అన్నదాతా సుఖీభవకు అంతా సిద్ధం
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:14 AM
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకానికి జిల్లా వ్యవసాయ శాఖ కసరత్తు పూర్తి చేసింది.
జిల్లాలో 1,02,256 మంది రైతులు
ఆగస్టు 2న సొమ్ములు జమ
తొలి విడతలో రూ. 7 వేలు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకానికి జిల్లా వ్యవసాయ శాఖ కసరత్తు పూర్తి చేసింది. జాబితా సిద్దమైంది. అర్హులను గుర్తిం చారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1,02,256 మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా నిర్ధారణ అయ్యారు. ఇటీవల రైతులనుంచి అభ్యంతరాలను స్వీకరించారు. దాదాపు 1450 మంది రైతులు లోపాలను సరిది ద్దుకున్నారు. అన్నదాత సుఖీభవ పోర్టల్‌లో నమోద య్యారు. వారికి కూడా ప్రభుత్వం సొమ్ములు జమ చేయనుంది. అర్హత ఉన్నా సరే ఇతర ఈకేవైసీ పూర్తి కాని రైతులు 376 మంది రైతుల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు సేకరించారు. వారిని రప్పించే ప్రయత్నం చేశారు. ఇంకా 176 మంది రైతులు మిగిలిపోయారు. వారంతా ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. అటువంటి వారినుంచి వివరాలు సేకరించడాన్ని నిలిపివేయాలని వ్యవసాయశాఖ నిర్ణయం తీసుకుంది. మరో రెండు రోజుల వరకు రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. లోపాలను సరిదిద్దుకుని అర్హుల జాబితాలో చేర్చనున్నారు. వాస్తవానికి జిల్లాలో 1,05,556 మంది రైతులు అన్నదాత సుఖీభవ జాబితాకు గుర్తించారు. ఆధార్ లోపాలు, ఈకెవైసీ అభ్యంతరాలు ఇతర కారణాలతో కొంతమంది అనర్హులుగా తేలారు. వారంతా రైతు సేవా కేంద్రానికి వెళ్లి మళ్లీ నమోదు చేసుకోవాలని సూచించారు. ఇలా 1450 మంది రైతులు అర్హత సాధించారు. మొత్తంపైన 1,02,256 మంది అర్హులుగా నిర్ధారించారు. వారంతా వ్యవసాయ శాఖ పోర్టల్‌లో నమోదయ్యారు. అందరికీ బ్యాంకు ఖాతాలో సుఖీభవ సొమ్ములు జమ కానున్నాయి,
మూడు విడతల్లో సొమ్ములు
రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో రూ. 20 వేలు రైతు ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటిగా అన్నదాత సుఖీభవలో రైతులకు సొమ్ములు ఇవ్వనున్నట్టు కూటమి నేతలు ప్రకటించారు. హామీని నిలబెట్టుకోవడానికి ప్రతిఏటా మూడు విడతల్లో సొమ్ము జమ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద మూడు విడతల్లో రూ. 6 వేలు అందిస్తోంది. ఒక్కో విడతలో రూ. 2 వేలు జమ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం జమచేసిన రోజునే రాష్ట్ర ప్రభుత్వం కూడా సొమ్ములు జమ చేయాలని నిర్ణయిం చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 2 వేలతో కలిపి తొలి విడతగా ఆగస్టు రెండో తేదీన రైతు ఖాతాల్లో రూ.7 వేలు సొమ్ములు జమ చేయనున్నారు. అలాగే రెండో విడతలో రూ.7 వేలు, తుది విడతలో రూ. 6 వేలు వంతున రైతు ఖాతాల్లో జమ చేస్తారు. దీనికి సంబంధించి జిల్లాలో కసరత్తు పూర్తి చేశారు. జాబితాను సిద్ధం చేశారు.