Share News

జిల్లాకు అమృత్‌ నిధులు

ABN , Publish Date - Jul 27 , 2025 | 12:53 AM

జిల్లాలోని ఏలూరు నగరంతో పాటు పట్టణాలకు మహర్దశ పట్టనుంది. నగర, పట్టణ ప్రజలను ఎంతో కాలంగా పట్టిపీడిస్తున్న తాగునీటి సమస్య, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులకు మోక్షం కలగనుంది.

 జిల్లాకు అమృత్‌ నిధులు

రూ.464 కోట్లతో పథకం కింద పనులు

ఏలూరుటూటౌన్‌, జూలై 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఏలూరు నగరంతో పాటు పట్టణాలకు మహర్దశ పట్టనుంది. నగర, పట్టణ ప్రజలను ఎంతో కాలంగా పట్టిపీడిస్తున్న తాగునీటి సమస్య, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులకు మోక్షం కలగనుంది. అమృత్‌ 2.0 పథకంలో భాగంగా జిల్లాలోని ఏలూరు నగర పాలక సంస్థ, చింతలపూడి, నూజివీడు, జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీలకు రూ.464.28 కోట్లు మంజూరయ్యాయి. నగర,పట్టణాల ప్రజల తాగునీటి అవసరాలు, అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ వ్యవస్థ మెరుగుపరచడానికి ఈ నిధులు కేటాయించారు.

అమృత్‌ 2.0 పథకంలో భాగంగా జిల్లాకు నిధులు కేటాయించారు. ఏలూరు నగర పాలక సంస్థ పరిధిలో తాగునీటి సరపరాకు 143.13 కోట్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణానికి రూ.148.44 కోట్లు, తాగునీటి సరఫరా కోసం చింతలపూడి పట్టణానికి రూ.57.68 కోట్లు, నూజివీడు మునిసిపాలిటీకి రూ.13.87 కోట్లు, జంగారెడ్డి గూడేంకు రూ.101.16 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులకు డీపీఆర్‌ తయారు చేసి ప్రభుత్వానికి అధికారులు నివేదికలు పంపారు. ప్రభుత్వం వాటికి అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఇవి టెండర్ల దశలో ఉన్నాయి. టెండర్ల ప్రక్రియ పూర్తికాగానే పనులు మొదలుపెట్టే అవకాశం ఉంది. గత వైసీపీ ఐదేళ్ల పాలనలో అమృత్‌ నిఽధుల గురించి పట్టించుకోలేదు. ఈ పథకంలో 50 శాతం నిధులను కేంద్రప్రభుత్వం ఇస్తే మిగిలిన 50 శాతం నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం స్థానిక సంస్థలు, 30 శాతం భరించాల్సి ఉంటుంది. వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అప్పులపాలై దివాళ తీసిన నేపథ్యంలో అమృత పథకానికి 50 శాతం నిధులు వెచ్చించలేక కేంద్రం ఇచ్చే నిధులు తీసుకోకుండా పథకాన్ని నీరుగార్చారు. దీంతో నగరాలు, పట్టణాల్లో ఎక్కడ సమస్య లు అక్కడే తిష్ట వేశాయి. ముఖ్యంగా ప్రజలకు అతిముఖ్య మైన తాగునీటి సమస్య, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులు చేయలేక అనాటి వైసీపీ ప్రభుత్వం పట్టణ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసింది. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో అమృత్‌ పథకంలో జిల్లాకు రూ.464.28 కోట్లు కేటాయించేందుకు కృషి చేశారు.

ఏలూరు నగరపాలక సంస్థ ఏడు విలీన గ్రామాలతో కలిపి తాగనీటి సరఫరాకు 143.13 కోట్లు కేటాయిం చారు. ఈ నిధులతో పోణంగి దగ్గర 10 ఎంఎల్‌డీ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, పంపుల చెరువు దగ్గర మరో 10 ఎంఎల్‌డీ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మిస్తారు. రా వాటర్‌ పంపింగ్‌ కోసం 10.10 ఎంఎల్‌డీ ఎస్‌ఎస్‌.ట్యాంకు నిర్మిస్తారు. రా వాటర్‌, క్లీయర్‌ వాటర్‌ పంపింగ్‌ కోసం 14 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేస్తారు. ఐదు రిజర్వాయర్లు నిర్మిస్తారు. ఇంటింటికీ తాగునీటి సరఫరా కోసం 72.87 కిలోమీటర్ల మేర భూమిలో పైపులైన్లు వేస్తారు. కొత్తగా 4,618 ఇళ్లకు కుళాయిలు ఇస్తారు. వన్‌టౌన్‌ ఏరియాలో అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణంలో భాగంగా 15 ఎంఎల్‌డీ కెపా సిటీతో పోణంగిలో మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తారు. 148.44 కోట్లతో అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులు ప్రారంభిస్తారు. 52 కిలోమీటర్ల మేర అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీకి పైపులైన్లు నిర్మిస్తారు.

చింతలపూడికి తాగునీటి సరఫరా కోసం రూ.57.68 కోట్లు మంజూరయ్యాయి. వీటితో ఏడు ఎంఎల్‌డీ కెపాసిటీ గల వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు నిర్మిస్తున్నారు. ఎనిమిది రిజర్వాయర్లను ఏర్పాటు చేస్తారు. 98.81 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేస్తారు. నూతనంగా ఇంటింటికి ఆరు వేల కుళాయిలు వేస్తారు. నాగిరెడ్డిగూడెం రిజర్వాయర్‌ నుంచి తాగునీరు సరఫరా చేస్తారు.

నూజివీడుకు తాగునీటి కోసం రూ.13.87 కోట్లు కేటాయించారు. వీటిని పాడైన పైపులైన్ల మరమ్మతుల కోసం వినియోగిస్తారు. కొత్తగా నాలుగు వేలు ట్యాప్‌ కనెక్షన్లు ఇస్తారు.

జంగారెడ్డిగూడేంకు తాగునీటి సరఫరా కోసం 101.16 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో 30 ఎంఎల్‌డీ కెపాసిటీ గల వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు నిర్మిస్తారు. 45.43 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేస్తారు. నాలుగు రిజర్వాయర్లను నిర్మిస్తారు. కొత్తగా 9,486 కుళాయి కనెక్షన్లు ఇస్తారు.

టెండర్ల దశలో ఉన్నాయి..

అమృత్‌ పథకంలో ఏలూరు, చింతలపూడి, నూజివీడు, జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీలకు అమృత్‌ నిధులు మంజూరయ్యాయి. ప్రభుత్వ అనుమతులు లభించాయి. ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్నాయి. టెండర్లు పూర్తవగానే కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్‌ చేయించుకుని పనులు ప్రారం భిస్తాం.

– ఫణిభూషణ్‌రావు, పబ్లిక్‌ హెల్త్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌

Updated Date - Jul 27 , 2025 | 12:53 AM