దేశ భవిష్యత్‌ను నిర్ణయించేది యువ ఇంజనీర్లే..
ABN , Publish Date - Aug 10 , 2025 | 12:52 AM
డిజిటల్ లావాదేవీల్లో భారత్ అగ్రగామిగా ఉందని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్, టెక్నాలజీ) ప్రెసిడెంట్ వి.రాజన్న అన్నారు. శనివారం తాడేపల్లిగూ డెంలోని ఏపీ నిట్‌లో ఏడో స్నాతకోత్సవ వేడుకను ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టన్ ఎన్వీ రమణారావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.
టీసీఎస్ ప్రెసిడెంట్ రాజన్న
ఘనంగా ఏపీ నిట్ స్నాతకోత్సవం
887 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాల అందజేత
తాడేపల్లిగూడెంఅర్బన్, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): డిజిటల్ లావాదేవీల్లో భారత్ అగ్రగామిగా ఉందని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్, టెక్నాలజీ) ప్రెసిడెంట్ వి.రాజన్న అన్నారు. శనివారం తాడేపల్లిగూ డెంలోని ఏపీ నిట్‌లో ఏడో స్నాతకోత్సవ వేడుకను ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టన్ ఎన్వీ రమణారావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజన్న మాట్లాడుతూ దేశ భవిష్యత్‌కు డిజిటల్ టెక్నాలజిలే ప్రధాన చోదకశక్తిగా మారనున్నాయన్నారు. దేశభవిష్యత్త్‌ను నిర్ణయించేది యువ ఇంజనీర్లేనని ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత దేశం అవతరించబోతుందన్నారు. 97 కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లు, యూపీఐ ద్వారా ఏటా వంద బిలియన్లకుపైగా లావాదేవీలు నిర్వహిస్తుం దన్నారు. విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చు కోవాలని, నచ్చిన పుస్తకాలను చదవడం, సంగీతం వినడం ద్వారా ఒత్తిడిని అధికమించవచ్చన్నారు. ఏపీ నిట్ ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టర్ రమణారావు మాట్లాడుతూ దేశం గర్వించే రీతిలో విద్యార్థులు వినూత్న పరిశోధనలు, ఆవిష్కర ణలు చేపట్టాలన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎప్పటికప్పుడు కొత్తకొత్త సాంకేతికతలు ఆవిష్కృత మవుతున్నాయని వాటిలో మెలకు వలు నేర్చుకుని పట్టు సాధించిన వారే ఆగ్రస్థానాల్లో నిలదొక్కుకుం టారన్నారు. విద్యార్థులు విభిన్న ఆలోచనలు చేస్తూ నూతన ప్రాజెక్టులు చేపడితే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. అనంతరం 2021–25 బ్యాచ్‌లో బీటెక్‌లో నాలుగేళ్ల ఇంజనీరింగ్ పూర్తి చేసిన 887 మంది విద్యార్థులకు డిగ్రీలు, పీహెచ్‌డీ పూర్తి చేసిన 29 మందికి డాక్టరేట్ పట్టాలతో బంగారు పతకాలు అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్‌శంకర్‌రెడ్డి, డీన్‌లు డాక్టర్ జీ.రవికిరణ్‌శాస్త్రి, డాక్టర్ వి.సందీప్, డాక్టర్ ఎన్.జయరాం, డాక్టర్ హిమబిందు పాల్గొన్నారు.
అధికారుల తీరుపై ‘పాకా’ అసహనం
8 ఎక్కడా లేని నిబంధనలు ఇక్కడే ఎందుకు పెడుతున్నారంటూ ఆగ్రహం
స్నాత కోత్సవ వేడుకలలో ఏపీ నిట్ అధికారుల తీరును రాజ్యసభ సభ్యుడు పాకా వెంకటసత్యనారాయణ తప్పుబట్టారు. వాస్తవానికి తాడేపల్లిగూడెం ఏపి నిట్‌లో శనివారం నిర్వహించిన స్నాతకోత్సవ వేడుకలో డిగ్రీలు, డాక్టరేట్ పట్టాలను అందుకోనున్న విద్యార్థుల తల్లిదండ్రులను నిట్ అధికారులు పిలిచారు. తమ పిల్లలు పట్టాలు తీసుకునేప్పుడు చూసి ఆనందిద్దామన్న ఆశతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ కుటుంబసభ్యులతో సుమారు రెండు వేల మంది వేడుకకు హాజరయ్యారు. అయితే నిట్‌లో ఉన్న రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఈ వేడుకను అధికారులు నిర్వహించారు. ఆ ఆడిటోరియంలో 800మంది మాత్రమే వెళ్లగలుగుతారు. తొలుత వచ్చిన వారినందరిని అధికారులు ఆడిటోరియంలోకి పంపించారు. స్థలం సరిపోని కారణంగా చాలామంది ఆడిటోరియం వెలుపలే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో వారందరూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అప్పుడే కార్యక్రమానికి వచ్చిన రాజ్యసభ సభ్యుడు పాకా వెంకటసత్యనారాయణ వద్దకు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకున్నారు. స్థలం సరిపోనప్పుడు బయట ఏర్పాటు చేయాలి తప్పా కొద్దిమందికే అనుమతి అంటూ తమను అధికారులు బయటే ఆపేశారంటూ పాకాకు విన్నవించారు. ఈమేరకు నిట్ అధికారుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని నిబంధనలు ఈ నిట్‌కు మాత్రమే ఎందుకు అంటకడుతు న్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పరిస్థితి మార్చుకోవాలంటూ హెచ్చరించారు. దీనిపై నిట్ ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టన్ ఎన్వీ రమణారావుతో మాట్లాడారు. ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
శాస్త్రవేత్తగా రాణించడమే లక్ష్యం
మా నాన్న కృష్ణంరాజు స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. అమ్మ మధు గృహిణి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో 9.70 గ్రేడు పాయింట్లు సాధించి ఇనిస్టి ట్యూట్ టాపర్‌గా నిలవడం సంతోషంగా ఉంది. నేను బెంగళూరులోని ఐఐఎస్సీలో ఎంటెక్ చేస్తున్నా. ముందు నుంచి అర్థం చేసుకుని చదవడం అలవాటు. ఆ అలవాటే టాపర్‌గా చేసింది. భవిష్యత్త్‌లో శాస్త్రవేత్తగా రాణించాలనేది నా లక్ష్యం
– కలిదిండి పీటీఎస్ వర్మ, భీమవరం (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్)
‘యూపీఎస్‌సీ’లో ఉద్యోగం సాధిస్తా..
