స్థాయిలో బాగు చేశారని, కొంత మంది ఇలా కలుషితం చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కనీస పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు కారణమని, మండల పరిధిలో ఈ కాలువ వెంబడి ముగ్గురు నీటి సంఘం అధ్యక్షులున్నా కలుషితం కాకుండా చూడలేకపోతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. కలుషిత నీరు కనీసం వాడుకోవడానికి కూడా ఉపయోగపడడం లేదని, పశువులు కూడా తాగడం లేదని శివారు గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అధికారులు, నీటి సంఘం అధ్యక్షులు వెంటనే స్పందించి చేపల చెరువు నీటిని పంట కాలువలోకి వదలకుండా తగు చర్యలు తీసుకోవాలని శివారు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.