బదిలీలపై మళ్లీ భగ్గు !
ABN , Publish Date - Jul 20 , 2025 | 12:17 AM
ఉమ్మడి జిల్లాలోని గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్–3 ఏఎన్‌ఎం(హెల్త్ సెక్రటరీ)లకు ఇటీవల జరిగిన బదిలీల్లో తాజాగా మరోదఫా మార్పులు, చేర్పులు చేటుచేసుకున్నాయి.
సవరణలతో కూడిన సచివాలయ ఏఎన్‌ఎంల బదిలీలపై ఫిర్యాదులు
ఏలూరు అర్బన్, జూలై 19(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్–3 ఏఎన్‌ఎం(హెల్త్ సెక్రటరీ)లకు ఇటీవల జరిగిన బదిలీల్లో తాజాగా మరోదఫా మార్పులు, చేర్పులు చేటుచేసుకున్నాయి. ఒకేచోట ఐదేళ్ల సర్వీసు ముగిసిన ఏఎన్‌ఎంలకు ఈనెల మొదట్లో జరిగిన బదిలీల కౌన్సెలింగ్‌పై వివాదాలు చెలరేగిన విషయం విదితమే. ఈమేరకు బదిలీలు ఖరారైన 594మంది ఏఎన్‌ఎంలను విధుల నుంచి రిలీవ్ చేయవద్దని, ఆ మేరకు తదుపరి ఉత్తర్వులిచ్చేవరకు ఎక్కడివారక్కడే పనిచేయాలని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు మౌఖిక ఆదేశాలిచ్చాయి. దీనికనుగుణంగానే తొలుత విడుదల చేసిన జాబితాలో బదిలీ స్థానాలు ఖరారైనవారిలో పలువురి స్థానాలను సవరిస్తూ మొత్తం 584మంది రూరల్ ఏఎన్‌ఎంలతో కూడిన జాబితాను తాజాగా శుక్రవారం రాత్రి విడుదల చేయగా, శనివారం ఉదయం నుంచే పలువురు ఫిర్యాదులతో వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి చేరుకోవడం ప్రారంభమైంది. తొలుత జరిగిన జూమ్ కౌన్సెలింగ్‌లో నిబంధనల మేరకు బదిలీ స్థానాలు ఖరారైన పలువురు ఏఎన్‌ఎంలు తాజాగా సవరణలతోకూడిన జాబితాలో స్థానచలనం కలగడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమ ప్రమేయం లేకుండా, కనీసం ఐచ్ఛికాలివ్వని స్థానాలకు ఏకపక్షంగా ఎలా బదిలీచేస్తారని ప్రశ్నించారు. ప్రతీ మండలంనుంచి ఇటువంటి ఫిర్యాదులున్నట్టు తెలుస్తోంది. ఫిర్యాదులను తీసుకున్న డీఎంహెచ్‌వో కార్యాలయ సిబ్బంది, బదిలీల ప్రక్రియకు సంబంధించిన తాజా సవరణల్లో అభ్యంతరాలను మాత్రమే స్వీకరిస్తా మని, వాటిని పరిష్కరిం చాల్సిన అధికారులు, సంబంధిత సెక్షన్ ఉద్యోగి ప్రస్తుతం అందుబాటులో లేరని పంపించేస్తున్నారని వాపోతున్నారు.
బదిలీ ఏఎన్‌ఎంలలో ఆందోళన
తాజాగా విడుదల చేసిన జాబితాలోవున్న ఏఎన్‌ఎంలందరూ తక్షణమే పనిస్థానాల్లో విధుల నుంచి రిలీవై, ఆ వెంటనే నూతన బదిలీస్థానాల్లో చేరాలని డీఎంహెచ్‌వో కార్యాల య అధికారులు ఆదేశాలు జారీచేయడంతో నష్టపోయిన ఏఎన్‌ఎంలలో ఆందోళన నెలకొంది. మరోవైపు తొలుత విడుదల చేసిన బదిలీల జాబితా, తాజాగా సవరణలతో కూడిన జాబితా రెండింటిపైనా రిలీవింగ్, జాయినింగ్‌లను ఈనెల 5వ తేదీని పేర్కొనగా, ఇప్పుడు శనివారం కొత్తస్థానాల్లో చేరితే సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఇటీవల జిల్లానుంచి బదిలీఅయిన అధికారి పాలనలో జరిగిన ఉద్యోగుల సాధారణ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియల్లో పారదర్శకత లోపించిందనడానికి డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద గత నెలలో ఒకరోజున తెల్లవారుఝాము వరకు జరిగిన ఆందోళనలు, ఒకసారి బదిలీ ఖరారైన ఉద్యోగుల్లో కొందరికి మళ్లీ మార్పులు, ఆ మేరకు కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత సవరణలు, ఉన్నతాధికారుల చీవాట్లు, స్వయంగా ప్రజాప్రతినిధులే జోక్యం చేసుకోవాల్సి రావడం.. తదితరాలన్నీ పరిపాలనాపరమైన వైఫల్యాలుగా భావిస్తున్నారు.
అన్యాయం జరిగితే నేరుగా సంప్రదించండి : డీఎంహెచ్‌వో
సచివాలయ ఏఎన్‌ఎంల బదిలీలపై వస్తున్న ఫిర్యాదులపై డీఎంహెచ్‌వో డాక్టర్ పీ.జే.అమృతం వద్ద వివరణ కోరగా కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాతే తాను జిల్లాలో బాధ్యతలు చేపట్టినందున పూర్తివివరాలు తెలియ వన్నారు. బదిలీలు ఖరారైన ఏఎన్‌ఎంలలో కొందరు తమ పనిస్థానాలు, మండలాల పేర్లలో తప్పులు దొర్లాయని శనివారం ఫిర్యాదు చేశారని, వాటిని పరిశీలించి పరిష్కరించాల్సిందిగా కార్యాలయ సిబ్బందిని ఆదేశించానన్నారు. ఇంకా ఎవరికైనా బదిలీల్లో అన్యాయం జరిగిందని భావిస్తే, దానికి సహేతుకమైన ఆధారాలతో నేరుగా వస్తే పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు.