Share News

నేటి నుంచే ఏపీఈఏపీ సెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌

ABN , Publish Date - Jul 07 , 2025 | 12:13 AM

ఇంజనీరింగ్‌లో చేరేందుకు నిర్వహించే ఏపీఈఏపీ సెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ సోమవారం నుంచి మొదలు కానుంది.

 నేటి నుంచే ఏపీఈఏపీ సెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌

13 తేదీ నుంచి కళాశాలల ఎంపిక

22న సీట్ల కేటాయింపు... ఆగస్ట్‌ 4న తరగతులు

ఉమ్మడి జిల్లాలో 9,093 కన్వీనర్‌ కోటా సీట్లు

భీమవరం రూరల్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి) :ఇంజనీరింగ్‌లో చేరేందుకు నిర్వహించే ఏపీఈఏపీ సెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ సోమవారం నుంచి మొదలు కానుంది. కౌన్సెలింగ్‌లో ముందుగా నమోదు ఫీజు చెల్లింపులు 7 తేదీ నుంచి 16వ తేదీ వరకు చేసుకోవాలి. దాంతోపాటు సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌, ఆన్‌లైన్‌ ధృవీకరణ చేసుకోవడానికి 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అవకాశం ఉంది. 13వ తేదీ నుంచి 18 వరకు కళాశాలల ఎంపిక చేసుకోవాలి. 19వ తేదీ ఒకరోజు మాత్రమే కళాశాలల ఎంపికలో మార్పులు చేసుకోవచ్చు. 22వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుంది. కళాశాలలో చేరే విద్యార్థులు 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రిపోర్టింగ్‌ ఇవ్వాలి. వచ్చేనెల 4వ తేదీ నుంచి కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయి. ఉమ్మడి జిల్లాలకు 14 ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉండగా 9,093 కన్వీనర్‌ కోటా సీట్లు 3,897 మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లు మొత్తం 12,990 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఏపీఈఏపీ సెట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా కన్వీనర్‌ కోటా సీట్లు 9,093 భర్తీ కావాల్సి ఉంది.

అవసరమైన సర్టిఫికెట్స్‌ ఇవీ

ఏపీఈఏపీ హాల్‌ టిక్కెట్‌, ర్యాంకు కార్డు, ఇంటర్మీడియెట్‌, పదో తరగతి మార్కుల జాబితా, టీసీ, 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు స్టడీ సర్టిఫికెట్స్‌ ఉండాలి. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలతో పాటు ఈడబ్ల్యుఎస్‌ సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డు జత చేయాలి. వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 600, ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 1200 రిజిస్ట్రేషన్‌ ఫీజుగా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. దాని రశీదు కూడా ఉండాలి.

ఈ ఏడాది విద్యార్థులు పెరిగారు..

ఈ ఏడాది ఏపీఈఏపీ సెట్‌ రాసినవారు పెరిగారు. ఉత్తీర్ణత కూడా బాగుంది. దీంతో ఉమ్మడి జిల్లాలో 11,739 మంది క్వాలిఫై అయ్యారు. ప్రస్తుతం కన్వీనర్‌ కోటా సీట్లు 9093 ఉన్నాయి. దీంతో ఇంజనీరింగ్‌ కళాశాలలో సీట్ల భర్తీ బాగుంటుందనే అంచనాలో యాజమాన్యాలు ఉన్నాయి. గతేడాది 85 శాతం పైగా సీట్ల భర్తీ అయ్యింది. ఈ ఏడాది అంతకు మించి సీట్ల భర్తీ అయ్యేలా కనిపిస్తున్నది. గత ఐదేళ్ళ నుంచి అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో తరగతులు మొదలయ్యాయి. గతేడాది ఆగస్ట్‌లో ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఆగస్ట్‌ మొదటి వారంలోనే మొదలుకానున్నాయి.

Updated Date - Jul 07 , 2025 | 12:13 AM