వహ్వా.. ఆక్వా
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:07 AM
ఆంధ్రా రొయ్యకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు పెరిగాయి. ప్రపంచంలో మొన్నటివరకు అమెరికా మార్కెట్లు మీద పూర్తిగా ఆధారపడిన రొయ్య ఎగుమతిదారులు ప్రస్తుతం పెరుగుతున్న మార్కెట్లతో కొంతవరకు కోలుకోగలుతున్నారు.
మన రొయ్యకు మంచి రోజులు !
ప్రపంచ వ్యాప్త మార్కెట్లు
గతంలో కంటే పెరిగిన ఎక్స్‌పోర్ట్స్
అమెరికాకు ప్రత్యామ్నాయంగా యూరోపియన్ యూనియన్, చైనా, ఆసియా దేశాలకు ఉత్పత్తులు
అమెరికాతో సంప్రదింపులు జరపాలని ఎగుమతిదారుల వేడుకోలు
నిడమర్రు, డిసెంబరు11(ఆంధ్రజ్యోతి) :ఆంధ్రా రొయ్యకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు పెరిగాయి. ప్రపంచంలో మొన్నటివరకు అమెరికా మార్కెట్లు మీద పూర్తిగా ఆధారపడిన రొయ్య ఎగుమతిదారులు ప్రస్తుతం పెరుగుతున్న మార్కెట్లతో కొంతవరకు కోలుకోగలుతున్నారు. పెరిగిన కొత్త మార్కెట్ల వల్ల భవిష్యత్తు ఆశాజనకంగా ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న దారుణమైన నిర్ణయం భారత ఎగుమతులపై టారిఫ్ 25 శాతం పెంచడం, అదనంగా 25 శాతం ఫెనాల్టీ విధించడం వల్ల రొయ్య మార్కెట్టు పూర్తిగా కుదేలైంది. అటువంటి విపత్కర పరిస్థితులలో అమెరికాకు అతిపెద్ద ఎక్స్‌పోర్టర్‌గా ఉన్న భారతదేశ రొయ్య ఎగుమతులు పూర్తిగా చతికలపడతాయనుకున్న సమయంలో భారత ప్రభుత్వం ఆక్వా రంగం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దీని ఫలితంగానే రొయ్య ఎగుమతులులో పెరుగుదల కనిపిస్తోంది.
చైనా, యూరోపియన్, ఆసియా దేశాలకు ఎగుమతులు..
అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మార్కెట్ దెబ్బతినే పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి చంద్రబాబునాయుడు చొరవతీసుకుని కేంద్రప్రభుత్వంతో చర్చలు జరిపారు. దీని ఫలితంగా కేంద్రం యూరోపియన్ యూనియన్ దేశాలతో, చైనా, ఆసియా దేశాలతో సంప్రదింపులు జరిపి మన రొయ్య కొనుగోలుకు మార్గం సుగుమం చేసింది.
2024 ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు దేశం నుంచి 11.21 లక్షల టన్నుల ఎగుమతులు జరగగా, అవి 2025 ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు దేశం నుంచి 14.35 లక్షల టన్నులకు పెరిగాయి. విలువ పరంగా 46శాతం వృద్ధి చెందాయని గణాంకాలు చెబుతున్నాయి. యూరోపి యన్ దేశాలలో ఒక్కసారిగా వంద మార్కెట్లు కొత్తగా వెలిశాయి.
అమెరికా సుంకాల ప్రభావం..
అమెరికా ప్రభుత్వం రొయ్య ఎగుమతులపై ఒక్కసారిగా 50 శాతం సుంకాలు విధించడంతో దేశీయ మార్కెట్లలో రొయ్యల రేట్లు పూర్తిగా పడిపోయాయి. ఆనాడు వంద కౌంట్ ధర రూ.240 నుంచి ఒక్కసారిగా రూ.200కు పడిపోయింది. 30 కౌంట్ రూ.470 నుంచి రూ.400కు దిగజారిపోయింది. ఈమేరకు ఆక్వా రైతు పూర్తిగా కుదేలయిపోయాడు. నేడు ప్రపంచ మార్కెట్లు పలు దేశాలలో విస్తరించడం వల్ల రొయ్య రేటుకు రెక్కలొచ్చాయి. నేటి మార్కెట్ ప్రకారం వంద కౌంట్ ధర రూ.270కు, 40 కౌంట్ ధర రూ.405, 30 కౌంట్ ధర రూ.480కు ఎగబాకింది.
సీజీఎస్‌ఈ స్కీంతో ఎగుమతిదారులకు ఊరట
అమెరికా దెబ్బకు మార్కెటు కుదేేలవుతున్న దశలో ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎగుమతిదారులకు ఆర్ధికంగా అండగా నిలబడింది. కేంద్రం రిజర్వుబ్యాంకుతో చర్చలు జరిపి నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. రిజర్వు బ్యాంకు ద్వారా బ్యాంకులకు ఆదేశాలిస్తూ ఎగుమతిదారులు ఆర్థికంగా బలోపేతం కోసం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ఫర్ ఎక్స్‌పోర్టర్స్ (సీజీఎస్‌ఈ) స్కీం ద్వారా 20శాతం ఫండ్స్ అదనంగా ఎగుమతిదారులకు అందజేసే ఏర్పాట్లు చేసింది. దీంతో రొయ్య ఎగుమతులు సజావుగా సాగడానికి మార్గం సుగుమమైంది. ఎక్స్‌పోర్ట్స్ లోన్స్ కూడా ఇవ్వడం జరిగింది.