మా నాన్న తమ్మన్న రైతు. అమ్మ లత దేవాదాయ శాఖ లో తహసీల్దార్. ప్రస్తుతం మద్రాస్ ఐఐటీలో పీహెఛ్‌డీ చేస్తున్నా. బయో ఇంజనీరింగ్‌లో 9.33 గ్రేడు పాయింట్లు సాధించడం చాలా ఆనందంగా ఉ ంది. ఆచార్యులు చెప్పిన పాఠాలను శ్రద్దగా విని అర్థం చేసుకునేవాన్ని. గ్రంధాలయానికి ఎ క్కువ సమయం కేటాయించేవాన్ని. భవిష్యత్త్‌లో యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్‌లో ఉద్యోగం సాధించాలనేదే జీవిత ఆశయం.
– శశాంక్, కర్ణాటక, (బయో ఇంజనీరింగ్)
ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యం
మా నాన్న వైజాగ్‌లోని టయోటా కంపెనీలో విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. అమ్మ గృహిణి. కెమికల్ ఇంజనీరింగ్‌లో 8.82 గ్రేడు పాయింట్లు సాధించడం అనందంగా ఉంది. ప్రస్తుతం బెంగళూరులోని ఐఐఎస్సీ విద్యా సంస్థలో ఎంటెక్ కోర్సు చదువుతున్నా. నా తల్లిదండ్రులు చదువులో నన్ను ఎంతో ప్రొత్సహించారు. భవిష్యత్త్‌లో ప్రభుత్వ కొలువు సాధించాలనేదే నా లక్ష్యం
– సంగెపు అభినవ్, వైజాగ్ (కెమికల్ ఇంజనీరింగ్)
నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి
మా నాన్న సుందరబాబు అకౌంటెంట్. అమ్మ నాగలక్ష్మి గృహిణి. సివిల్ ఇంజనీరింగ్‌లో 9.44 గ్రేడు పాయింట్లు సాధించినందుకు ఆనందపడుతున్నా. ప్రస్తుతం చెన్నైలోని ఎల్‌అండ్‌టీ కంపెనీలో త్రీడి మోడలింగ్ డిజైనర్‌గా పనిచే స్తున్నా. నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే ఏరంగంలోనైనా రాణించవచ్చు. భవిష్యత్‌లో అధికారిణిగా స్థిరపడాలనేదే నా లక్ష్యం
– తమ్ము హరిత, అవనిగడ్డ (సివిల్ ఇంజనీరింగ్)
నాన్న చదువులో ప్రోత్సహించారు
మా నాన్న యోగేంద్రసింగ్ రైతు. ఈఈఈలో 9.42 గ్రేడు పాయింట్లు సాధించడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం రిలియన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్‌గా పనిచేస్తూ.. రూ 7.50 లక్షల జీతాన్ని అందుకుంటున్నా. చిన్నపటి నుంచి నాన్న నన్ను చదువులో ఎంతో ప్రోత్సహించారు. ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నిలబెట్టుకున్నందుకు గర్వంగా ఉంది.
– ఆదిత్య ప్రతాప్‌సింగ్, ఉత్తరప్రదేశ్ (ఈఈఈ)
గూగుల్‌లో జాబ్ సంపాదిస్తా..
మా నాన్న సత్తిబాబు రైతు, అమ్మ సాయి స్వప్నదేవి . కమ్యునికేషన్ ఇంజనీరింగ్‌లో 9.48 గ్రేడు పాయింట్లు సాధించడం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ డెవలెప్‌మెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తూ రూ.19 లక్షలు జీతాన్ని అందుకుంటున్నా. గూగుల్ కంపెనీలో ఉద్యోగం సాధించి ఉన్నతస్థాయికి వెళ్లాలన్నదే లక్ష్యం.
– చిత్తడి ధనూషాలక్ష్మి, నిడదవోలు (కమ్యూనికేషన్ ఇంజనీరింగ్)
సివిల్ సర్వీసెస్‌లో ఉద్యోగం సాధిస్తా..
మా నాన్న విజయ్‌కుమార్, అమ్మ కృపాదాసి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. ఇద్దరూ ఉపాధ్యాయులు కావడం వల్ల చదువులో నన్నెంతగానే ప్రోత్సహించారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో 9.33 గ్రేడు పాయింట్లు సాధించడం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం ముంబైలోని ఎల్‌అండ్‌టీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ రూ.6 లక్షల వేతనం తీసుకుంటున్నా. సివిల్ సర్వీసెస్‌లో ఉద్యోగం సాధించాలనేది లక్ష్యం.
– పుడిముడి ప్రియాంక, (మెకానికల్ ఇంజనీరింగ్)