Share News

క్షమాపణ చెప్పాల్సిందే..

ABN , Publish Date - Jun 10 , 2025 | 12:37 AM

అసత్యపు ప్రచారాలతో సమాజంలో దుష్ట సంప్రదాయాన్ని ప్రోత్సహిస్తున్న సాక్షి పేపర్‌, చానల్‌పై నిషేదం విధించాలని సోమవారం ఉమ్మడి పశ్చిమ జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అమరావతి ప్రాంత మహిళలను అవమాన కరంగా మాట్లాడిన కృష్ణంరాజును, కొమ్మినేని శ్రీనివాసరావును కఠినంగా శిక్షించాలని పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేశారు.

క్షమాపణ చెప్పాల్సిందే..
తణుకు నరేంద్ర సెంటర్‌లో సాక్షి ప్రతులను దహనం చేస్తున్న మహిళలు..

సాక్షి పేపర్‌, చానల్‌పై నిషేధం విధించాలని ఉమ్మడి పశ్చిమ జిల్లాలో నిరసనల వెల్లువ

సాక్షి ప్రతుల దహనం

అసత్యపు ప్రచారాలతో సమాజంలో దుష్ట సంప్రదాయాన్ని ప్రోత్సహిస్తున్న సాక్షి పేపర్‌, చానల్‌పై నిషేదం విధించాలని సోమవారం ఉమ్మడి పశ్చిమ జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అమరావతి ప్రాంత మహిళలను అవమాన కరంగా మాట్లాడిన కృష్ణంరాజును, కొమ్మినేని శ్రీనివాసరావును కఠినంగా శిక్షించాలని పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేశారు. వీటిని ప్రోత్సహిస్తున్న సాక్షి యాజమాన్యం వైఎస్‌.భారతిరెడ్డి, వైఎస్‌.జగన్‌ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సాక్షి ప్రతులను దహనం చేశారు.

పేపర్‌, చానల్‌పై నిషేదం విధించాలి : గన్ని, చంటి

ఏలూరుటూటౌన్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానిపై విషపు ప్రచారం చేస్తున్న సాక్షి పేపర్‌, చానల్‌పై నిషేదం విధించాలని ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే బడేటి చంటి డిమాండ్‌ చేశారు. అమరా వతి మహిళలను కించపరిచినందుకు ఏలూరు సాక్షి కార్యాలయం వద్ద సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో ఽనిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ అమరావతి ప్రాంత మహిళలను అవమానకరంగా మాట్లాడిన కృష్ణంరాజును అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే అరెస్టు చేసిన కొమ్మినేని శ్రీనివాసరావును కఠినంగా శిక్షించాల న్నారు. ఇటువంటి వ్యక్తులను ప్రోత్సహిస్తున్న సాక్షి యాజమాన్యం వైఎస్‌.భారతీరెడ్డి, వైఎస్‌.జగన్‌ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తొలుత టీడీపీ మహిళా ఆధ్వర్యంలో ర్యాలీగా సాక్షి కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు. డిప్యూటీ మేయర్‌ వందనాల దుర్గాభవాని, టీడీపీ పట్టణ అధ్యక్షురాలు తవ్వా అరుణకుమారి, అధికార ప్రతినిధి కడియాల విజయలక్ష్మి, కార్పోరేటర్‌ తంగిరాల అరుణ, టీడీపీ మహిళానేతలు పాల్గొన్నారు.

తణుకులో సాక్షి ప్రతుల దహనం

తణుకు : అమరావతి ప్రాంత మహిళలను ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ పేటీఎం జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నియోజకవర్గ తెలుగు మహిళలు నిరసన ధర్నా చేపట్టారు. సోమవారం పెద్దఎత్తున మహిళలు నరేంద్ర సెంటర్‌లో జరిగిన ఽధర్నాలో పాల్గొన్నారు. సాక్షి పత్రికలను దహనం చేశారు. సాక్షి, జర్నలిస్టులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తహసీల్దార్‌ డీవీఎస్‌ఎస్‌ అశోక్‌వర్మకు వినతి పత్రం అందజేశారు.

నూజివీడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

నూజివీడు టౌన్‌ : సాక్షి టీవీ డిబేట్‌లో అమరావతి మహిళలను కించపరిచేలా మాట్లాడిన జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలని నూజివీడు రూరల్‌ మండల ఎన్డీయే నాయకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నూజివీడు నియోజకవర్గ బీజేపీ నాయకులు గోగినేని శ్రీనివాస కుమార అప్పారావు, వైయస్‌ దొరై తదితరుల ఆధ్వర్యంలో నూజివీడు రూరల్‌ పోలీసుస్టేషన్లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకులు గోగినేని మధు, మున్సిపల్‌ కౌన్సిలర్‌ పాదం సత్యనారాయణ పాల్గొన్నారు.

చానల్‌ లైసెన్సు రద్దు చేయాలి

ఆచంట ఎమ్మెల్యే పితాని

పెనుమంట్ర : ఆంధ్రుల రాజధాని అమరావతిపై అసభ్య పదజాలంతో మాట్లాడిన సాక్షి చానల్‌ ప్రతినిధులపై క్రిమినల్‌ కేసులో నమోదు చేసి, ప్రసారం చేసిన చానల్‌ లైసెన్సు రద్దు చేయాలని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. పెనుమంట్ర మండలం ఎస్‌.ఐపర్రు, మల్లిపూడిలో ‘పల్లెపల్లెకు మన పితాని ప్రజా స మస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తల్లిని ఆస్తి కోసం కోర్టు చుట్టూ తిప్పుతూ, చెల్లిని ఇంటి నుంచి పంపించేసి వెన్నుపోటు పొడిచావని గుర్తు చేశారు. అసలు సిసలైన వెన్నుపోటు దారుడు జగన్మోహన్‌రెడ్డి అని గుర్తు చేశారు. అబద్ధపు ప్రచారం చేస్తూ అమరావతిపై జగన్‌ మీడియా విషం కక్కుతుందని ఆరోపించారు. తక్షణమే సాక్షి మీడియా ప్రసారాలను నిలుపుదల చేయాలని రాజధానిపై విష ప్రచారాన్ని చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

రాజధాని ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేయాలని కుట్ర

పాలకొల్లు అర్బన్‌, జూన్‌ 9 (ఆంధ్ర జ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేయాలన్నదే వైసీపీ వర్గాల ఆలోచన అని, దీనిలో భాగంగా గతంలో ఎన్నో కుతంతాలు చేసి 2019లో అధికారంలోకి వచ్చి ఐదేళ్లపాటు అమరావతి రాజధాని కాకుండా ప్రయత్నిం చారని తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షు రాలు కర్నేన రోజారమణి అన్నారు. సోమవారం తన నివాసంలో ఆమె మాట్లాడుతూ అనేక విధాలుగా రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ మూకలు నేడు చర్రిత కలిగిన రాజధానిలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. జరిలిస్టుల ముసుగులో డ్రామాలు ఆడిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఆమెతో పాటు భర్త, తెలుగు దేశం పార్టీ బిసి సెల్‌ జిల్లా అధ్యక్షుడు కర్నేన గౌరునాయుడు తదితరులు ఉన్నారు.

మహిళలను కించపరిచే వ్యాఖ్యలు శోచనీయం

ఏలూరు రూరల్‌ : రాజధాని అమరావతి మహిళలను వేశ్యలంటూ అగౌరవ పర్చిన జర్నలిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావులపై సుమోటోగా కేసులు నమోదు చేయాలని ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు సీహెచ్‌ విక్రమ్‌ కిశోర్‌ డిమాండ్‌ చేశారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అడపా శోభారాణితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి సాక్షి చానల్‌లో నీతిమాలిన మాటలు మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు శోభారాణి మాట్లాడుతూ మహిళలపై జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు క్షమించరాని నేరమన్నారు. ఏఎంసీ వైస్‌ చైౖర్మన్‌ వాణి భాస్కర్‌, అసెంబ్లీ కన్వీనర్‌ గాది రాంబాబు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కాట్రు విజయ్‌, నెక్కంటి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

అమరావతిపై విషం కక్కుతోంది : రాధాదేవి

పెనుమంట్ర : అమరావతి రాజధానిపై సాక్షి మీడియా విషం కక్కుతోందని తెలుగుదేశం పార్టీ పెనుమంట్ర మండల టీడీపీ మహిళ అధ్యక్షురాలు భూపతిరాజు రాధాదేవి ఆరోపించారు. పెనుమంట్రలో ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ టీవీ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్‌ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాస్‌ అమరావతి మహిళలపై చేసిన అనుచితవ్యాఖ్యలను ఖండించారు. వేశ్యల రాజధానిగా వర్ణించడం మహిళలను అవమానించడమేనని, తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. టెలివిజన్‌ ప్రసారాలను నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 10 , 2025 | 12:41 AM