రొయ్య ఎగుమతిదారులు ఇలా..
రొయ్య ఎగుమతులలో మన రాష్ట్రం సుమారు 70 నుంచి 75 శాతం వాటాను కలిగిఉంది. ప్రతి ఏడాది దేశం నుంచి 7–8 లక్షల మెట్రిక్ టన్నుల రొయ్యలు ఎగుమతి అవుతున్నాయి. దీనిలో సింహభాగం నాలుగు లక్షల టన్నుల రొయ్యల ఎగుమతులు మనరాష్ట్రం నుంచే కావడం గమనార్హం. ఎగుమతులలో మన రాష్ట్రం 60 శాతం వాటాను కలిగి ఉంది. మన రాష్ట్ర నుంచి ప్రతి రోజూ వెయ్యి నుంచి పదిహేను వందల టన్నుల రొయ్యలు ఎగుమతులు జరుగుతున్నాయి. ఇదేకాకుండా ఇతర రాష్ట్రాలనుంచి ఎగుమతి అయ్యే రొయ్యలలో 70 శాతం రా మెటీరియల్ మన రాష్ట్రానిదే. అంటే మన రొయ్యలను తమిళనాడు, కేరళ వ్యాపారస్థులు కొని అక్కడ ప్రాసెసింగ్ చేసి వారి పోర్టుల ద్వారా ఎగుమతులు చేయడం.
అమెరికాపైనే ఎక్స్‌పోర్టర్స్ ఆసక్తి..
ఎగుమతుదారులు మాత్రం నూతన మార్కెట్ల పట్ల పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఎందుకంటే చైనా మన రొయ్యలను కేవలం హెడ్‌లెస్ చేసి రొయ్యలను కొనుగోలు చేస్తుంది. మన రొయ్య సరుకులకు వాల్యూ యాడెడ్ అనేది చైనా మార్కెట్ ద్వారా లభించదని ఎగుమతిదారులు మాటగా ఉంది. ప్రస్తుతం ఎగుమతులు పర్వాలేదు కానీ భవిష్యత్తులో మన ఉత్పత్తులకు విలువ ఆధారిత ధరలు రావాలంటే ఈవిధంగా సాధ్యం కాదంటున్నారు. యూరోపియన్ మార్కెట్ పెరిగినప్పటికీ అక్కడకు ఎగుమతి చేయాలంటే సమారు 27 దేశాల విధివిధానాలతో మనం సంప్రదింపులు, చర్చలు జరుపుతూ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలంటున్నారు. ఇన్ని దేశాలతో వాణిజ్య ఒప్పందాలు అమలు ఎంతవరకు సాధ్యమని ఎగుమతిదారులు ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికైనా మన దేశానికి అతిపెద్ద మార్కెటు అమెరికా దేశమని, అక్కడ మన సరుకులకు విలువ ఆధారిత ధరలు ఉంటాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా దేశంతో మన కేంద్రం వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటే మళ్లీ మన రొయ్యలకు పూర్వ వైభవం వస్తుందని ఎగమతిదారులు చెబుతున్నారు.
అమెరికాతో చర్చిస్తే మరింత మంచిది..
ట్రంప్ ప్రభుత్వ ఆంక్షల వల్ల ఎగుమతులు స్తంభించాయి. ఆక్వా రంగాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఎగుమతులకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖను కోరింది. దీంతో కేంద్రం అమెరికాకు ప్రత్యామ్నాయంగా చైనా, యూరోపియన్ యూనియన్, ఆసియా దేశాలతో చర్చలు జరిపి రొయ్యకు కొత్త మార్కెట్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఇది కంటితుడుపు చర్య మాత్రమే. ప్రత్యామ్నాయ మార్కెట్‌ల వల్ల మన పచ్చి సరుకు ఎగుమతి అవుతుందే కాని దానికి తగిన విలువ రావడం లేదు. దేశంలో వున్న సుమారు 120పైగా మెరైన్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీల్లో సుమారు ఐదు లక్షల మంది మహిళలు, యువకులు పనిచేస్తున్నారు. వీరి భవిష్యత్తు ప్రశ్నర్ధాకంగా మారకుండా ఉండాలంటే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అమెరికా వాణిజ్య బృందం ప్రతినిధులతో చర్చలు జరిపితే మెరైన్ ఎక్స్‌పోర్టర్స్ రంగం ముందుకు సాగుతుంది.
కె.ఆనంద్, సంధ్య మెరైన్స్ అధినేత, ఏపీ మెరైన్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు