అక్షర విజయం
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:59 AM
నూజివీడు పట్టణంలో ఈ ఏడాది జనవరి 28వ తేదీన ప్రజా సమస్యలపై ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండా’గా వినూత్నమైన కార్యక్రమాన్ని ఆంధ్రజ్యోతి నిర్వహించింది.
నూజివీడులో రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు
రూ.200 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ఏర్పాటుకు డీపీఆర్
పట్టణంలో ‘ఆంధ్రజ్యోతి‘ సక్సెస్ మీట్
నూజివీడు,ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): నూజివీడు పట్టణంలో ఈ ఏడాది జనవరి 28వ తేదీన ప్రజా సమస్యలపై ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండా’గా వినూత్నమైన కార్యక్రమాన్ని ఆంధ్రజ్యోతి నిర్వహించింది. ఈ సందర్భంగా అక్షరం అజెండాలో మున్సిపల్ అధికారులు సమస్య లు విన్నారు.. పరిష్కరించారు. నూజివీడు మున్సిపల్ చైర్‌పర్సన్ రామిశెట్టి త్రివేణిదుర్గ అధ్యక్షతన సభ నిర్వహించి, నూజివీడు మునిసిపల్ ప్రజలను ఆహ్వానించింది. అక్కడ సమస్యలన్నీ చైర్‌పర్సన్ విన్నారు. వాటిని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథి దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆంధ్రజ్యోతి తనవంతు పాత్రను పోషించింది. అనంతరం సమస్యల పరిష్కారానికి మంత్రి పార్థసారథి తనదైన శైలిలో కృషిచేశారు. నూజివీడు పట్టణాన్ని ముంపునకు గురిచేసిన పెద్దచెరువు గండిని యుద్ధప్రాతిపదికన పూడ్చాలని ఆదేశించారు. దాదాపు రూ.2 కోట్ల వ్యయంతో పెద్దచెరువు గండ్లను పూడ్చటమే కాక చెరువుకట్టను అభివృద్ధి పరిచారు. ఇవేకాక మరో రూ.8 కోట్ల వరకు నిధులను మంజూరు చేయించి ప్రజలు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు కేటాయించారు. దీనిలో భాగంగానే నూజివీడు సంగం కాంప్లెక్స్‌లో ‘ఆంధ్రజ్యోతి’ సోమవారం సాయంత్రం 4 గంటలకు తణుకు యూనిట్ ఎడిషన్ ఇన్‌చార్జి రామకృష్ణ అధ్యక్షతన సక్సెస్ మీట్ నిర్వహించింది. ముఖ్య అతిథిగా మునిసిపల్ చైర్‌పర్సన్ రామిశెట్టి త్రివేణిదుర్గ హాజరై మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో నిర్మాణాత్మకమైన పాత్రను ఆంధ్రజ్యోతి పోషించిందన్నారు.
అన్ని వార్డుల్లోనూ అభివృద్ధి పనులు : పగడాల
నూజివీడు మునిసిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ మాట్లాడుతూ సీఆర్‌డీఏ నిధుల కింద నూజివీడు పట్టణంలో రాజకీయాలకు అతీతంగా అన్ని వార్డులకు సమానంగా అభివృద్ధి పనులను కేటాయించా మన్నారు. పట్టణంలోని 32 వార్డుల్లో రహదారుల అభివృద్ధి, డ్రెయిన్‌ల నిర్మాణం చేపడతామన్నారు. గత జనవరిలో ఆంధ్రజ్యోతి నిర్వహించిన సదస్సులో ప్రజలనుంచి వచ్చిన సమస్యల్లో దాదాపు 80శాతం సమస్యలు పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్నాయన్నారు. కోతులు, కుక్కల బెడద ఉన్నా కొన్ని సాంకేతిక పరమైనటువంటి అంశాలతో వాటిని పరిష్కరించలేని పరిస్థితి నెలకొందన్నారు. పట్టణంలో పలు రహదారుల అభివృద్ధికి బీటీ వర్క్ నిర్వహించేందుకు రూ.80లక్షల వ్యయంతో అంచనాలు సిద్ధం చేశామని, త్వరలో అభి వృద్ధి పనులు చేపడతామన్నారు. సమ్మర్ స్టోరేజి ట్యాంక్ నిర్మాణంకు సంబంధించి స్థల సేకరణకు చర్యలు చేపట్టామన్నారు. జాతీయ స్థాయిలోనే నూజివీడును మణిహారంగా తీర్చేదిశగా అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీకి రూ.200 కోట్లతో డీపీఆర్‌ను కేంద్రానికి పంపించామన్నారు. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి చొరవతో పనులు ముందుకు సాగి.. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజి వ్యవస్థ, రింగ్ రోడ్లు ఏర్పాటయితే నూజివీడు అభివృద్ధి మరింత సాధ్యమవుతుందన్నారు.
రహదారుల విస్తరణ జరగాలి : నూతక్కి
నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు నూతక్కి వేణుగోపాలరావు మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి అక్షర సమరంతో మున్సిపాల్టీలోని ప్రతి సమస్యకు ఒక్కొక్కటిగా పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నారు. ఆంధ్రజ్యోతికి ప్రజాపక్షం గొంతుక ఉండడం వల్లే ఇది సాఽధ్యం. నూజివీడు పట్టణం అభివృద్ధి చెందాలంటే వ్యాపారరంగం ముందడుగు వేయాలి. మెగా మాల్స్ వచ్చి చిరువ్యాపారులు దెబ్బతిన్నారు అనడం సరికాదు. జమిందారీ కాలం నాటి రోడ్లు, విస్తరణ జరగకపోవడం వల్లే పార్కిం గ్ సమస్య, ట్రాఫిక్ సమస్యతో వ్యాపారాలు అభివృద్ధి చెందడం లేదు. రహదారుల విస్తరణ జరిగితే అన్ని వ్యాపారాలు గాడినపడతాయి. మంత్రి కొలుసు పార్థసారథి పట్టణంలో ఇండోర్ స్టేడియానికి రూ.కోటి 75 లక్షలు మంజూరు చేయించి, వాడుకలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు.
ఆంధ్రజ్యోతి చొరవతో సమస్యల పరిష్కారం : నాగరాణి
నూజివీడు పట్టణ భారతీయ జనతాపార్టీ అధ్యక్షురాలు ఎం.నాగరాణి మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి చొరవతో అనేక సమస్యలు పరిష్కారమయ్యేదిశగా అడుగులు పడ్డాయని, అయితే పలు అవసరాలరీత్యా నూజివీడు పట్టణానికి వస్తున్న ప్రజలు టాయ్‌లెట్‌కు వెళ్లేదుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని, ప్రధానంగా మహిళలను దృష్టిలో పెట్టుకుని నూజివీడు పట్టణంలో పబ్లిక్ టాయ్‌లెట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరత ఉందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోనూ సదస్సులు నిర్వహించాలి
‘అక్షరం అండగా.. పరిష్కారం అజెండా’ సక్సెస్ మీట్ అంటే కార్యక్రమా నికి హాజరయ్యా. దాదాపు 8 నెలల క్రితం నిర్వహించిన సదస్సులో ప్రస్తావించిన అంశాలకు పరిష్కారా లను ఆంధ్రజ్యోతి చూపగలిగింది. ఇటువంటి సదస్సులు పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏర్పాటుచేస్తే అభివృద్ధి చెందుతాయి. పట్టణంలో మొగలిచెరువు కాలుష్యానికి నిలయంగా మారుతోంది. దానిని శుభ్రపరిచి అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తే బాగుంటుంది.
– కిశోర్, సుంకొల్లు, నూజివీడు మండలం
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలి
నూజివీడు పట్టణంలో ఐదు గంటలు దాటితే రోడ్లపై వాహనం నడపాలంటే కత్తిమీద సామే. సమస్య పరిష్కారానికి రహదారుల విస్తరణతో పాటు నూజివీడులో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలి. పట్టణంలో కోతులు, కుక్కల బెడద అధికంగా ఉంది. రూ.లక్షతో ఇంటికి సోలార్ ఫెన్షింగ్ ఏర్పాటు చేసుకున్నాం. నిరుపేదల పరిస్థితిని అర్ధం చేసుకుని మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలి.
– కె.ప్రభాకర్, విశ్రాంత ఆంరఽధా బ్యాంకు మేనేజర్
మనిషి ప్రాణం కంటే జంతువులే ముఖ్యమా ?
జంతు ప్రేమికులు, కుక్కలు, కోతులకు హానిచేయకూడదని సూచిస్తున్నారు. అటువంటప్పుడు కోళ్లను, మేక మాంసాన్ని ఏవిధంగా విక్రయిస్తున్నారు ? మనుషుల ప్రాణంకంటే జంతువుల ప్రాణమే ముఖ్యమా? దీనిపై పూర్తిస్థాయిలో జంతు ప్రేమికులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. దీనికి ప్రతి ఒక్కరం సిద్ధంగా ఉండాలి.
– టి.లాజరస్, నూజివీడు
కొన్ని సూచనలతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం
నూజివీడు పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యను కొన్ని సూచనలతో పరిష్కరించవచ్చు. ప్రధానంగా వాహనాలు నిలుపుదల చేస్తున్న ప్రదేశాలను కొద్దిగా మార్పుచేస్తే ఆ సమస్యను అధికమించవచ్చు. దీనికి సంబంధించి పోలీస్, ఆర్టీసీ, ఆర్టీఐ, మునిసిపల్ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తే బాగుంటుంది.
– నడికట్ల వెంకటేశ్వరరావు, నూజివీడు
నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ‘ఆంధ్రజ్యోతి’
ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఆంధ్రజ్యోతి వ్యవహరిస్తోంది. లిక్కర్ ధరలు పెంచి, విక్రయించడంపై ఆంధ్రజ్యోతి ఇచ్చిన కథనాలతో ఏకంగా ఆ శాఖ అధికారులే కదలివచ్చారు. అదేరీతిన గత 8 నెలల క్రితం నిర్వహించిన సదస్సులో ప్రస్తావించిన ప్రతి అంశాన్ని పరిష్కారం చూపేదిశగా ఆంధ్రజ్యోతి తీసుకున్న చొరవ అధికారుల పనితీరుకు ఈ సక్సెస్ మీటే నిదర్శనం.
– ఎం.రాజశేఖర్, నూజివీడు
ఆంధ్రజ్యోతి తాడేపల్లిగూడెం యూనిట్ బ్రాంచి మేనేజరు హరిబాబు మాట్లాడుతూ ‘అక్షరం అండగా.. పరిష్కారం అజెండాగా కార్యక్రమం’ అంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య ఆలోచనల నుంచి పురుడు పోసుకుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపా యలతో ముడిపడి ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఆంధ్రజ్యోతి కృషి చేసిం దన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 కేంద్రాల్లో సదస్సులు నిర్వహించి, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారం దిశగా విజయం సాధించగలిగామన్నారు. కార్యక్రమంలో ఆంరఽధజ్యోతి బ్యూరో ఇన్‌చార్జి జీవీఎస్‌ఎన్ రాజు, యాడ్స్ మేనేజర్ రాజు, నూజివీడు మున్సిపల్ ఏఈ వంశీ అభిషేక్, టీపీవో కె.వెంకటేశ్వర రావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ నాగరాజు, ఆర్‌ఐ ఆర్.సందీప్, ఆంధ్రజ్యోతి సిబ్బంది పాల్గొన్నారు.